Bajrangi bhayjan
-
ఈ వారం యూట్యూబ్ హిట్స్
ఫాంటమ్ : ట్రైలర్ నిడివి : 2 ని. 41 సె. హిట్స్ : 26,59,944 బజ్రంగీ భాయ్‌జాన్ దర్శకుడు కబీర్ ఖాన్ మళ్లీ ఇంకో సినిమాను తెరపైకి తెస్తున్నారు! 26/11 బాంబు పేలుళ్ల కథాంశంతో కబీర్ తీసిన ‘ఫాంటమ్’ ఈ నెల 28 న విడుదల కాబోతోంది. సయీఫ్ అలీఖాన్, కత్రీనా కైఫ్ నటించిన ఈ చిత్రం ట్రైలర్... ఎంతో ఉత్కంఠభరితంగా, సినిమాపై ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. థీమ్ ఒకటే కాబట్టి... హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘జీరో డార్క్ థర్టీ’ (2012) కి, ‘ఫాంటమ్’కీ మధ్య కొన్ని పోలికలు కనిపించవచ్చు. బ్లాక్ మాస్ : ట్రైలర్ నిడివి : 2 ని. 31 సె. హిట్స్ : 20,23,216 అమెరికా నేర పరిశోధన సంస్థ ఎఫ్.బి.ఐ.కి, 1970ల నాటి ఆ దేశపు నేరగాడు వైటీ బల్జర్కు మధ్య సాగిన ‘అపవిత్ర’ బంధాన్ని కథాంశంగా తీసుకుని స్కాట్ కూపర్ దర్శకత్వం వహించి, నిర్మించిన చిత్రం ‘బ్లాక్ మాస్’పై ఇది మూడో ట్రైలర్. హాలీవుడ్ చిత్రాలలో తరచు తలపై పక్షితో కనిపించే జానీ డిప్ ఇందులో వైటీ బట్జర్ పాత్రను పోషిస్తున్నారు. (బహుశా మొదటిసారిగా తలపై పక్షి లేకుండా). సినిమా విడుదల సెప్టెంబర్ 18. బజ్రంగి భాయ్‌జాన్ డైరీస్ : హర్షాలీ నిడివి : 3 ని. 18 సె. హిట్స్ : 12,69,633 సెట్స్‌లో ఉన్నప్పుడు బజరంగీ భాయ్‌జాన్ లోని ఆరేళ్ల చిన్నారి హర్షాలీ రకరకాలుగా ప్రవర్తించేది. సాటి పిల్లలతో ఎలా ఉండేదో స్టార్లతో అలా ఉండేది. ఓసారైతే దర్శకుడు ధ్యాన ముద్రలో ఉండి సన్నివేశాలను షూట్ చేస్తున్నప్పుడు మధ్యలోకి వెళ్లి ఆయన జుట్టు పట్టుకుని లాగింది! ఇంకోసారి అనెక్స్పెక్టెడ్గా ఆయనకు ఓ ముద్దు కూడా ఇచ్చింది. ఇలాంటి బిహైండ్ ద సీన్స్ అన్నిటినీ కలిపి కూర్చిన వీడియో ఇది. స్ప్లిట్‌విల్లా సీజన్ 8 ఎపిసోడ్ 6 నిడివి : 44 ని 13 సె. హిట్స్ : 10,66,361 ఈ... ప్రేమ, లాలసల క్రీడ... స్ల్పిట్విల్లాలో మెలికలు, మలుపులు కొనసాగుతూనే ఉన్నాయి. సుబుహీ అనే అమ్మాయి ‘క్వీన్’గా ఎంపికయింది. ఇక చెప్పేదేముంది? అబ్బాయిలకు ప్రేమ గండం. తర్వాత ఎంపిక కావలసింది ‘కింగ్’. ‘థార్న్ అండ్ రోజెస్’ అనే వినూత్నమైన పోటీతో అతడిని ఎన్నుకోవడాన్ని ఈ వీడియోలో మనం వీక్షించవచ్చు. ఎం.టి.వి.లో వస్తున్న ఇండియన్ రియాలిటీ షోనే స్ల్పిట్ విల్లా. అమెరికన్ డేటింగ్ షో ‘ఫ్లేవర్ ఆఫ్ లవ్ ’ ప్రేరణతో రూపొందిన ఈ షో.. ప్రస్తుతం 8వ సీజన్లో ఉంది. అందులోని 6వ ఎపిసోడ్ ఇది. హౌ టు ‘క్రికెట్’ : ఎ.ఐ.