మద్యం మత్తులో పట్టుబడిన హై-ప్రొఫైల్ మహిళలు
హైదరాబాద్: ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటూ దూసుకుపోతున్న మహిళమణులు మద్యపానంలోనూ ముందుంటున్నారు. పురుషులతో సమానంగా తాము మందు కొట్టగలమని నిరూపిస్తున్నారు. అక్కడితే ఆగకుండా స్టీరింగ్ పట్టుకుని రయ్ మంటూ రాత్రిపూట రోడ్లపై దూసుకుపోతున్నారు. అతిగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ముగ్గురు భాగ్యనగర అతివలు రక్షకభటులకు అడ్డంగా దొరికిపోయారు.
మత్తులో తూగుతూ కారు నడుపుతున్న ముగ్గురు మగువలకు బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ముకుతాడు వేశారు. శనివారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో వీరిని గుర్తించిన పోలీసులు కేసులు నమోదు చేశారు. తమపైనే కేసులు పెడతారా అంటూ సదరు హై-ప్రొఫైల్ మహిళామణులు పోలీసులపై విరుచుకుపడ్డారు. కానీ డ్యూటీ మైండెడ్ పోలీసులు వారిని వదల్లేదు. చకచకా కేసులు నమోదు చేశారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయకూడదని, చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడిన పలువురు పురుష పుంగవులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.