banjaras
-
బీజేపీతో తస్మాత్ జాగ్రత్త
పటాన్చెరు: మతతత్వ బీజేపీతో బంజారాలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జరిగిన రాష్ట్ర బంజారా ఎంప్లాయీస్ సేవాసంఘ్ కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో కలసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లంబాడాలకు రిజర్వేషన్లు తొలగించాలని ఓ తెలంగాణ ఎంపీ డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. గిరిజన ఉద్యోగులపై బీజేపీ వాదులు దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నెల రోజుల్లో పోడు భూముల సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా బంజారా భవన్‌ను నిర్మిస్తున్నామని, సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నామని, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని హరీశ్‌రావు వివరించారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచామని, ఎస్టీ బాలికల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలను తెరిచామని గుర్తు చేశారు. కాగా, గిరిజన యూనివర్సిటీ మంజూరు విషయంలో కేంద్రం తాత్సారం చేస్తోందన్నారు. ఏడేళ్ల క్రితం 317 ఎకరాల భూమిని ఈ యూనివర్సిటీ కోసం కేటాయించినప్పటికీ నేటికీ అక్కడ యూనివర్సిటీ రాలేదన్నారు. ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు రాలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని నిలదీయాలని ఆయన కోరారు. కాంగ్రెస్, టీడీపీలు బంజారాలను ఓట్ల కోసం వాడుకున్నాయే తప్ప వారి అభ్యున్నతికి చేసిందేమీ లేదన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో బంజారాలు బీఆర్ఎస్ను బలపరుస్తున్నారని తెలిపారు. త్వరలో భర్తీ చేయనున్న 81 వేల ఉద్యోగాల్లో బంజారాలకు పది శాతం రిజర్వేషన్లు ఉంటాయన్నారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘తీజ్ పండుగ’: ఉత్సాహంగా బంజారాల బతుకమ్మ వేడుకలు
ఆధునిక ప్రపంచంలోనూ తమ సంప్రదాయాలను కాపాడుకుంటూ ప్రతి ఏటా తీజ్ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు గిరిజనులు. ఏటా శ్రావణమాసంలో లంబాడా(బంజారా) తండాల్లో తొమ్మిది రోజులపాటు తీజ్ ఉత్సవాలు సందడిగా జరుగుతుంటాయి. ఈసారి తీజ్ ఉత్సవాలు రాఖీ పౌర్ణమి పండుగ రోజు(ఆదివారం) ప్రారంభమై శ్రీకృష్ణాష్టమితో ముగుస్తాయి. ఈ నేపథ్యంలో తీజ్ వేడుకలపై సాక్షి కథనం... సాక్షి, ఉట్నూర్/బజార్హత్నూర్: పూర్వం సింధు రాజుల కాలం నుండి బంజారాల జీవన విధానంపై అనేక కథనాలు ఉన్నాయి అఖండ భారతావనిలో వందల ఏళ్ళ కాలం నుంచే బంజారాల పండుగలు ప్రత్యేకత కలిగివున్నాయి. బంజారాలు హిందూ రాజులైన పృథ్వీరాజ్ చౌహాన్, మహారాణా ప్రతాప్ సింగ్ వంటివారి దగ్గర వివిధ హోదాల్లో సేవలందించారు. గోర్ బంజారాలు వారి కష్టం మీద వారే ఆధార పడుతూ స్వతంత్రంగా జీవించేవారు. నాడు ఏవిధంగానైతే భారతదేశంలో స్వయం పోషక గ్రామాలు వర్ధిల్లాయో, అదేవిధంగా గోర్ బంజారా ఆవాసాలు కూడా స్వయంపోషక తండాలుగా వర్ధిల్లాయి. బుట్టలపై నీళ్లు చల్లుతున్న యువతులు (ఫైల్) తొమ్మిది రోజులు ఆటపాటలతో.. బంజారాలు సంతానం, పాడి పంటల సౌభాగ్యం కోసం గోర్ దేవుళ్లయిన సంత్ శ్రీసేవాలాల్ మహారాజ్, సీత్లా, మోరామ మాతలతో పాటు తిరుపతి బాలాజీ, హాతీరాం బావాజీ, వేములవాడ రాజన్నని కొలిచేవారు. బంజారాల పండుగలన్నీ ప్రకృతితో ముడిపడి, ప్రకృతిని ఆరాధించేవే. ఒక్కో దేవత ఒక్కొక్క రకంగా తండాలను రక్షిస్తుందని నమ్ముతారు. వర్షాకాలం ప్రారంభంలో కనిపించే ఎర్రని ఆరుద్ర పురుగును ‘తీజ్’ అంటారు. అలాగే గోధుమ మొలకలను కూడా ‘తీజ్’గా పిలుస్తారు. బతుకమ్మను పూలతో అలంకరించినట్లే తీజ్‌లో నవధాన్యాలను, గోధుమ మొలకలను పూజించడం ఆనవాయితీ. వర్షాకాలం ప్రారంభమై నాటు పూర్తయిన తర్వాత ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారు. సీత్లాభవాని పూజ ముగిసిన తర్వాత తీజ్‌ను జరుపుకొంటారు. పెళ్లి కాని యువతులకు పండుగ.. తీజ్ ఒక ప్రత్యేకమైన పండుగ. బంజారాల బతుకమ్మ తీజ్ పండుగ అని చెప్పవచ్చు. బంజారాల సాంప్రదాయం ప్రకారం వివాహం కాని అమ్మాయిలు తండాలో ఎంత మంది ఉంటే అంతమంది తమ బుట్టలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పందిరిపై ఉంచుతారు. యువతుల్లో ఒకరు తమ బృందానికి నాయకురాలిగా వ్యవహరిస్తారు. ఈ తొమ్మిది రోజులపాటు ఎంతో భక్తి శ్రద్ధలతో మూడు పూటలు నీరు పోస్తారు. ఈ నారు అత్యంత పవిత్రమైందని, దీనివల్ల శుభం జరుగుతుందని నమ్మకం. తీజ్ బుట్టలను పట్టుకొని తొమ్మిదో రోజున వరుసగా ఆడపిల్లలు నిమజ్జనానికి డప్పుచప్పుళ్లతో బయలుదేరుతారు. తీజ్ తమను వదిలేసి వెళ్లిపోతుందనే దుఃఖంతో ఆడపిల్లలు ఏడుస్తుంటే పెద్దలు, సోదరులు వారిని ఊరడిస్తుంటారు. వార్తా, రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో ఈ పండుగను ఆషాఢ, శ్రావణ మాసాల్లో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వారు వారికి వీలైనప్పుడు నిర్వహించేవారు. కానీ చదువు, ఉద్యోగ, వ్యాపార పరంగా సొంత తండాలకు దూరంగా నివసిస్తున్న లంబాడీలు వారి పండుగలను ఒకే కాలంలో నిర్వహిస్తే వారి ఆచార వ్యవహారాలకు అనుగుణంగా పండుగను కలిసి నిర్వహించుకోవడమే కాకుండా, ప్రభుత్వ పరంగా గుర్తింపు వచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలని ఆశిస్తున్నారు. గోకులాష్టమితో నిమజ్జనం గోకులాష్టమి రోజున (తొమ్మిదోరోజు) గ్రామపెద్ద నాయక్ ఇంటి ఆవరణలో సంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. అనంతరం సమీపంలోని వాగులు, చెరువుల్లో వెదురుబుట్టలను నిమజ్జనం చేస్తారు. ఈ సమయంలో సోదరిమణుల ఆశీర్వారం సోదరులు తీసుకుంటారు. పులియాగెనో తప్పనిసరి.. తీజ్ ఉత్సవాల్లో ముఖ్యమైనది పులియాగెనో. దీనిని బంజారా మహిళలు అద్దాలు, గవ్వలు, పూసలతో చూడముచ్చటగా తయారు చేస్తారు. కలశం ద్వారా జలాలను యువతులు ఎత్తుకొచ్చేటప్పుడు తలపైన పెట్టుకునే దాన్ని గెనో, రెండు కలశాలపై కప్పుకుని వచ్చే దానిని పులియా అని వ్యవహరిస్తారు. వివాహ సమయంలో పులియాగెనోను తమ కుమార్తెకు తల్లిదండ్రులు బహుమానంగా అందిస్తారు. - బానోతు లక్ష్మీబాయి పరిశోధక విద్యార్థి (జర్నలిజం శాఖ). (బంజారాల బతుకమ్మ తీజ్ పండుగ సందర్భంగా) -
ఎవర్గ్రీన్ బ్యూటీ.. బంజారా ఫ్యాషన్!
బంజారా రంగుల కళ మన ప్రాచీన సంస్కృతి గిరులలో వికసించి పురజనులలో మెరిసి మురిసింది ఎల్లలు దాటి విరాజిల్లుతూనే ఉంది ఎల్లవేళలా కనులవిందు చేస్తూనే ఉంది ఎవర్గ్రీన్ బ్యూటీ అని చాటుతూనే ఉంది రాజస్థానీ ఎంబ్రాయిడరీ కళ గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. రాజస్థానీయుల్లో చాలా మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు వలసలు వచ్చి స్థిరపడ్డారు. అలా ఎంతో ప్రాచీనమైన వీరి వేషధారణ దేశమంతా తెలుసు. ఇప్పటికీ బంజారాలలో పూర్తి వేషధారణను 50 ఏళ్ల వారు ధరించడం చూస్తుంటాం. ఈ ఎంబ్రాయిడరీ కళ ఫ్యాషన్ పరిశ్రమలోకి ఎలా వచ్చింది? ఇంకా ఎంతలా కట్టిపడేస్తోంది? బంజారా దారపు పోగుల గొప్పతనం, అద్దాల మెరుపులు ఫ్యాషన్ వేదికల పై ఎంతగా హొయలు పోతున్నాయి.. వంటి విషయాలు ఫ్యాషన్ డిజైనర్ మంగారెడ్డి మాటల్లో.. బంజారా ఎంబ్రాయిడరీ వర్క్ కళ గురించి? రాజస్థానీ సంస్కృతిలోనే రంగుల వెలుగులు ఉన్నాయి. వీరు పింక్, ఎల్లో, రెడ్.. వంటి సహజసిద్ధమైన, కాంతిమంతమైన రంగులతో ‘లెహిరియా’ అనే టై అండ్ డై పద్ధతిని వాడుతుంటారు. రాజస్థాన్ ఎడారి ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడి వేడి వాతావరణానికి తగ్గట్టుగా బ్యాక్‌లెస్ బ్లౌజ్‌లు వాడుతుంటారు. సంస్కృతి అనేది సౌకర్యాన్ని బట్టి మారుతుంటుంది. మోడర్న్ ఫ్యాషన్ రంగాన్ని బంజారా వర్క్ ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? ఫ్యాషన్ అంటేనే మన సంస్కృతి నుంచే ఏదో ఒకదానిని తీసుకుంటూ, కలుపుకుంటూ వెళ్లడం. బంజారా డ్రెస్సింగ్, ఆ వర్క్ సంస్కృతికి కళ తీసుకువచ్చేది. ఆ కళను ఆధునిక దుస్తులకు ఎంతో కొంత జతచేసినా మంచి లుక్ వస్తుంది. అందుకే, మోడర్న్ కట్‌కి ఇండియన్ వర్క్‌ని జత చేస్తూ వచ్చారు డిజైనర్లు. నెక్కి లేదా బార్డర్ లేదా ఫుల్ బ్లౌజ్ ఎంబ్రాయిడరీ వాడి మిగతా ప్లెయిన్గానో చేస్తూ వైవిధ్యం తీసుకువచ్చారు. బంజారా అమ్మాయిలే ఒకప్పటిలా డ్రెస్ ధరించడానికి ఇష్టపడరు. ఈ కాలానికి తగ్గట్టుగా ఉండాలనుకుంటారు. అలాగని, వారి మూలాలను కాదనుకోలేరు. అలా కుర్తీ, టాప్, గౌన్.. ఇలా ప్రతి దాని మీద బంజారా వర్క్ తీసుకోవడం మొదలైంది. బంజారా వర్క్‌కి ఉన్న ప్రపంచ మార్కెట్? బంజారా వర్క్ వరల్డ్‌వైడ్ ఫేమస్ కావడంతో దీని మార్కెట్ మాటల్లో చెప్పలేనంత బాగుంది. ఈ ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్‌ని విదేశీయులు బాగా ఇష్టపడతారు. చూసిన వెంటనే గుర్తిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో ఆ విధంగా బాగా పాప్యులర్ అయ్యింది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కూడా ఈ వర్క్ బాగా రాణించిందని చెప్పచ్చు. రాజస్థానీ వాసి అయిన రూనాదేవి అనే స్వచ్ఛందృ సేవకురాలు లక్ష మందికి ఈ వర్క్ ద్వారా ఉపాధి చూపించింది. దీని ద్వారా విపరీతమైన మార్పు వచ్చింది. బంజారావర్క్లోని ఏదో ఒక అంశాన్ని అన్ని డ్రెస్సుల మీదకు ట్రాన్స్ఫర్ చేయడంతో టాలీవుడ్, బాలీవుడ్ అంటూ తేడా లేకుండా సినిమా తారలనూ ఆకట్టుకుంది. దీంతో కూడా అంతర్జాతీయ మార్కెట్ బాగా పెరిగింది. ఇప్పుడు ఈ వర్క్‌కి ఉన్న ట్రెండ్..? దాదాపు మూడు దశాబ్దాల క్రితం వచ్చిన గీతాంజలి సినిమాతో బంజారా వర్క్ మిగతా డ్రెస్సుల మీదకు ఎలా తీసుకోవచ్చో పరిచయం చేసినట్టు అయ్యింది. అప్పటినుంచి ప్రతి 2–3 ఏళ్లకోసారి ఈ వర్క్ ట్రెండ్‌లోకి వస్తూనే ఉంది. ఇప్పుడు ఇండియాలో టాప్ డిజైనర్ సునీత్ వర్మ బంజారా స్టైల్ మిర్రర్ వర్క్‌తో డ్రెస్ డిజైన్స్ చేస్తున్నారు. దీని వల్ల ఇప్పుడు మళ్లీ బంజారా వర్క్ ట్రెండ్‌లోకి వచ్చిందనే చెప్పవచ్చు. తరాలు మారినా బంజారా వర్క్ అనేది ఎప్పుడూ జీవనంలోనే ఉంటుంది. రాజస్థానీ ఫర్నిషింగ్లోనూ ఈ వర్క్ వాడుతుంటారు. ఫ్యాషన్‌లోనే కాకుండా వాల్ హ్యాంగింగ్స్, బెడ్‌షీట్స్, పిల్లో కవర్స్.. వంటి వాటిలోనూ వాడుతారు. బంజారా ఎంబ్రాయిడరీ వర్క్‌ది ఆల్‌టైమ్ బ్యూటీ. ఎప్పటికీ కళగా కొత్తపుంతలు తొక్కుతూనే ఉంటుంది. మంగారెడ్డి ఫ్యాషన్ డిజైనర్ -
సేవాలాల్ చూపిన మార్గంలో నడవాలి
సాక్షి, నిర్మల్అర్బన్: బంజారాల ఆరాధ్య గురువు సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నడవాలని కలెక్టర్ ఎం.ప్రశాంతి అన్నారు. జిల్లా కేంద్రం లోని ఎన్టీఆర్ స్టేడియంలో సోమవారం సంత్ సేవాలాల్ 280వ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ సమాజ శ్రేయస్సు కోసం సంత్ సేవాలాల్ చూపించిన మార్గం ఆదర్శనీయమన్నారు. ఆయన బోధనలను అందరూ ఆచరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో ఎస్పీ శశిధర్‌రాజు, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి వెంకటేశ్వర్లు, డీటీడబ్ల్యూవో శ్రీనివాస్‌రెడ్డి, ఆర్టీవో శ్యాంనాయక్, ఆల్ ఇండియా బంజారా లీగల్ సెల్ అధ్యక్షుడు అమర్‌సింగ్ తిలావత్, జెడ్పీటీసీ విమలాబాయి, సుజాత, పీఆర్‌డీఈఈ తుకారాం, మున్సిపల్ డీఈఈ సంతోష్, నాయకులు రాజేష్‌బాబు, రామునాయక్, నరేష్ జాదవ్, బలరాం నాయక్, రామారావు మహారాజ్, తదితరులున్నారు. సభా వేదికపై అతిథులు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.. సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా బంజారాలు సంప్రదాయ పద్ధతిన జిల్లా కేంద్రంలో ప్రదర్శన నిర్వహించారు. నృత్యాలతో అలరించారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్, ఎమ్మె ల్యే రేఖానాయక్, మహిళా ప్రజా ప్రతినిధులు నృత్యాలు చేసి ఉత్సాహపరిచారు. కల్యాణలక్ష్మీ చెక్కులు అందించాలి మహారాష్ట్ర నుంచి ఇక్కడ అనేక ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి కుల సర్టిఫికెట్లు జారీ చేయాలని కలెక్టర్‌ను కోరారు. చాలా మందికి కుల ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో కల్యాణలక్ష్మీ చెక్కులు అందడం లేదన్నారు. అలాగే ఆర్వోఆర్ పత్రాలను అందజేసి రైతుబంధు, రైతు బీమా పథకాలను వర్తింపజేయాలని కోరారు. – విఠల్‌రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించాలి ప్రభుత్వం జిల్లా కేంద్రంలో బంజారా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి హామీ ఇచ్చినా ఇప్పటి వరకు స్థలం కేటాయించలేదని పేర్కొన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఐదెకరాల స్థలం కేటాయించాలని కోరారు. ఏటా సంత్ సేవాలాల్ జయంతి సందర్భం గా ఒక చోట చేరుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. – రేఖా శ్యాంనాయక్, ఖానాపూర్ ఎమ్మెల్యే రూ.5కోట్ల నిధులు విడుదల చేయాలి సేవాలాల్ జయంతికి ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు విడుదల చేయాలన్నారు. ఏటా నిర్వహించే జయంతి కార్యక్రమాల్లో సీఎంలు హాజరు కావాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సేవాలాల్ చిత్రపటాలను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రత్యేక గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటు చేసి బంజారాల సమస్యలు పరిష్కరించాలన్నారు. – అమర్‌సింగ్ తిలావత్, ఆల్ ఇండియా బంజారా లీగల్ సెల్ అధ్యక్షుడు వేడుకలకు హాజరైన బంజారాలు -
కాంగ్‘రేసు’లో హోరాహోరీ!
సాక్షి, కొత్తగూడెం: ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో రాజకీయం ఎప్పటికప్పుడు సరికొత్త మలుపులు తిరుగుతోంది. టీఆర్ఎస్లో అభ్యర్థుల ప్రకటన తర్వాత చెలరేగిన అసమ్మతి ప్రస్తుతం సద్దుమణుగుతుండగా, కాంగ్రెస్ కూటమిలో మాత్రం ఇప్పటివరకు సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి రాలేదు. టీఆర్ఎస్ నుంచి సైతం కీలక నాయకులు కాంగ్రెస్‌లో చేరుతుండడంతో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఆ పా ర్టీలో టికెట్లు ఆశించేవారి సంఖ్య పెరుగుతూ పోతోంది. జిల్లాలో ముఖ్యంగా ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇల్లెందు శాసనసభ సీటు కోసం కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఆశావహులు భారీగా ఉన్నారు. ఇక్కడి నుంచి 15కు పైగా దరఖాస్తులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సీటు కోసం చీమల వెంకటేశ్వర్లు, డాక్టర్ భూక్యా రామచంద్రనాయక్, బాణోత్ హరిప్రియ, భూక్యా దళ్‌సింగ్‌నాయక్, భూక్యా మంగీలాల్నాయక్తో పాటు మరికొందరు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ప్రభుత్వ ఉన్నతాధికారులు సైతం ఉన్నారు. తాజాగా టీఆర్ఎస్ను వీడిన మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన మరికొందరు నాయకులు కూడా టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. కోరం కనకయ్య స్వగ్రామమైన టేకులపల్లి మండలం కోయగూడెంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు దళపతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు టీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే బాటలో మరికొందరు ఉన్నారు. ఈ క్రమంలో ఊకె అబ్బయ్య కాంగ్రెస్ టికెట్ రేసులో ముందుకు దూసుకొచ్చారు. టీపీసీసీలో అత్యంత కీలక నేతల ఆశీస్సులతో ఆయన ఢిల్లీ స్థాయిలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మారిన సమీకరణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇల్లెందు నియోజకవర్గంలో మరో సర్వే చేయించేందుకు ఏర్పాట్లు చేసింది. గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అబ్బయ్య కాంగ్రెస్ టికెట్ రేసులోకి రావడంతో ఇక్కడ రాజకీయం మరిన్ని ములుపులు తిరిగేందుకు బీజం వేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బంజారా ఆశావహుల ఐక్య ప్రయత్నాలు.. ఇల్లెందు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఆశావహుల జాబితా చాంతాడంత ఉంది. తాజాగా ఊకె అబ్బయ్య చేరికతో మరో సంఖ్య పెరిగింది. ఇదిలా ఉండగా, టికెట్ తమకే కేటాయించాలంటూ బంజారా నాయకులు కలసికట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆశావహులైన హరిప్రియ, డాక్టర్ రామచందర్‌నాయక్, దళ్‌సింగ్‌నాయక్, హరిసింగ్‌నాయక్, మంజ్యా శ్రీను, మంగీలాల్ నాయక్, కిషన్ నాయక్, బాలాజీరావ్ నాయక్, రాములు నాయక్‌లు మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు వెళ్లి టీపీసీసీ అగ్రనేతలను కలిసి ఇల్లెందు టికెట్‌ను ఎలాగైనా బంజారాలకే కేటాయించాలని కోరారు. తమలో ఎవరికి ఇచ్చినా సర్దుకుపోతామని చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇల్లెందులో చీమల వెంకటేశ్వర్లుకు పోటీగా మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య గట్టి ప్రయత్నాలు చేస్తుండగా, బంజారాల నుంచి సరికొత్త ప్రతిపాదన రావడంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొత్తగా మరో సర్వే చేయిస్తోంది. అశ్వారావుపేట నియోజకవర్గం సీటును టీడీపీకి ఇస్తే సహకరించేది లేదని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రకటించాయి. ఇక్కడి నుంచి కోలా లక్ష్మీనారాయణ, సున్నం నాగమణి, బాణోత్ పద్మావతి దరఖాస్తు చేసుకున్నారు. ఎస్టీ నాయకపోడు సామాజిక వర్గం నుంచి టికెట్ డిమాండ్ చేస్తూ కోలా లక్ష్మీనారాయణను రంగంలోకి దింపారు. కోలా కోసం వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న నాయకపోడు ఉద్యోగులు ఆర్ధిక సహకారం అందించేందుకు భారీగానే ఫండ్ ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కారం శ్రీరాములు, ధంజూనాయక్ సైతం రేసులోకి వచ్చారు. ఈ సీటును టీడీపీ గట్టిగా అడుగుతుండగా, కాంగ్రెస్ ఆశావహులు మాత్రం తమవంతుగా భారీస్థాయిలో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇక పినపాక నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకే టికెట్ వచ్చే అవకాశాలు ఉందని తెలుస్తోంది. భద్రాచలం నియోజకవర్గం నుంచి అంతా కొత్తవారే దరఖాస్తు చేసుకున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఆశీస్సులతో కారం కృష్ణమోహన్, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ ద్వారా కృష్ణబాబు, రేణుకాచౌదరి ఆశీస్సులతో నాగేంద్రప్రసాద్, కొప్పుల రాజు ఆశీస్సులతో కుర్స వెంకటేశ్వర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్తగూడెం సీటు కోసం మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, టీపీసీసీ సభ్యుడు ఎడవల్లి కృష్ణ హోరాహోరీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్ నాయకత్వం భారీగానే కసరత్తు చేయాల్సి వస్తోంది. -
'ఎస్టీల్లోంచి మమ్మల్ని తొలగించడం ఎవరి తరమూ కాదు'
సాక్షి, హైదరాబాద్ : ‘‘లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించడం ఎవరి తరమూ కాదు. రాజ్యాంగం కల్పించిన హక్కును ఎవరూ మార్చలేరు. అలా చేస్తే తిరగబడతాం. ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమిస్తాం..’’అని లంబాడీ ప్రజాప్రతినిధులు, నేతలు పేర్కొన్నారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం గిరిజన కులాల మధ్య అగ్గిరాజేశారని, దాన్ని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. లంబాడీలు, ఆదివాసీలు, గోండులు, కోయ తదితర గిరిజన కులాలన్నీ కలసిమెలసి ఉండాలని.. ఎస్టీలకు రావాల్సిన వాటాను పూర్తిస్థాయిలో దక్కించుకునేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బుధవారం లంబాడీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ మైదానంలో ‘లంబాడీల శంఖారావం’సభ జరిగింది. ఇందులో ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్సీ రాములు నాయక్, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్, రవికుమార్, రేఖానాయక్, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, లంబాడీ ఐక్య వేదికలోని సంఘాల నాయకులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో లంబాడీలు హాజరై శంఖారావానికి మద్దతు తెలిపారు. అనవసర తగాదాలు వద్దు! నలభై రెండేళ్ల నుంచి ఎస్టీలుగా ఉన్నామని, అలాంటి లంబాడీలను వలసవాదులని ఎలా అంటారని ఎంపీ సీతారాంనాయక్ ప్రశ్నించారు. ‘‘క్రీమీలేయర్ ద్వారా గిరిజన యాక్టును తీసుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మంది లంబాడీలు ఎస్టీలుగా ఉన్నారు. షెడ్యూల్డ్ తెగల్లో లంబాడీలు 70శాతం ఉంటే.. కేవలం రెండు శాతం లేని వాళ్లు మమ్మల్ని శాసిస్తున్నారు. కొందరు రాజకీయ ప్రయోజనాలను కాంక్షిస్తూ ఆదివాసీలు, లంబాడీల మధ్య చిచ్చు పెట్టి అంతరాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఎత్తులను సాగనివ్వం. అందరం ఐక్యంగా ఉంటాం. సమస్యలుంటే కూర్చొని పరిష్కరించుకోవాలి. అనవసర తగాదాలతో రాద్దాంతం చేయొద్దు..’’అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రిజర్వేషన్లకు ప్రమాదం వచ్చే అవకాశముందని, ఐక్యంగా ఉంటేనే సమాజంలో మనగలుగుతామని వ్యాఖ్యానించారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే ఎస్టీలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తగాదా పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వల్లే లంబాడీలు ఎస్టీ జాబితాలో చేరారని కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ పేర్కొన్నారు. రిజర్వేషన్లతోనే గిరిజన కులాలు ఈ మాత్రం అభివృద్ధి చెందాయన్నారు. గిరిజన కులాల మధ్య తగాదాలు పెట్టేందుకు ప్రభుత్వంలోని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. లంబాడీలకు, ఆదివాసీలకు ఎలాంటి శత్రుత్వం లేదని, సోదరుల్లా కలసి ఉంటామని ఎమ్మెల్సీ రాములునాయక్, రవికుమార్ పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చి డెబ్బై ఏళ్లయినా ఎస్టీలు అభివృద్ధికి దూరంగా ఉన్నారని.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాట పడుతున్న ఎస్టీలను దారి మళ్లించేందుకు కొందరు కలహాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఫలాలు అందరికీ అందుతున్నాయి ఎస్టీ రిజర్వేషన్ల ద్వారా వచ్చిన ప్రయోజనాలను లంబాడీలే అనుభవించడం లేదని.. ఎస్టీ కులాలందరికీ అందుతున్నాయని ఎమ్మెల్యే రేఖానాయక్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్లను ఎక్కువగా ఆంధ్రా గిరిజనులే వినియోగించుకున్నారని ఆరోపించారు. లంబాడీల్లో ఇంకా వెనుకబాటుతనం ఉందని, గిరిజన తండాలను పరిశీలిస్తే సమస్యలు తెలుస్తాయని చెప్పారు. ఆదివాసీల వెనుకబాటుతనానికి, లంబాడీలకు ఎలాంటి సంబంధం లేదని గిరిజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గుగులోత్ శంకర్‌నాయక్ అన్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సోయం బాబూరావు ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వేదికపై ‘రాజకీయ’వివాదం లంబాడీల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని ఎమ్మెల్సీ రాములునాయక్ తదితరులు ప్రసంగంలో పేర్కొనడంతో సభికుల నుంచి నిరసన వ్యక్తమైంది. వేదికపై పలువురు లంబాడీ సంఘాల నేతలు మైకు తీసుకుని.. ‘ఇది టీఆర్ఎస్ పార్టీ సభ కాదు. గిరిజనుల సమస్యలనే ప్రస్తావించాలి..’అని పేర్కొనడంతో గందరగోళం మొదలైంది. వేదికపైనే రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకోవడంతో కార్యక్రమం దాదాపు అరగంట సేపు స్తంభించిపోయింది. కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ జోక్యం చేసుకుని సముదాయించడంతో చివరికి పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే అప్పటికే పలువురు నాయకులు, సభకు హాజరైన లంబాడీలు వెనుదిరగడం కనిపించింది. కిక్కిరిసిన సభా ప్రాంగణం.. ట్రాఫిక్ జామ్ లంబాడీల శంఖారావం సభకు పెద్ద సంఖ్యలో లంబాడీలు హాజరయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన లంబాడీలు ఉదయం నుంచే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. గతవారం ఇక్కడే జరిగిన ఆదివాసీల సదస్సుకు భారీగా స్పందన రావడం, పోలీసులు పెద్దగా ఏర్పాట్లు చేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో... తాజాగా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పలుచోట్ల ట్రాఫిక్‌ను మళ్లించారు. సభకు వచ్చే వాహనాలను ఎల్బీనగర్ రింగ్‌రోడ్డుకు మూడు కిలోమీటర్ల దూరంలోనే నిలిపివేశారు. అయితే లంబాడీలు పాదయాత్రగా సభాప్రాంగణానికి రావడంతో.. ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు గంటల తరబడి ఇబ్బంది పడ్డారు. దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్లే వాహనాలు, అటువైపు నుంచి వచ్చే వాహనాలైతే గంటల తరబడి రోడ్లపైనే నిలిచిపోయాయి. -
రోడ్డెక్కిన బంజారాలు
నివేశన స్థలాల కోసం ఆందోళన నిలిచిన రామగుండం ఫై ్లఓవర్ పనులు రామగుండం: రామగుండం పట్టణంలోని రైల్వేఫై ్లఓవర్ వంతెన నిర్మాణానికి ఆది నుంచి అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. దీంతో పనులు ఏళ్ల తరబడి కొనసా....గుతున్నాయి. నిర్వాసితులకు సకాలంలో అధికారులు పరిహారం చెల్లించకపోవడంతో బాధితులు ఉద్యమబాట పట్టారు. దీంతో మళ్లీ పనులకు బ్రేక్ పడింది. వంతెన నిర్మాణంలో 63 గహాలు పూర్తిగా కోల్పోతున్న బంజారాలు రోడ్కెక్కారు. ప్రస్తుతం నివాసముంటున్న కాలనీకి ఫర్లాంగు దూరంలోనే సర్వే నంబర్ 376లో లేఅవుట్ చేసుకోవచ్చని పక్షం రోజుల క్రితం తహసీల్దార్ ఆదేశించడంతో పనులు మొదలుపెట్టారు. ఈ క్రమంలో అదే స్థలంలో తమకు ఇరవై ఏళ్ల క్రితం పట్టాలు జారీ చేశారంటూ ఇప్పటికే ఇరవై మంది పనులకు అడ్డుతగులుతున్నారు. దీంతో అధికారుల వైఖరిపై బంజారాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా జీవితాలతో ఆడుకుంటున్నరు – బానోతు లలిత, బాధితురాలు. మూడేళ్ల నుంచి తమ బతుకులకు భరోసా లేకుండా పోతుంది. మా ఇంట్లోలందరం కట్టెలు కొట్టుకుని, కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. సార్లు మా ఇంటికి లక్ష రూపాయలు ఇచ్చిండ్లు. అవి కూడా ఒక్కసారి కాదు. గిప్పుడు జాగలల్ల ఇండ్లు ఆ పైసలతోటి అయితయా. మా బతుకులతో ఆడుకుంటున్నరు. ఈ జాగను వదులుకోం.... – బాతోడు రాజమ్మ మీరు ఇండ్లు కట్టుకోండ్లి... ఎవరైన అస్తే నా దగ్గరికి పంపుండ్లీ.. అంటూ ఎమ్మార్వో సారు చెప్పిండు. మరో సారేమో మీ దగ్గరకు ఎవ్వరు రారు మీరే గొడవలు లేకుండా సర్దుబాటు చేసుకొని తొందరగా ఇండ్లు ఖాళీ చేస్తే వంతెన నిర్మిస్తామంటూ మమ్మల్ని నమ్మబలుకుతున్నడు. ఏదేమైనా మా ఇండ్ల నిర్మాణం అయ్యే దాకా ఈ జాగా వదులుకునేది లేదు. నిరక్షరాస్యులమనే నిర్లక్ష్యం – గగులోతు భాగ్య మేము సదువుకోలేదని సార్లు మమ్మల్ని పక్కదారి పట్టిస్తండ్లనిపిస్తుంది. ఇప్పటికే మాకు సూపించిన జాగలో ఇదీ మాదే అంటూ ఎవరెవరో వచ్చి దాని పేపర్లు సూపిత్తండ్లు. మరీ మేము ఈ జాగలో పనులు మొదలుపెట్టినంక మల్లొక్కరు అచ్చి అడ్డుకుంటే మళ్లీ నష్టపోవాల్నా. ఒక్కసారు వారం రోజులు మాదగ్గర ఉంచుండ్లీ ఈ జాగ మాదని ఎవ్వరైనా అస్తే ఆయనే చూసుకుంటడు. స్థలాలు చూపించలేదు... – శ్రీనివాస్‌రావు, తహసీల్దార్ నేనిప్పటి వరకు వాళ్లు చదును చేసే స్థలం (మోఖా) వద్దకు వెళ్లలేదు. కాకపోతే ఈ ప్రాంతంలో ప్రభుత్వ స్థలం ఉంటే కేటాయించేందుకు ప్రయత్నిస్తా. అసలు బాధితులతో తాను ఈ వారంలో చర్చలు జరుపలేదు. బాధితులకు స్థలాలు కేటాయించే ఏర్పాట్లపై ఉన్నతాధికారుల సమక్షంలో సమావేశం నిర్వహించాకా స్థలాలను కేటాయించాల్సి ఉంటుంది.