బి. అండ్ జెస్ రైన్ నిడివి : 4 ని. 8 సె. హిట్స్ : 4,06,982 క్రికెట్ ఆడడం ఎలా అనే టాపిక్‌తో సరదాగా తయారైన వీడియో ఇది. భారతదేశంలో పేరు మోసిన వివాదాల కామెడీ గ్రూపు అ ఐఛీజ్చీ ఆ్చజుఛిూూూ (అఐఆ), టొరంటో లోని యూ ట్యూబ్ గ్రూపు ‘జెస్ రైన్’ కలిసి క్రియేట్ చేసిన ఈ వ్యంగ్య దృశ్యమాలిక అందర్నీ ఆకట్టుకుంటోంది. నవ్వు తెప్పించే ముఖాలతో ఉన్న ఎనభైల నాటి క్రికెట్ ఆటగాళ్లు కొందరు ఇందులో క్రికెట్లోని బేసిక్స్, స్కిల్స్ చెబుతుంటారు. మచ్చుకి: క్రికెట్లో 11 మంది ప్లేయర్సే ఎందుకు ఉంటారు? అనే ప్రశ్నకు వారి జవాబు: ‘పన్నెండో ప్లేయర్ చచ్చిపోయాడు కనుక’. బ్రదర్స్ యాంథమ్ నిడివి : 2 ని. 22 సె. హిట్స్ : 3,09,057 బ్రదర్స్ చిత్రంలోని సంఘీభావ గేయం ఇది. అక్షయ్ కుమార్, సిద్ధార్థ మల్హోత్రా తమ కండర విన్యాసాలను, వ్యాయామాలను ప్రదర్శిస్తుండగా నేపథ్య గేయంగా వినిపిస్తుంటుంది. గానం విశాల్ దడ్లానీ. సంగీతాన్ని సమకూర్చింది 2012 నాటి అగ్నిపథ్ చిత్రంలోని ఐటమ్ సాంగ్ ‘చిక్నీ చమేలీ’కి సంగీతాన్నిచ్చిన జంట అజయ్, అతుల్. ‘తేరి బారి హై కమర్ కస్ లె / తేరె బస్ మే హై సారే మస్లే / తేరె టూటె హు దిల్కి జమీనొ పే / హిమ్మత్ కి ఉగా లె ఫస్లీ..’ వంటి స్ఫూర్తిదాయకమైన వాక్యాలతో ఈ గేయం యూత్‌ని ఉరకలెత్తిస్తోంది. -
సెల్ఫీ భాయ్‌జాన్
సెల్ఫ్, అంటే చాలామంది అనుకునేది ఇగో అని! అయాన్‌రాండ్ తన నవల ఫౌంటెయిన్హెడ్లో అంటుంది - ‘బాగా సెల్ఫిష్ అయిపో. ముందు నిన్ను నువ్వు ప్రేమించు. తరువాత ఇంకా సెల్ఫిష్ అయిపో.. నీ కుటుంబాన్ని ప్రేమించు. ఆ తర్వాత ఇంకా సెల్ఫిష్ అయిపో... నీ ఊరిని ప్రేమించు. అలా, అలా సెల్ఫిష్ అయిపోతూ ఈ విశ్వాన్ని ప్రేమించు.’ సల్మాన్‌ఖాన్ బజ్రంగీ భాయ్‌జాన్ సినిమాలో తన సెల్ఫిష్నెస్ని చూపించుకున్నాడు. తన సెల్ఫ్నే చూపించుకున్నాడు. హ్యూమన్ బీయింగ్ నుంచి ‘బీయింగ్ హ్యూమన్’ వరకు తన ప్రయాణంలో వచ్చిన పరిణామాన్ని చాటిచెప్పుకున్నాడు. ఈ కథ, దాని కథనం మీరే చదవండి. సెల్ఫీ భాయ్జాన్లా... మీరూ బాగా సెల్ఫిష్ అయిపోండి. ఎంజాయ్! రామ్ ఎడిటర్, ఫీచర్స్ ఇటీవల కోర్టులో న్యాయమూర్తి సల్మాన్‌ను ఒక ప్రశ్న అడిగారు. నీ మతం ఏమిటి? సల్మాన్ జవాబు: నేను ఇండియన్ని. అది జవాబు కాదు. నువ్వు పాటించే మతం ఏమిటి? సల్మాన్ జవాబు: నేను ముస్లింని. నేను హిందువుని. నేను రెండూ. రెండు మూడు నెలలు గడిచిపోయాక ఇప్పుడు తాజాగా సల్మాన్ సినిమా రాబోతోంది. బజ్రంగీ భాయ్‌జాన్. బజ్రంగీ ఒక ధర్మం. భాయ్‌జాన్ మరో ధర్మం. రెంటినీ కలిపి ఉంచగలిగే ఒక హీరో- సల్మాన్. గ్లిజరిన్ లేకుండా నేను ఏడ్వగలగాలి. అలాంటి స్క్రిప్ట్ ఏమీ లేదా? అడిగాడు సల్మాన్ దర్శకుడు కబీర్ఖాన్ని. ఇద్దరూ ‘ఏక్ థా టైగర్’ సినిమా చేశారు. క్షణాల్లో ద కోట్ల కలెక్షన్లు సాధించారు. సినిమా అంత బాగలేదన్నారు. కాని డబ్బు దండిగా వచ్చింది. ఈసారి అలా కాదు. డబ్బూ రావాలి సినిమా బాగుండాలి. అలాంటి కథ ఇక్కడ దొరకడం లేదు అన్నాడు కబీర్‌ఖాన్. మరేం చేద్దాం? సౌత్‌లో ట్రై చేద్దాం. ఎవరున్నారు? మనకు తెలిసినవాళ్లే. డెరైక్టర్ రాజమౌళి ఫాదర్. విజయేంద్ర ప్రసాద్. హైదరాబాద్ అంటే హృదయం ఉన్న నగరం. హిందూ అనీ ముస్లిం అనీ యోచించకుండా అందరూ హాయిగా బతికే నగరం. ఈ నగరంలో ఉన్నప్పుడు హృదయమున్న కథలు తట్టడంలో ఆశ్చర్యం లేదు. విజయేంద్ర ప్రసాద్‌కు తట్టింది. ఒక చిన్న పిల్ల. తప్పిపోయింది. అక్కణ్ణుంచి ఇక్కణ్ణుంచి కాదు. పాకిస్తాన్ నుంచి తప్పి పోయింది. అక్కడా ఇక్కడా కాదు. ఇండియాలో. వివరం చెప్దామంటే నోరు లేదు. సాయం అడగాలంటే తోడు లేదు. ఇలాంటి వారికి ఎవరు దిక్కు. దేవుడే దిక్కు. అదిగో అతడే దేవుడు. సాటి మనిషికి సాయం చేయడమే నిజమైన దైవత్వం అనుకునే నిర్మలమైనవాడు. బజ్రంగీ. అతను ఆ అమ్మాయిని కలుస్తాడు. అక్కున జేర్చుకుంటాడు. పాకిస్తాన్‌కు తీసుకువెళతాడు. ఇందులో హిందూ ఏముంది స్లిం ఏముంది... పరోపకారమే ఏ మనిషైనా పాటించాల్సిన నిజమైన మతం. అదీ కథ. విజయేంద్ర ప్రసాద్ చెప్పిన ఈ కథకు సల్మాన్‌కు గ్లిజరిన్ అవసరం ఏర్పడలేదు. కళ్లు తుడుచుకుంటూ లేచి నిలబడ్డాడు. మనం ఈ సినిమా చేస్తున్నాం. ఇక అక్కణ్ణుంచి ఆ సినిమాకు విస్తృత రూపం ఇవ్వడం మొదలయ్యింది. సరిహద్దుల్లోని ఓ ప్రాంతం. ఒక సాదాసీదా కుర్రాడు పవన్ కుమార్ చతుర్వేది. పహిల్వాన్ల వంశం. కనుక ఆంజనేయ స్వామికి వీరభక్తుడు. అందుకే అందరూ అతణ్ణి బజ్రంగీ అని పిలుస్తారు. వాళ్ల కాలనీలో ఏ వేడుక అయినా అతని చేతుల మీద జరగాల్సిందే. ఎవరు తప్పు చేసినా అతని దెబ్బకు వీపు చిట్లాల్సిందే. అలాంటి వీరుడు ఒకమ్మాయి ఓర చూపుకు ఫ్లాటై పోయాడు. ఆమె నవ్వుకు నేల కరుచుకుపోయాడు. ఇంట్లో ఊరుకుంటారా? ఏవో అబ్జెక్షన్సు. ఇదో పులి అయితే మరి కాసేపటికి ఈ పుట్ర తోడైంది. అమ్మెవరో తెలియదు. అయ్య ఎవరో తెలియదు. ఏ ఊరో తెలియదు. అడుగుదామంటే నోరు లేదు. నీకు మాటలు రావా? నేను ఒక్కో ఊరి పేరు చెప్తూ పోతాను. ఏ ఊరు మీదైనా ఆ ఊరి దగ్గర చెయ్యెత్తు. జబల్పూర్, ఉదయ్‌పూర్, ఇటావా, నాగ్‌పూర్.... ఎన్ని ఊర్లు చెప్పినా ఆ అమ్మాయి చేయెత్తడం లేదు. చివరకు