కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి. చిత్రంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, ఠాక్రే, మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్‌యాదవ్, అజారుద్దీన్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇందులో భాగంగా రానున్న నెల రోజుల పాటు ‘తిరగబడదాం.. తరిమి కొడదాం’కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రానున్న నెలరోజుల పాటు రాష్ట్రంలోని గ్రామగ్రామాన కాంగ్రెస్ నేతలు తిరగాలని, ప్రతి ఇంటి తలుపూ తట్టి కాంగ్రెస్ పార్టీ ఆయా వర్గాలకు చేసిన మేలు, బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు వివరించాలని ఆయన కోరారు.
శనివారం గాందీభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు మన్సూర్ అలీఖాన్, శ్రీధర్‌బాబు, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాద వ్, అజారుద్దీన్, పార్టీ ముఖ్య నేతలు పొన్నం ప్రభాకర్, వేం నరేందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా తిరగబడదాం.. తరిమికొడదాం కార్యక్రమ నిర్వహణతో పాటు చేవెళ్లలో ఈనెల 26న నిర్వహించనున్న బహిరంగసభ విజయవంతంపై నేతలు చర్చించారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, చేవెళ్ల ప్రజాగర్జన సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని, ఈ సభలోనే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ప్రకటిస్తామని చెప్పారు. ఖమ్మం తరహాలోనే ఈ సభను విజయవంతం చేయడం కోసం పార్టీ నేతలు, కేడర్ పనిచేయాలని కోరారు. ఇందుకోసం ఈనెల 21 నుంచి 25 వరకు నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయి సమావేశాలు ఏర్పాటు చేయాల ని సూచించారు. సెప్టెంబర్ 17న పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తామని, అప్పటివరకు బీఆర్‌ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ చేయనున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే మాట్లాడుతూ, తిరగబడ దాం... తరిమికొడదాం కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన డిక్లరేషన్‌లలోని అంశాలను, చార్జిషీట్‌లను విస్తృతంగా ప్రచారం చేయాల ని కోరారు. కర్ణాటక తరహాలోనే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు స్కీంలను కూడా ప్రతి ఇంటికి చేర్చే బాధ్యతను కాంగ్రెస్ కేడర్ తీసుకోవాలని పిలుపునిచ్చారు. కాగా, తిరగబడదాం.. తరిమికొడదాం కార్యక్రమానికి పార్లమెంటరీ స్థానాల వారీగా ఇన్‌చార్జులను నియమించినట్టు గాందీభవన్ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment