Banjara hills traffic police
-
బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్సై ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా?
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో ప్రొబేషనరీ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వడ్డెపు రమణ (26) ఆత్మహత్య చేసుకున్నాడు. మౌలాలి–చర్లపల్లి రైల్వేస్టేషన్ల మధ్య మృతదేహం ఉన్నట్టు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు గురువారం ఉదయం 7.55 గంటలకు సమాచారం అందింది. మౌలాలి రైల్వేస్టేషన్ సమీపంలోని సీ క్యాబిన్ వద్ద రెండు ముక్కలైన యువకుడి మృతదేహం ఉన్నట్టు రైల్వే ‘కీ’ మెన్ వెంకటేశ్వర్రావు ద్వారా సమాచారం అందింది. సికింద్రాబాద్ రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీను కథనం మేరకు.. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం వాసుదేవపురం గ్రామానికి చెందిన వడ్డెపు అప్పల స్వామి రెండోకుమారుడు రమణ 2020 బ్యాచ్ ఎస్ఐగా ఎంపికయ్యాడు. చిక్కడపల్లి అశోక్‌నగర్‌లో ముగ్గురు మిత్రులతో కలిసి ఉంటూ బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి 10 గంటల తరువాత బయటకు వెళ్లి వస్తానని రూమ్‌మేట్స్‌కు చెప్పి వెళ్లాడు. అదే రోజు అర్థరాత్రి దాటిన తరువాత మౌలాలి ప్రాంతానికి చేరుకుని రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. కొద్ది రోజులుగా రమణ మానసిక ఆందోళనలకు గురవుతున్నట్టు, ఇందుకు ప్రేమ వ్యవహారం కారణమై ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. నగరంలోనే నివాసం ఉంటున్న అక్క,బావతోపాటు, బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరసింహరాజు సికింద్రాబాద్ చేరుకుని రమణ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అక్క,బావతోపాటు పలువురు రమణ బ్యాచ్ ఎస్ఐలు గాంధీ ఆసుపత్రికి వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎస్ఐ తల్లితండ్రులు శుక్రవారం ఉదయానికి నగరానికి చేరుకోనున్నట్టు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదని, విచారణ చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు. -
ఖైరతాబాద్ ఎమ్మెల్యే కార్లపై 66 చలాన్లు.. రూ. 37, 365 చెల్లించి..
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు చెందిన అయిదు కార్లకు పెండింగ్ చలాన్లను ఆదివారం క్లియర్ చేశారు. కొంత కాలంగా ఆయనకు చెందిన టీఎస్ 09 ఎఫ్ఏ 0999తోపాటు మరో నాలుగు కార్లకు 66 చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ తిరుగుతున్న ఈ వాహనాలపై బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో పెండింగ్ చలాన్ల జాబితా గుట్టురట్టైది. దీంతో 66 చలానాలకుగాను రూ. 37365లను ఎమ్మెల్యే చెల్లించారు. ఈ మేరకు బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేస్తూ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు చెందిన అయిదు కార్లకు చెందిన చలానాలు క్లియర్ అయినట్లు తెలిపారు. చదవండి: బంజారాహిల్స్: ఖరీదైన కార్లే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు -
మద్యం మత్తులో పట్టుబడిన హై-ప్రొఫైల్ మహిళలు
హైదరాబాద్: ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటూ దూసుకుపోతున్న మహిళమణులు మద్యపానంలోనూ ముందుంటున్నారు. పురుషులతో సమానంగా తాము మందు కొట్టగలమని నిరూపిస్తున్నారు. అక్కడితే ఆగకుండా స్టీరింగ్ పట్టుకుని రయ్ మంటూ రాత్రిపూట రోడ్లపై దూసుకుపోతున్నారు. అతిగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ముగ్గురు భాగ్యనగర అతివలు రక్షకభటులకు అడ్డంగా దొరికిపోయారు. మత్తులో తూగుతూ కారు నడుపుతున్న ముగ్గురు మగువలకు బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ముకుతాడు వేశారు. శనివారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వీరిని గుర్తించిన పోలీసులు కేసులు నమోదు చేశారు. తమపైనే కేసులు పెడతారా అంటూ సదరు హై-ప్రొఫైల్ మహిళామణులు పోలీసులపై విరుచుకుపడ్డారు. కానీ డ్యూటీ మైండెడ్ పోలీసులు వారిని వదల్లేదు. చకచకా కేసులు నమోదు చేశారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయకూడదని, చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడిన పలువురు పురుష పుంగవులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ నటుడు రాజా రవీంద్ర
సాక్షి, హైదరాబాద్ : సినీనటుడు రాజా రవీంద్ర డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో శనివారం రాత్రి 11.30 గంటలకు బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె.బాలకృష్ణారెడ్డి సిబ్బందితో కలసి రోడ్‌నంబర్-12లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఫిలింనగర్ నుంచి బంజారాహిల్స్ వైపు స్కోడా కారులో (ఏపీ 20ఏపీ 1111) ప్రయాణిస్తున్న రాజా రవీంద్రను కూడా ఆపి పరీక్షించగా, ఆయన మద్యం సేవించినట్లు తేలింది. పోలీసులు ఆయన కారును స్వాధీనం చేసుకుని, ఆయనపై కేసు నమోదు చేసుకున్నారు.