విసిగిపోయి- పాకిస్తానా అన్నాడు. ఆ పాప సంబరంగా అవును.. అవును... అని ఎగరడం మొదలెట్టింది. పవన పుత్రుడికి సరిహద్దు వేడిగాలి తగలడం మొదలయ్యింది. హతవిధీ.... ఇప్పుడు ఆ అమ్మాయిని పాకిస్తాన్ తీసుకెళ్లాలి. పాస్‌పోర్ట్ లేదు. వీసా అడిగితే ఏజెంట్ కూచోబెట్టి అమెరికా కావాలంటే పంపుతాను జర్మనీకి కావాలంటే పంపుతాను టునీషియా కావాలంటే పంపుతాను... కాని పాకిస్తాన్‌కు మాత్రం పంపలేను అంటాడు. మామూలు మనిషైతే ఇక్కడకు కథ అయిపోవాలి. ఆ అమ్మాయిని పోలీస్‌స్టేషన్‌లో వదిలిపెట్టడం అధమం. తనే పెంచుకుకోవడం సాధారణం. అయిన వాళ్ల కోసం కొద్దో గొప్పో ప్రయత్నించడం ఉత్తమం. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఎదిరించి విజయం సాధించడం... ధీరోదాత్తం అవుతుంది అనుకుంటున్నారా.... కాదు, అతి మామూలు మానవత్వం. అతడిలో మానవత్వం ఉంది. దానికి నిస్వార్థమైన సంకల్పం ఉంది. అది నిస్వార్థమైనప్పుడు ప్రకృతికి అది తెలుస్తుంది. సరే బయలుదేరు అన్నారు అందరూ. పని మంచిదైనప్పుడు అడ్డదారే సరైన దారి అవుతుంది. చట్టాన్ని ఉల్లంఘించడం ధర్మాన్ని నిలబెట్టడం అవుతుంది. అతడు ఎడారి మార్గం గుండా పాకిస్తాన్ చేరుకుంటాడు. పాప తల్లిదండ్రులను కనిపెట్టడానికి పెను ప్రయత్నాలు చేస్తాడు. అక్కడ పని చేస్తున్న ఒక పాకిస్తానీ జర్నలిస్ట్ ఇతడికి సాయం చేస్తూ- ఫలానా దర్గాకు పో... దాని పేరు తప్పిపోయిన వాళ్ల దర్గా... అక్కడకు వెళ్లితే తప్పిపోయినవాళ్లకు వాళ్ల వాళ్లు దొరుకుతారని చెప్తే... అంత పెద్ద ఆంజనేయ భక్తుడు... ఆ పాప ముఖాన నవ్వు కోసం ఆ దర్గాకు వెళ్లి మొక్కుకుంటాడు. కన్నీళ్లతో దువా చేస్తాడు. శక్తి పుంజుకుంటాడు. మళ్లీ అన్వేషణ కొనసాగుతుంది. ఇరు ప్రాంతాల ప్రజల ఆశీస్సు దొరుకుతుంది. బజ్రంగీ భాయ్‌జాన్‌కు అంతిమంగా విజయం సిద్ధిస్తుంది. ఈ సినిమా రిలీజ్ అవుతూ ఉంటే ఎవరో ఒక పెద్దమనిషి- ఇలాంటి టైటిల్ పెట్టడం ఏంటి... మేం ఊరుకోం.. అని రుసరుసలాడారు. ప్రేమను ద్వేషించేవాళ్లే ఇలాంటి మాట మాట్లాడగలరు అని సల్మాన్ జవాబు. ప్రపంచంలో ఇంత నెగిటివిటీ ఉంది. ఈ మతం అనీ ఆ మతం అనీ.... నీ మతం నువ్వు ఆచరించు... ఎవరూ అభ్యంతరం చెప్పరు... కాని ఎదుటి మతం మీద ద్వేషం ప్రచారం చేయకు... చాలా తప్పు అని సమాధానం ఇచ్చాడతడు. బజ్రంగీ భాయ్‌జాన్ ప్రేమను పంచే సినిమా. ఇరు దేశాల్లో ప్రజల మధ్య స్నేహాన్ని పెంచే సినిమా. ఇది చూశాక మీరు మారతారు అని సల్మాన్ ప్రకటించాడు. ఈ సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది. పాకిస్తాన్లో ఒక సిటీ బస్‌లో పాప తల్లిదండ్రుల కోసం వెతుకుతూ ఉన్న బజ్రంగీని చూసి- మీలాంటి వాళ్లు ఈ దేశంలో ఆ దేశంలో మరింతమంది ఉంటే ఎంత బాగుండేదో కదా అని పాకిస్తాన్ కండక్టర్ అంటాడు. అది తనకు ఎంతో ఇష్టమైన డైలాగ్ అంటాడు సల్మాన్. ఈ సినిమా సారం అంతా ఆ డైలాగ్‌లోనే ఉందని అతడి అభిప్రాయం. బజ్రంగీ భాయ్‌జాన్ కోసం యూనిట్ చాలా కష్టపడింది. కథానుసారం చాలా కఠినమైన లొకేషన్లలో షూట్ చేసింది. రాజస్తాన్ ఎడారిలో పాకిస్తాన్ సరిహద్దు వద్ద దొంగతనంగా అటువైపుకు వెళ్లే సన్నివేశాలను విపరీతమైన ఎండల్లో తీయాల్సి వచ్చింది. క్లయిమాక్స్‌ను కాశ్మీర్ ప్రాంతంలోని ‘థజ్వా’ మంచు పలక మీద తీశారు. అది సముద్ర మట్టానికి పదివేల అడుగుల ఎత్తున ఉంటుంది. అక్కడకు కాలి నడకన వెళ్లాలి. ఎక్కడం కంటే దిగడం కష్టం. సల్మాన్ రెండు సార్లు జారి పడాల్సి వచ్చింది. పాపను భుజాన ఎత్తుకుని నది దాటే సన్నివేశాలు... మంచు కంటే చల్లగా ఉన్న ప్రవాహాన్ని దాటడం... ఇవన్నీ ఈ సినిమాలో ప్రేక్షకులను కదిలించనున్నాయి. పాపగా బాలనటి హర్షాలీ నటించింది. ఆమె ఈ సినిమాతో స్టార్ అయ్యే అవకాశం ఉంది. ఈద్- సల్మాన్‌కు సెంటిమెంట్. ప్రతి రంజాన్‌కు అతడు రిలీజ్ చేసే ఏ సినిమా అయినా వంద కోట్లకు తగ్గకుండా కలెక్ట్ చేసింది. బజ్రంగీ భాయ్‌జాన్ 300 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. రాక్‌లైన్ వెంకటేశ్‌తో కలిసి సల్మాన్ స్వయంగా ఈ సినిమాను నిర్మించాడు. వేరే పెద్ద సినిమాలు ఏమీ లేవు. అది దీనికి లాభించింది. సాటి మనిషి గుండెల నిండా హత్తుకోవడమే నిజమైన ఈద్ అని చెప్పే సినిమాలు కూడా లేవు. అదీ దీనికి లాభించింది. సల్మాన్- నిజంగానే మాస్కు బజ్రంగీ. అభిమానులకు భాయ్‌జాన్. - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి భర్ దే జోలీ మేరీ యా ముహమ్మద్... ఈ ఖవ్వాలి తెలియని ఉపఖండ వాసులు ఉండరు. ‘సాబ్రి బ్రదర్స్’గా విఖ్యాతం అయిన పాకిస్తానీ సోదరులు పాడిన ఈ ఖవ్వాలీని చాలామంది చాలాచోట్ల నేటికీ పాడుతూనే ఉంటారు. బజ్రంగీ భాయ్జాన్లో సల్మాన్ పాకిస్తాన్‌లోని ఒక దర్గాకు వెళ్లినప్పుడు సందర్భానుసారంగా ఈ ఖవ్వాలిని పెట్టారు. ఇందులో మరో ప్రఖ్యాత గాయకుడు అద్నాన్ సమీ ఆ ఖవ్వాలి పాడే గాయకుడిగా కనిపిస్తాడు. సల్మాన్ ప్రత్యేకంగా కోరడంతో కాదనలేకపోయానని అద్నాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అది మాత్రమే కాక ఈ సినిమా కోసం ప్రీతమ్ చేసిన పాటలన్నీ మ్యూజిక్ చార్ట్స్‌లో హల్చల్ చేస్తున్నాయి.