'ఎస్టీల్లోంచి మమ్మల్ని తొలగించడం ఎవరి తరమూ కాదు' | Banjaras Hold ‘Lambadi Shankaravam’ Meeting At Saroornagar Stadium | Sakshi
Sakshi News home page

'ఎస్టీల్లోంచి మమ్మల్ని తొలగించడం ఎవరి తరమూ కాదు'

Published Thu, Dec 14 2017 1:40 AM | Last Updated on Thu, Dec 14 2017 3:47 AM

Banjaras Hold ‘Lambadi Shankaravam’ Meeting At Saroornagar Stadium - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘‘లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించడం ఎవరి తరమూ కాదు. రాజ్యాంగం కల్పించిన హక్కును ఎవరూ మార్చలేరు. అలా చేస్తే తిరగబడతాం. ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమిస్తాం..’’అని లంబాడీ ప్రజాప్రతినిధులు, నేతలు పేర్కొన్నారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం గిరిజన కులాల మధ్య అగ్గిరాజేశారని, దాన్ని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. లంబాడీలు, ఆదివాసీలు, గోండులు, కోయ తదితర గిరిజన కులాలన్నీ కలసిమెలసి ఉండాలని.. ఎస్టీలకు రావాల్సిన వాటాను పూర్తిస్థాయిలో దక్కించుకునేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బుధవారం లంబాడీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ మైదానంలో ‘లంబాడీల శంఖారావం’సభ జరిగింది. ఇందులో ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్సీ రాములు నాయక్, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్, రవికుమార్, రేఖానాయక్, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, లంబాడీ ఐక్య వేదికలోని సంఘాల నాయకులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో లంబాడీలు హాజరై శంఖారావానికి మద్దతు తెలిపారు.

అనవసర తగాదాలు వద్దు!
నలభై రెండేళ్ల నుంచి ఎస్టీలుగా ఉన్నామని, అలాంటి లంబాడీలను వలసవాదులని ఎలా అంటారని ఎంపీ సీతారాంనాయక్‌ ప్రశ్నించారు. ‘‘క్రీమీలేయర్‌ ద్వారా గిరిజన యాక్టును తీసుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మంది లంబాడీలు ఎస్టీలుగా ఉన్నారు. షెడ్యూల్డ్‌ తెగల్లో లంబాడీలు 70శాతం ఉంటే.. కేవలం రెండు శాతం లేని వాళ్లు మమ్మల్ని శాసిస్తున్నారు. కొందరు రాజకీయ ప్రయోజనాలను కాంక్షిస్తూ ఆదివాసీలు, లంబాడీల మధ్య చిచ్చు పెట్టి అంతరాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఎత్తులను సాగనివ్వం. అందరం ఐక్యంగా ఉంటాం. సమస్యలుంటే కూర్చొని పరిష్కరించుకోవాలి. అనవసర తగాదాలతో రాద్దాంతం చేయొద్దు..’’అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రిజర్వేషన్లకు ప్రమాదం వచ్చే అవకాశముందని, ఐక్యంగా ఉంటేనే సమాజంలో మనగలుగుతామని వ్యాఖ్యానించారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే ఎస్టీలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు.

తగాదా పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు..
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వల్లే లంబాడీలు ఎస్టీ జాబితాలో చేరారని కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌ పేర్కొన్నారు. రిజర్వేషన్లతోనే గిరిజన కులాలు ఈ మాత్రం అభివృద్ధి చెందాయన్నారు. గిరిజన కులాల మధ్య తగాదాలు పెట్టేందుకు ప్రభుత్వంలోని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. లంబాడీలకు, ఆదివాసీలకు ఎలాంటి శత్రుత్వం లేదని, సోదరుల్లా కలసి ఉంటామని ఎమ్మెల్సీ రాములునాయక్, రవికుమార్‌ పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చి డెబ్బై ఏళ్లయినా ఎస్టీలు అభివృద్ధికి దూరంగా ఉన్నారని.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాట పడుతున్న ఎస్టీలను దారి మళ్లించేందుకు కొందరు కలహాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

ఫలాలు అందరికీ అందుతున్నాయి
ఎస్టీ రిజర్వేషన్ల ద్వారా వచ్చిన ప్రయోజనాలను లంబాడీలే అనుభవించడం లేదని.. ఎస్టీ కులాలందరికీ అందుతున్నాయని ఎమ్మెల్యే రేఖానాయక్‌ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్లను ఎక్కువగా ఆంధ్రా గిరిజనులే వినియోగించుకున్నారని ఆరోపించారు. లంబాడీల్లో ఇంకా వెనుకబాటుతనం ఉందని, గిరిజన తండాలను పరిశీలిస్తే సమస్యలు తెలుస్తాయని చెప్పారు. ఆదివాసీల వెనుకబాటుతనానికి, లంబాడీలకు ఎలాంటి సంబంధం లేదని గిరిజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గుగులోత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సోయం బాబూరావు ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

వేదికపై ‘రాజకీయ’వివాదం
లంబాడీల అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని ఎమ్మెల్సీ రాములునాయక్‌ తదితరులు ప్రసంగంలో పేర్కొనడంతో సభికుల నుంచి నిరసన వ్యక్తమైంది. వేదికపై పలువురు లంబాడీ సంఘాల నేతలు మైకు తీసుకుని.. ‘ఇది టీఆర్‌ఎస్‌ పార్టీ సభ కాదు. గిరిజనుల సమస్యలనే ప్రస్తావించాలి..’అని పేర్కొనడంతో గందరగోళం మొదలైంది. వేదికపైనే రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకోవడంతో కార్యక్రమం దాదాపు అరగంట సేపు స్తంభించిపోయింది. కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌ జోక్యం చేసుకుని సముదాయించడంతో చివరికి పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే అప్పటికే పలువురు నాయకులు, సభకు హాజరైన లంబాడీలు వెనుదిరగడం కనిపించింది.

కిక్కిరిసిన సభా ప్రాంగణం.. ట్రాఫిక్‌ జామ్‌
లంబాడీల శంఖారావం సభకు పెద్ద సంఖ్యలో లంబాడీలు హాజరయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన లంబాడీలు ఉదయం నుంచే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. గతవారం ఇక్కడే జరిగిన ఆదివాసీల సదస్సుకు భారీగా స్పందన రావడం, పోలీసులు పెద్దగా ఏర్పాట్లు చేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో... తాజాగా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పలుచోట్ల ట్రాఫిక్‌ను మళ్లించారు. సభకు వచ్చే వాహనాలను ఎల్‌బీనగర్‌ రింగ్‌రోడ్డుకు మూడు కిలోమీటర్ల దూరంలోనే నిలిపివేశారు. అయితే లంబాడీలు పాదయాత్రగా సభాప్రాంగణానికి రావడంతో.. ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. వాహనదారులు గంటల తరబడి ఇబ్బంది పడ్డారు. దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్లే వాహనాలు, అటువైపు నుంచి వచ్చే వాహనాలైతే గంటల తరబడి రోడ్లపైనే నిలిచిపోయాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement