గాంధీభవన్ వద్ద ఇల్లెందు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న బంజారా నాయకులు
సాక్షి, కొత్తగూడెం: ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో రాజకీయం ఎప్పటికప్పుడు సరికొత్త మలుపులు తిరుగుతోంది. టీఆర్‌ఎస్‌లో అభ్యర్థుల ప్రకటన తర్వాత చెలరేగిన అసమ్మతి ప్రస్తుతం సద్దుమణుగుతుండగా, కాంగ్రెస్ కూటమిలో మాత్రం ఇప్పటివరకు సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి రాలేదు. టీఆర్‌ఎస్ నుంచి సైతం కీలక నాయకులు కాంగ్రెస్‌లో చేరుతుండడంతో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఆ పా ర్టీలో టికెట్లు ఆశించేవారి సంఖ్య పెరుగుతూ పోతోంది. జిల్లాలో ముఖ్యంగా ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఏర్పడింది.
ఇల్లెందు శాసనసభ సీటు కోసం కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఆశావహులు భారీగా ఉన్నారు. ఇక్కడి నుంచి 15కు పైగా దరఖాస్తులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సీటు కోసం చీమల వెంకటేశ్వర్లు, డాక్టర్ భూక్యా రామచంద్రనాయక్, బాణోత్ హరిప్రియ, భూక్యా దళ్‌సింగ్‌నాయక్, భూక్యా మంగీలాల్‌నాయక్‌తో పాటు మరికొందరు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ప్రభుత్వ ఉన్నతాధికారులు సైతం ఉన్నారు. తాజాగా టీఆర్‌ఎస్‌ను వీడిన మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన మరికొందరు నాయకులు కూడా టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. కోరం కనకయ్య స్వగ్రామమైన టేకులపల్లి మండలం కోయగూడెంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు దళపతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే బాటలో మరికొందరు ఉన్నారు. ఈ క్రమంలో ఊకె అబ్బయ్య కాంగ్రెస్ టికెట్ రేసులో ముందుకు దూసుకొచ్చారు. టీపీసీసీలో అత్యంత కీలక నేతల ఆశీస్సులతో ఆయన ఢిల్లీ స్థాయిలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మారిన సమీకరణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇల్లెందు నియోజకవర్గంలో మరో సర్వే చేయించేందుకు ఏర్పాట్లు చేసింది. గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అబ్బయ్య కాంగ్రెస్ టికెట్ రేసులోకి రావడంతో ఇక్కడ రాజకీయం మరిన్ని ములుపులు తిరిగేందుకు బీజం వేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బంజారా ఆశావహుల ఐక్య ప్రయత్నాలు..
ఇల్లెందు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఆశావహుల జాబితా చాంతాడంత ఉంది. తాజాగా ఊకె అబ్బయ్య చేరికతో మరో సంఖ్య పెరిగింది. ఇదిలా ఉండగా, టికెట్ తమకే కేటాయించాలంటూ బంజారా నాయకులు కలసికట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆశావహులైన హరిప్రియ, డాక్టర్ రామచందర్‌నాయక్, దళ్‌సింగ్‌నాయక్, హరిసింగ్‌నాయక్, మంజ్యా శ్రీను, మంగీలాల్ నాయక్, కిషన్ నాయక్, బాలాజీరావ్ నాయక్, రాములు నాయక్‌లు మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు వెళ్లి టీపీసీసీ అగ్రనేతలను కలిసి ఇల్లెందు టికెట్‌ను ఎలాగైనా బంజారాలకే కేటాయించాలని కోరారు. తమలో ఎవరికి ఇచ్చినా సర్దుకుపోతామని చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇల్లెందులో చీమల వెంకటేశ్వర్లుకు పోటీగా మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య గట్టి ప్రయత్నాలు చేస్తుండగా, బంజారాల నుంచి సరికొత్త ప్రతిపాదన రావడంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొత్తగా మరో సర్వే చేయిస్తోంది.
అశ్వారావుపేట నియోజకవర్గం సీటును టీడీపీకి ఇస్తే సహకరించేది లేదని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రకటించాయి. ఇక్కడి నుంచి కోలా లక్ష్మీనారాయణ, సున్నం నాగమణి, బాణోత్ పద్మావతి దరఖాస్తు చేసుకున్నారు. ఎస్టీ నాయకపోడు సామాజిక వర్గం నుంచి టికెట్ డిమాండ్ చేస్తూ కోలా లక్ష్మీనారాయణను రంగంలోకి దింపారు. కోలా కోసం వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న నాయకపోడు ఉద్యోగులు ఆర్ధిక సహకారం అందించేందుకు భారీగానే ఫండ్ ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కారం శ్రీరాములు, ధంజూనాయక్ సైతం రేసులోకి వచ్చారు. ఈ సీటును టీడీపీ గట్టిగా అడుగుతుండగా, కాంగ్రెస్ ఆశావహులు మాత్రం తమవంతుగా భారీస్థాయిలో ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
ఇక పినపాక నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకే టికెట్ వచ్చే అవకాశాలు ఉందని తెలుస్తోంది. భద్రాచలం నియోజకవర్గం నుంచి అంతా కొత్తవారే దరఖాస్తు చేసుకున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఆశీస్సులతో కారం కృష్ణమోహన్, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ ద్వారా కృష్ణబాబు, రేణుకాచౌదరి ఆశీస్సులతో నాగేంద్రప్రసాద్, కొప్పుల రాజు ఆశీస్సులతో కుర్స వెంకటేశ్వర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్తగూడెం సీటు కోసం మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, టీపీసీసీ సభ్యుడు ఎడవల్లి కృష్ణ హోరాహోరీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్ నాయకత్వం భారీగానే కసరత్తు చేయాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment