ప్రతి గుంటకూ ఓ భూవివాదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు సంబంధించి ప్రతి గుంటకు ఏదో ఒక రకమైన సమస్య, వివాదం ఉన్నట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని నల్సార్ లా యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి.బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు. నల్సార్ యూనివర్సిటీ, గ్రామీణాభివృద్ధి సంస్థ/ల్యాండెసా సంయుక్తంగా వరంగల్ జిల్లాలో ఏర్పాటుచేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను ఆయన శనివారం సందర్శించారు.
న్యాయ సేవా కేంద్రం ద్వారా పేదలు, గిరిజనులకు భూ హక్కుల పరిరక్షణ, భూ వివాదాల పరిష్కారానికి సంబంధించి ఉచిత సలహాలు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. అన్ని వర్గాల వారికి భూ చట్టాలపై అవగాహన, శిక్షణ తరగతులను నిర్వహిస్తోందన్నారు. శిక్షణ పొందిన వారిలో మీడియా ప్రతినిధులు, రెవెన్యూ, బ్యాంకుల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి సంస్థ/ల్యాండెసా డెరైక్టర్ సునీల్‌కుమార్, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.