పటాన్‌చెరు: మతతత్వ బీజేపీతో బంజారాలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో జరిగిన రాష్ట్ర బంజారా ఎంప్లాయీస్ సేవాసంఘ్ కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో కలసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లంబాడాలకు రిజర్వేషన్లు తొలగించాలని ఓ తెలంగాణ ఎంపీ డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు.
గిరిజన ఉద్యోగులపై బీజేపీ వాదులు దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నెల రోజుల్లో పోడు భూముల సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా బంజారా భవన్‌ను నిర్మిస్తున్నామని, సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నామని, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని హరీశ్‌రావు వివరించారు.
ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచామని, ఎస్టీ బాలికల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలను తెరిచామని గుర్తు చేశారు. కాగా, గిరిజన యూనివర్సిటీ మంజూరు విషయంలో కేంద్రం తాత్సారం చేస్తోందన్నారు. ఏడేళ్ల క్రితం 317 ఎకరాల భూమిని ఈ యూనివర్సిటీ కోసం కేటాయించినప్పటికీ నేటికీ అక్కడ యూనివర్సిటీ రాలేదన్నారు. ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు రాలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని నిలదీయాలని ఆయన కోరారు.
కాంగ్రెస్, టీడీపీలు బంజారాలను ఓట్ల కోసం వాడుకున్నాయే తప్ప వారి అభ్యున్నతికి చేసిందేమీ లేదన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో బంజారాలు బీఆర్‌ఎస్‌ను బలపరుస్తున్నారని తెలిపారు. త్వరలో భర్తీ చేయనున్న 81 వేల ఉద్యోగాల్లో బంజారాలకు పది శాతం రిజర్వేషన్లు ఉంటాయన్నారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment