సనత్‌నగర్: కొలిచిన వారి కొంగు బంగారంగా విరాజిల్లుతోన్న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ ఘడియలు దగ్గర పడుతున్నాయి. అయితే ఈ సారి కోవిడ్–19 దృష్ట్యా అమ్మవారి కల్యాణంపై సందిగ్ధత కొనసాగుతోంది.
♦ కల్యాణం నిర్వహించాలా.. వద్దా..? ఒకవేళ నిర్వహిస్తే ఏవిధంగా నిర్వహించాలనే దానిపై ఎండోమెంట్ అధికారులు పూర్తిస్థాయి కసరత్తు చేస్తున్నారు. ఆషాఢ మాసం బోనాలు ఎల్లమ్మ కల్యాణోత్సవంతోనే ప్రారంభం అవుతాయన్నది జగమెరిగిన సత్యం. ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మకు కల్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తుంటారు. ఈ యేడు జూన్ 23న అంటే సరిగ్గా 18 రోజులు మాత్రమే కల్యాణోత్సవానికి సమయం ఉంది. అమ్మవారి కల్యాణోత్సవం వస్తుందంటే దాదాపు నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు షురూ అవుతాయి. కరోనా మహమ్మారి కారణంగా ఇంకా భక్తులకు దేవతామూర్తుల పున దర్శనప్రాప్తి కలగలేదు. ఈ నేపథ్యంలో కల్యాణ ఏర్పాట్ల ఊసే లేదు. ఈ నెల 8 నుంచి ప్రార్థన మందిరాలను తెరుస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అమ్మవారి కల్యాణోత్సవం నిర్వహణపై చర్చ మొదలైంది.
అనాదిగా వస్తున్న పెళ్లితంతు..
ఏడు శతాబ్దాలకు పైగా చరిత్ర ఎల్లమ్మ ఆలయానికి ఉన్నట్లు ఆధారాలు చెబుతున్నాయి. 1983లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చింది. అప్పటి వరకు ఒగ్గుకళాకారులు, శివసత్తులు అమ్మవారి కల్యాణాన్ని జరిపిస్తూ వచ్చారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా ఎల్లమ్మ అమ్మవారి పెళ్లిని జరిపిస్తూ వస్తోంది. 2007 వరకు కల్యాణోత్సవాన్ని ఆలయం లోపల మూలవిరాట్‌పై ఉన్న కల్యాణ మండపంలో వివాహ వేడుక జరిపించేవారు. అయితే భక్తులు లక్షలాదిగా తరలిరావడం, వ్యయప్రయాసలకోర్చి ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తులు పూర్తి స్థాయిలో ఆ భాగ్యాన్ని పొందలేకపోతున్నారు. దీంతో అప్పటి ఆలయ ధర్మకర్తలు, పీఠాధిపతులు, వేద పండితుల సూచనల మేరకు 2007 నుంచి ఆలయం ముందు ఉన్న రాజమార్గంలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి భక్తులందరూ కనులారా వీక్షించేలా చేసి తరింపజేస్తూ వస్తున్నారు. సాధారణంగా దేవతామూర్తుల కల్యాణోత్సవాలను వధూవరులతో కలిపి చేస్తారు. కానీ ఒక్క ఎల్లమ్మ అమ్మవారికి మాత్రం త్రిశూలన్నే వరుడిగా నిల్చోబెడతారు. త్రిశూలాన్ని పంచెకట్టులో సుందరంగా ముస్తాబు చేసి శక్తి స్వరూపిణి అయిన ఎల్లమ్మ పక్కన వరుడిగా నిల్చోబెడతారు. శతాబ్దాలుగా అమ్మవారి కల్యాణ మహోత్సవం కొనసాగుతూ వస్తుండగా కరోనా దృష్ట్యా ఈ సారి ఆ ఘట్టం ఎలా ఉండబోతుందనే దానిపై సమాలోచనలు జరుగుతున్నాయి.
అమ్మవారి కల్యాణం జరిపి తీరాల్సిందే..
అనాదిగా వస్తున్న పెళ్లి వేడుకను జరిపి తీరాల్సిందేనని ఆలయ ట్రస్టీ, పూర్వ అభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానికంగా ఉండే వివిధ సంఘాలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఎప్పటిలా కాకుండా 2007కు ముందు అమ్మవారి మూలవిరాట్ పైభాగంలో ఉన్న కల్యాణ మండపంలో కల్యాణాన్ని జరిపించడం, తక్కువ భక్తులను అనుమతించడంతో పాటు ప్రభుత్వ నిబంధనల మేరకు వారు జాగ్రత్తలు పాటించేలా చేయడం వంటివి తీసుకోవాలని ప్రతిపాదనకు వచ్చినట్లు సమాచారం. ఎండోమెంట్ అధికారులు ఎలాంటి నిర్ణయానికి రాలేదని, ప్రభుత్వ ఆదేశాల కోçసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది.
రథోత్సవం వాయిదా..?
భక్తులు, స్థానిక సంఘాల సూచన మేరకు అమ్మవారి కల్యాణాన్ని జరిపి ఆ తర్వాత రోజు నిర్వహించే రథోత్సవాన్ని మాత్రం రద్దు చేస్తారనే వార్తలు వస్తున్నాయి. అమ్మవారి కల్యాణం తర్వాత అత్యంత వైభవోపేతంగా రథోత్సవాన్ని నిర్వహిస్తారు. 30 అడుగుల ఎత్తున రథంలో అమ్మవారు ఆసీనులు కాగా భక్తుల హర్షధ్వానాల మధ్య ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీ. దేవాలయం నుంచి రథోత్సవం ప్రారంభమై బల్కంపేట, ఎస్‌ఆర్‌నగర్ వీధుల్లో ఊరేగించి చివరకు తిరిగి ఆలయానికి చేరుకోవడంతో ఉత్సవాలు ముగుస్తాయి. 2007కు ముందు రథోత్సవాన్ని ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిపేవారు. ఎప్పుడైతే కల్యాణాన్ని ఆలయం ముందున్న రాజమార్గంలో నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారో అప్పటి నుంచే కల్యాణం తర్వాత రథోత్సవం జరపాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సారి రథోత్సవాన్ని వాయిదా వేయాలనే ఆలోచన కూడా ఉంది.
నేడు సమావేశం
ఎల్లమ్మ కల్యాణోత్సవ నిర్వహణపై దేవాదాయ శాఖ అధికారులతో శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సమావేశం కానున్నారు. మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఉదయం 11 గంటలకు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఇతర దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక సంఘాలతో సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment