Bangalore raphtars
-
బెంగళూరుకు చుక్కెదురు
చెన్నై: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు రాప్టర్స్‌కు చుక్కెదురైంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 3–4తో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ చేతిలో ఓడింది. ఒకదశలో 1–3తో ఆధిక్యంలో నిలిచిన బెంగళూరు... అనంతరం జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి పరాజయాన్ని మూట గట్టుకుంది. మిక్స్డ్ డబుల్స్‌లో చాన్ పెంగ్–యోమ్ హే వోన్ (బెంగళూరు) ద్వయం 15–8, 15–11తో లీ యంగ్ డే–కిమ్ హన (నార్త్ ఈస్టర్న్) జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్ (బెంగళూరు) 14–15, 9–15తో లే చియుక్ యు (నార్త్ ఈస్టర్న్) చేతిలో ఓడటంతో... ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (బెంగళూరు) 15–7, 15–5తో అస్మిత (నార్త్ ఈస్టర్న్)పై గెలుపొందింది. ఈ పోరులో బెంగళూరు ‘ట్రంప్ కార్డు’ ఉపయోగించడంతో రెండు పాయింట్లు లభించాయి. దాంతో బెంగళూరు 3–1తో ఆధిక్యంలోకెళ్లింది. పురుషుల డబుల్స్‌లో ‘ట్రంప్ కార్డు’తో బరిలో దిగిన నార్త్ ఈస్టర్న్ జోడీ బొదిన్ ఇసారా–లీ యంగ్ డే ద్వయం 15–12, 15–6తో అరుణ్ జార్జ్–రియాన్ అగుంగ్ సపుర్తో (బెంగళూరు) జంటను చిత్తు చేసింది. దీంతో మరోసారి ఇరు జట్ల స్కోర్లు 3–3తో సమం అయ్యాయి. ఇక విజేతను నిర్ణయించే చివరి మ్యాచ్ అయిన పురుషుల రెండో సింగిల్స్‌లో సెన్సోమ్బూన్సుక్ (నార్త్ ఈస్టర్న్) 15–7, 15–8తో లెవెర్డెజ్పై గెలుపొందడంతో నార్త్ ఈస్టర్న్ విజయం ఖాయమైంది. -
ఏసెస్ శుభారంభం
సాక్షి, హైదరాబాద్: చాంపియన్స్ టెన్నిస్ లీగ్‌లో హైదరాబాద్ ఏసెస్ జట్టు శుభారంభం చేసింది. సోమవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 27-25 గేమ్‌ల (3-2 మ్యాచ్‌ల) తేడాతో బెంగళూరు రాఫ్టర్స్ను ఓడించింది. మంగళవారం ఇక్కడే జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు పుణేను ఎదుర్కొంటుంది. హింగిస్ జోరు: మార్టినా హింగిస్, వీనస్ విలియమ్స్ మధ్య జరిగిన సింగిల్స్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఇద్దరు మాజీ చాంపియన్లు హోరాహోరీగా తలపడిన ఈ మ్యాచ్‌లో హింగిస్ 6-3తో గెలుపొందింది. ముందుగా 3-2తో ఆధిక్యంలో నిలిచిన హింగిస్, ఆరో గేమ్‌ను బ్రేక్ చేసి దూసుకుపోయింది. చివరకు తొమ్మిదో గేమ్‌ను నిలబెట్టుకొని మ్యాచ్ సొంతం చేసుకుంది. అంతకు ముందు లెజెండ్స్ మ్యాచ్‌లో మార్క్ ఫిలిప్పోసిస్ 6-5 (5-2)తో థామస్ ఎన్క్విస్ట్ను ఓడించాడు. మిక్స్డ్ డబుల్స్‌లో బెంగళూరు జోడి వీనస్ విలియమ్స్-ఫెలీసియానో లోపెజ్ 6-5 (5-1)తో మార్టినా హింగిస్- మిఖాయిల్ యూజ్నీపై విజయం సాధించి పోరును సమం చేశారు. ఆ తర్వాత పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్‌కు చెందిన యూజ్నీ-జీవన్ నెడుంజెళియన్ 6-3తో బెంగళూరు జంట లోపెజ్-రాంకుమార్ రామనాథన్‌ను ఓడించింది. చివరి పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో యూజ్నీ (హైదరాబాద్) 4-8తో లోపెజ్ చేతిలో ఓడాడు. ఢిల్లీ విజయం: న్యూఢిల్లీలో జరిగిన మరో మ్యాచ్‌లో ఢిల్లీ డ్రీమ్స్ జట్టు 25-19తో పంజాబ్ మార్షల్స్‌పై గెలిచింది.