ఇసుక అక్రమ రవాణాపై దాడులు
కర్నూలు రూరల్, న్యూస్‌లైన్: ఇసుక అక్రమ రావాణాపై దాడులు చేసిన అధికారులు గురువారం తెల్లవారుజామున కర్నూలు మండలం మునగాలపాడు సమీపంలో నాలుగు లారీలను సీజ్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులిచ్చిన సమాచారం మేరకు తహశీల్దారు బాలగణేశయ్య సిబ్బందిని అప్రమత్తం చేసి దాడులు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను తహశీల్దార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అక్టోబరు 21వతేదీన మునగాలపాడు సమీపంలో రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన ఇసుక డంప్‌పై కన్నేసినపంచలింగాలకు చెందిన ఓ ప్రజాప్రతినిధి దాన్ని హైదరాబాద్‌కు తరలించి సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. ఈ మేరకు బుధవారం రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాదుకు చెందిన లారీల యాజమానులతో మాట్లాడి మెహిదీపట్నం ప్రాంతానికి ఇసుక తరలించేందుకు ఒప్పందం చేసుకున్నారు. లారీ ఇసుక రూ.35 వేల ప్రకారం రేటు కుదుర్చుకున్నాడు.
కర్నూలు-కడప కాలువ దగ్గర అక్రమంగా డంపు చేసిన ఇసుకను జేసీబీ సాయంతో లారీల్లో నింపి తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు తహశీల్దారు సిబ్బందితో దాడులు చేశారు. ఈ సమయంలో లారీల డ్రైవర్లు తీవ్ర వాగ్వాదానికి దిగడంతో తహశీల్దారు పోలీసులను రప్పించి నాలుగు లారీలను సీజ్ చేసి తాలూకా ఆఫీస్‌కు తరలించారు. సమైక్యాంధ్ర సమ్మె అనంతరం దాడులు ముమ్మరం చేశామని చెప్పిన తహశీల్దార్ ఇప్పటి వరకు 12 ట్రాక్టర్లను సీజ్ చేశామన్నారు. ఇసుక మాఫీయాకు రాజకీయ అండ ఉన్నట్లు తెలుస్తోందని, అయితే ఎంతటి వారినైనా వదలబోమని హెచ్చరించారు.