Balkampeta ellamma Temple
-
నేటి నుంచి బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ వేడుకలు
హైదరాబాద్: ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. మూడు రోజుల పాటు వేడుకలు కొనసాగనున్నాయి. సోమవారం ఎదుర్కోళ్లు, మంగళవారం ఎల్లమ్మ కల్యాణం, బుధవారం రథోత్సవం నిర్వహిస్తామని ఆలయ ఈవో ఎస్ అన్నపూర్ణ తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాల నేపథ్యంలో ట్రాఫిక్‌ను ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. మంగళవారం, బుధవారం రెండు రోజుల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపారు. గ్రీన్‌ల్యాండ్, అమీర్‌పేట సత్యం థియేటర్ నుంచి ఫతేనగర్ వైపు వెళ్లే వాహనాలు బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం మీదుగా కాకుండా ఎస్ఆర్నగర్ టీ జంక్షన్, కమ్యూనిటీ హాల్, బీకేగూడ క్రాస్ రోడ్డు, శ్రీరాంనగర్, సనత్‌నగర్ మీదుగా ఫతేనగర్ బ్రిడ్జిపైకి వెళ్లాల్సి ఉంటుంది. ఫతేనగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి వచ్చే వాహనాలను కొత్త బ్రిడ్జి కట్టమైసమ్మ దేవాలయం మీదుగా బేగంపేట వైపు మళ్లిస్తారు. గ్రీన్ ల్యాండ్, ఫుడ్ వరల్డ్ మీదుగా బల్కంపేట వైపు వచ్చే వాహనాలను ఫుడ్ వరల్డ్ క్రాస్ రోడ్డు వద్ద దారి మళ్లించి సోనాబాయి ఆలయం, సత్యం థియేటర్, మైత్రి వనం, ఎస్ఆర్నగర్ టీ జంక్షన్ వైపు అనుమతిస్తారు. బేగంపేట, కట్ట మైసమ్మ దేవాలయం వైపు నుంచి బల్కంపేటకు వచ్చే వాహనదారులు గ్రీన్‌ల్యాండ్స్, కనకదుర్గా దేవి దేవాలయం, సత్యం థియేటర్, ఎస్ఆర్నగర్ టీ జంక్షన్ నుంచి ఎడమవైపు తీసుకుని ఎస్ఆర్నగర్ కమ్యూనిటీ హాల్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. -
జూలై 5న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం
సాక్షి, హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణాన్ని జూలై 5న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో మంగళవారం వివిధ శాఖల అధికారులతో బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ ఏర్పాట్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. జూలై 4న ఎదుర్కోళ్లు, 5న అమ్మవారి కళ్యాణం, 6న రథోత్సవం ఉంటుందన్నారు. అమ్మవారి కల్యాణాన్ని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీల్లో చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల కోసం అన్ని వసతులూ ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. భారీ పోలీసు బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలతో శాంతి భద్రతలను పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. ఆలయ పరిసరాల్లో సివరేజీ లీకేజీలు లేకుండా పర్యవేక్షించాలని వాటర్‌వర్క్స్ అధికారులను మంత్రి ఆదేశించారు. రహదారుల మరమ్మతులను ఇప్పటినుంచే చేపట్టాలని చెప్పారు. రథోత్సవం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ లైన్లను సరిచేయడం, చెట్ల కొమ్మలను తొలగించాలని మంత్రి సూచించారు. అమ్మ వారి దర్శనం, కల్యాణం కోసం ఇచ్చే పాస్‌లను డూప్లికేట్‌కు ఆస్కారం లేకుండా బార్ కోడింగ్‌తో కూడిన పాస్‌లను జారీ చేయాలని ఆదేశించారు. కల్యాణం, రథోత్సవం సందర్భంగా ఆలయం వైపు రహదారులను మూసివేసి వాహనాల మళ్లింపునకు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్, పోలీసు అధికారులను ఆదేశించారు. దేవాలయ పరిసరాలలో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అయిదు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయాలని డీఎం అండ్ హెచ్ఓ వెంకటికి సూచించారు. భక్తుల సౌకర్యార్ధం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుందన్నారు. సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, ఈఓ అన్నపూర్ణ, వాటర్‌వర్క్స్ డైరెక్టర్ ఆపరేషన్ కృష్ణ, సీజీఎం ప్రభు, సికింద్రాబాద్ ఆర్డీఓ వసంత, జోనల్ కమిషనర్ రవికిరణ్, అడిషనల్ ట్రాఫిక్ డీసీపీ రంగారావు, పంజగుట్ట ఏసీపీ గణేష్ పాల్గొన్నారు. చదవండి: ట్యాంక్‌బండ్‌పై నిర్లక్ష్యంగా బండి పెడితే రూ. 1000 పడుద్ది! -
బల్కంపేట ఎల్లమ్మ.. కల్యాణం జరిగేనా..?
సనత్‌నగర్: కొలిచిన వారి కొంగు బంగారంగా విరాజిల్లుతోన్న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ ఘడియలు దగ్గర పడుతున్నాయి. అయితే ఈ సారి కోవిడ్–19 దృష్ట్యా అమ్మవారి కల్యాణంపై సందిగ్ధత కొనసాగుతోంది. ♦ కల్యాణం నిర్వహించాలా.. వద్దా..? ఒకవేళ నిర్వహిస్తే ఏవిధంగా నిర్వహించాలనే దానిపై ఎండోమెంట్ అధికారులు పూర్తిస్థాయి కసరత్తు చేస్తున్నారు. ఆషాఢ మాసం బోనాలు ఎల్లమ్మ కల్యాణోత్సవంతోనే ప్రారంభం అవుతాయన్నది జగమెరిగిన సత్యం. ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మకు కల్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తుంటారు. ఈ యేడు జూన్ 23న అంటే సరిగ్గా 18 రోజులు మాత్రమే కల్యాణోత్సవానికి సమయం ఉంది. అమ్మవారి కల్యాణోత్సవం వస్తుందంటే దాదాపు నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు షురూ అవుతాయి. కరోనా మహమ్మారి కారణంగా ఇంకా భక్తులకు దేవతామూర్తుల పున దర్శనప్రాప్తి కలగలేదు. ఈ నేపథ్యంలో కల్యాణ ఏర్పాట్ల ఊసే లేదు. ఈ నెల 8 నుంచి ప్రార్థన మందిరాలను తెరుస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అమ్మవారి కల్యాణోత్సవం నిర్వహణపై చర్చ మొదలైంది. అనాదిగా వస్తున్న పెళ్లితంతు.. ఏడు శతాబ్దాలకు పైగా చరిత్ర ఎల్లమ్మ ఆలయానికి ఉన్నట్లు ఆధారాలు చెబుతున్నాయి. 1983లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చింది. అప్పటి వరకు ఒగ్గుకళాకారులు, శివసత్తులు అమ్మవారి కల్యాణాన్ని జరిపిస్తూ వచ్చారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా ఎల్లమ్మ అమ్మవారి పెళ్లిని జరిపిస్తూ వస్తోంది. 2007 వరకు కల్యాణోత్సవాన్ని ఆలయం లోపల మూలవిరాట్‌పై ఉన్న కల్యాణ మండపంలో వివాహ వేడుక జరిపించేవారు. అయితే భక్తులు లక్షలాదిగా తరలిరావడం, వ్యయప్రయాసలకోర్చి ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తులు పూర్తి స్థాయిలో ఆ భాగ్యాన్ని పొందలేకపోతున్నారు. దీంతో అప్పటి ఆలయ ధర్మకర్తలు, పీఠాధిపతులు, వేద పండితుల సూచనల మేరకు 2007 నుంచి ఆలయం ముందు ఉన్న రాజమార్గంలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి భక్తులందరూ కనులారా వీక్షించేలా చేసి తరింపజేస్తూ వస్తున్నారు. సాధారణంగా దేవతామూర్తుల కల్యాణోత్సవాలను వధూవరులతో కలిపి చేస్తారు. కానీ ఒక్క ఎల్లమ్మ అమ్మవారికి మాత్రం త్రిశూలన్నే వరుడిగా నిల్చోబెడతారు. త్రిశూలాన్ని పంచెకట్టులో సుందరంగా ముస్తాబు చేసి శక్తి స్వరూపిణి అయిన ఎల్లమ్మ పక్కన వరుడిగా నిల్చోబెడతారు. శతాబ్దాలుగా అమ్మవారి కల్యాణ మహోత్సవం కొనసాగుతూ వస్తుండగా కరోనా దృష్ట్యా ఈ సారి ఆ ఘట్టం ఎలా ఉండబోతుందనే దానిపై సమాలోచనలు జరుగుతున్నాయి. అమ్మవారి కల్యాణం జరిపి తీరాల్సిందే.. అనాదిగా వస్తున్న పెళ్లి వేడుకను జరిపి తీరాల్సిందేనని ఆలయ ట్రస్టీ, పూర్వ అభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానికంగా ఉండే వివిధ సంఘాలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఎప్పటిలా కాకుండా 2007కు ముందు అమ్మవారి మూలవిరాట్ పైభాగంలో ఉన్న కల్యాణ మండపంలో కల్యాణాన్ని జరిపించడం, తక్కువ భక్తులను అనుమతించడంతో పాటు ప్రభుత్వ నిబంధనల మేరకు వారు జాగ్రత్తలు పాటించేలా చేయడం వంటివి తీసుకోవాలని ప్రతిపాదనకు వచ్చినట్లు సమాచారం. ఎండోమెంట్ అధికారులు ఎలాంటి నిర్ణయానికి రాలేదని, ప్రభుత్వ ఆదేశాల కోçసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. రథోత్సవం వాయిదా..? భక్తులు, స్థానిక సంఘాల సూచన మేరకు అమ్మవారి కల్యాణాన్ని జరిపి ఆ తర్వాత రోజు నిర్వహించే రథోత్సవాన్ని మాత్రం రద్దు చేస్తారనే వార్తలు వస్తున్నాయి. అమ్మవారి కల్యాణం తర్వాత అత్యంత వైభవోపేతంగా రథోత్సవాన్ని నిర్వహిస్తారు. 30 అడుగుల ఎత్తున రథంలో అమ్మవారు ఆసీనులు కాగా భక్తుల హర్షధ్వానాల మధ్య ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీ. దేవాలయం నుంచి రథోత్సవం ప్రారంభమై బల్కంపేట, ఎస్ఆర్నగర్ వీధుల్లో ఊరేగించి చివరకు తిరిగి ఆలయానికి చేరుకోవడంతో ఉత్సవాలు ముగుస్తాయి. 2007కు ముందు రథోత్సవాన్ని ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిపేవారు. ఎప్పుడైతే కల్యాణాన్ని ఆలయం ముందున్న రాజమార్గంలో నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారో అప్పటి నుంచే కల్యాణం తర్వాత రథోత్సవం జరపాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సారి రథోత్సవాన్ని వాయిదా వేయాలనే ఆలోచన కూడా ఉంది. నేడు సమావేశం ఎల్లమ్మ కల్యాణోత్సవ నిర్వహణపై దేవాదాయ శాఖ అధికారులతో శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సమావేశం కానున్నారు. మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఉదయం 11 గంటలకు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఇతర దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక సంఘాలతో సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నారు. -
అర్చకుల సమ్మెతో ఉద్రిక్తత
హైదరాబాద్: ఆలయ అర్చక, ఉద్యోగులు చేపట్టిన సమ్మె తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించేలా ముఖ్యమంత్రికి బుద్ధి ప్రసాదించాలని అర్చకులు ఆదివారం హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం ఎదుట నిర్వహించ తలపెట్టిన సుదర్శన హోమం ఉద్రిక్తంగా మారింది. సమ్మెలో పాల్గొనేందుకు అర్చకులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకున్నారు. అయితే హోమం నిర్వహించేందుకు అనుమతి లేదంటూ ఆలయ కార్య నిర్వహణా అధికారి వినోద్‌రెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. హోమానికి అనుమతించకపోవడంతో అర్చకులు ఆలయం ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు అర్చకులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయడంతో తోపులాట జరిగింది. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సమయంలో భరత్‌నగర్ ఆలయానికి చెందిన అర్చకులు శ్రీనివాస్, లక్ష్మణ్ ఆలయం గోపురంపైకి ఎక్కి తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. అర్చకుల అసోసియేషన్ నాయకులు మాట్లాడి కిందకు దిగాలని కోరడంతో వారు దిగారు. సుమారు 3 గంటల పాటు బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వద్ద హైడ్రామా జరగడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జేఏసీ కన్వీనర్ గంగు భానుమూర్తి, అర్చక అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రంగారెడ్డి, వెంటేశ్వర్రావు, నర్సింగరావు, రవీంద్రా చార్యులు తదితరులు పాల్గొన్నారు. కాగా అర్చకుల సమ్మెకు కాంగ్రెస్, టీడీపీ మద్దతు తెలిపాయి. ప్రభుత్వం మొండి వైఖరి వీడి సమస్యను పరిష్కరించాలని సనత్‌నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు శ్రావణ్, సనత్‌నగర్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కూన వెంకటేశ్‌గౌడ్‌లు పేర్కొన్నారు.