ఆప్‌లో చేరిన పంజాబీ నటి సోనియా మాన్.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటంటే?
చండీగఢ్: పంజాబ్ నటి సోనియా మాన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఢిల్లీ మాజీ సీఎం, ఆ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ సమక్షంలో పార్టీలో చేరారు. సోనియా రాకను ఆప్ పంజాబ్ స్వాగతించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా.. ‘‘కీర్తి కిసాన్ యూనియన్ నాయకుడు ఎస్ బల్దేవ్ సింగ్ కుమార్తె, పంజాబీ నటి సోనియా మాన్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆమెకు ఆమ్ ఆద్మీ కుటుంబంలోకి స్వాగతం’’ అంటూ ట్వీట్ చేసింది.మరో వైపు, ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీలో సోనియా జాయిన్ కావడంపై చర్చ నడుస్తోంది. 1986లో ఖలిస్తానీ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన రైతు కిసాన్ నాయకుడు బల్దేవ్ సింగ్ కూతురే సోనియా మాన్. ఆమె 1986, సెప్టెంబరు 10న ఉత్తర ప్రదేశ్‌లోని హల్ద్వానీలో జన్మించింది. సోనియా అమృత్సర్ పట్టణంలో పెరిగింది. హోలీ హార్ట్ ప్రెసిడెన్సీ స్కూల్ నుండి స్కూల్ విద్యను, అమృత్‌సర్‌లోని బీబీకె డీఏవీ కాలేజ్ ఫర్ ఉమెన్ లో తన కళాశాల విద్యను పూర్తి చేసింది.పంజాబీతో పాటు ఇతర భాషాల్లో కూడా నటించి సోనియా మాన్ యాక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మలయాళం, హిందీ, తెలుగు, మరాఠీతో సహా వివిధ భాషలలో బహుళ చిత్రాలలో నటించింది. సోనియా మాన్ తొలి చిత్రం 'హైడ్ ఎన్' సీక్'. 2014లో హిందీలో తొలిసారిగా కహిన్ హై మేరా ప్యార్‌లో కూడా యాక్ట్ చేసింది. 2020లో వచ్చిన హ్యాపీ హార్డీ, హీర్ చిత్రాల్లోనూ నటించి ప్రశంసలు అందుకుంది. సినిమాలతో పాటు 2018లో మరణించిన ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాతో సహా ప్రసిద్ధ సింగర్లతో కలిసి పని చేసిన ఆమె.. నటిగా రాణిస్తూనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. పంజాబ్‌లోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.కాగా, 2022లో జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సీఎం భగంత్ మాన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటైంది. మరో రెండేళ్లలో పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో కేజ్రీవాల్ పంజాబ్‌పై దృష్టి పెట్టారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో 2027లో జరగనున్న పంజాబ్‌లోనైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నాల్లో కేజ్రీవాల్ ఉన్నారు.