
మంత్రిపై పుకార్లు: ఎమ్మెల్యే పీఏపై కేసు నమోదు
మోగా(పంజాబ్):ఓ మంత్రిని అగౌరవపరుస్తూ పుకార్లు సృష్టించినందుకు అధికార పార్టీ ఎమ్మెల్యే రాజ్ విందర్ కౌర్ వ్యక్తిగత కార్యదర్శి(పీఏ) బల్దేవ్ సింగ్ బాబూపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతనితో పాటు ఇద్దరు ఎన్నారైలు కూడా ఈ పుకార్లలో భాగస్వామ్యులైనందుకు వారిపై కూడా కేసు నమోదైంది. పంజాబ్ రాష్ట్రంలోని అధికార శిరోమణి అకాలీదళ్ పార్టీ ఎమ్మెల్యే రాజ్ విందర్ కౌర్ వ్యక్తిగత కార్యదర్శి బల్దేవ్ సింగ్ తప్పుడు పుకార్లను సృష్టించి వ్యవసాయ శాఖా మంత్రి తోట సింగ్ ను అగౌరవపరిచాడని ఆరోపణలు గత లోక్ సభ ఎన్నికల్లోనే వెలుగుచూశాయి.
ఆ సాధారణ ఎన్నికల సమయంలో తోట సింగ్ పై లేనిపోని ఆరోపణలు సృష్టిస్తూ ఫేస్ బుక్ లో ఒక వివాదాస్పద వ్యాఖ్యను పోస్ట్ చేశారు. దీనిపై మే 3 వ తేదీన మంత్రి తోట సింగ్ కుమారుడు బ్రజీందర్ సింగ్ ఫిర్యాదు చేయగా, ఈ ఘటనపై తాజాగాకేసు నమోదు చేశారు. సమాచార హక్కు చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటి వరకూ ఎవ్వరినీ అదుపులోకి తీసుకోలేదు.