సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థుల ప్రకటన శనివారం నుంచి ఆదివారం నాటికి వాయిదా పడడంతో ఆందోళన మొదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్, మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాలు పోటీ చేసే సీట్లపై లెక్క తేలినట్లు రెండు రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఆయా సీట్లు భాగస్వామ్య పక్షాల్లో ఎవరికి కేటాయిస్తారనే అంశం కాంగ్రెస్‌తోపాటు కూటమిలోని పక్షాలన్నింటికీ ప్రశ్నార్థకంగా మారింది. మూడు రోజుల క్రితం ఢిల్లీ చేరుకున్న ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ ఆశావహులు జాబితాలో తమకు చోటు లభించేంత వరకు పోరు సలపడంతోపాటు అమీతుమీ తేల్చుకునే పనిలో నిమగ్నమయ్యారు.
కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్‌తోపాటు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ కుంతియా వంటి నేతలను పలువురు ఆశావహులు కలిసి టికెట్ తమకు కేటాయించాలని కోరారు. కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ ఉమ్మడి జిల్లాలోని కొన్ని స్థానాలపై పట్టు వీడకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం ఇటు సొంత పార్టీ వారికి నచ్చజెప్పలేక.. అటు భాగస్వామ్య పక్షాలను బుజ్జగించలేక సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు మధిర కాంగ్రెస్‌కు సిట్టింగ్ స్థానం కావడం.. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహించడంతో అక్కడ ఆయన పేరును అధిష్టానం ఖరారు చేయగా.. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అలాగే కూటమి భాగస్వామ్య పక్షమైన టీడీపీకి సత్తుపల్లి సిట్టింగ్ స్థానం కావడం, అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సండ్ర వెంకటవీరయ్య ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించడం, అక్కడి నుంచి కాంగ్రెస్ ఆశావహులు సైతం పెద్దగా లేకపోవడంతో మహాకూటమిలో ఈ రెండు సీట్లపై స్పష్టత వచ్చింది.
అభ్యర్థుల మధ్య పోటాపోటీ..
ఇక మిగిలిన ఎనిమిది స్థానాల్లో కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌లోని అభ్యర్థుల మధ్య పోటాపోటీ నెలకొంది. ఇది అధిష్టానానికి తలనొప్పిగా పరిణమించగా.. ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ఏ భాగస్వామ్య పక్షం పోటీ చేస్తుందనే అంశంపై ఇంకా స్పష్టత కొరవడింది. ఈ నాలుగు స్థానాలు విషయంలో భాగస్వామ్య పక్షాల మధ్య వాదోప వాదాలకు, మాట పట్టింపులకు కారణంగా నిలిచాయనే ప్రచారం జరుగుతోంది. ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని కూటమి పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించారని, ఇక్కడి నుంచి మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు బరిలోకి దిగుతారని రెండు రోజులుగా ప్రచారం జరిగింది. కాంగ్రెస్ సైతం ఇక్కడ అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టడంతో ఈ స్థానం టీడీపీకి ఖరారైనట్లు భావించిన ఆ పార్టీ వర్గాలు ఎన్నికల బరిలోకి దిగేందుకు సమాయత్తమయ్యాయి.
నామా నాగేశ్వరరావు ఈనెల 12వ తేదీన జిల్లాకు వచ్చి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని సైతం టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సమయంలో కీలకమైన ఖమ్మంలో కాంగ్రెస్ పోటీ చేయడమే సబబు అని, ఈ సీటును కాంగ్రెస్‌కే కేటాయించాలని కాంగ్రెస్ ఆశావహులు పార్టీ పెద్దలను ఒప్పించేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదే అంశంపై ఖమ్మం టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, మానుకొండ రాధాకిషోర్ తదితరులు కాంగ్రెస్ సీనియర్ నేతలను, పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్‌ను విడివిడిగా కలిసి తమ అభ్యర్థనను విన్నవించారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో నుంచి అవసరమైతే తప్పుకుంటానని ప్రకటించిన కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి.. మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి.. జిల్లాలో సీట్ల కేటాయింపుపై ఇక్కడి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల మనోభావాలను ఏఐసీసీ నేతల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె వర్గీయులు ప్రచారం చేస్తున్నారు.
‘గూడెం’పై పట్టు విడవని సీపీఐ
ఇక కొత్తగూడెంకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వనమా వెంకటేశ్వరరావును బరిలోకి దించేందుకు నిర్ణయించినట్లు రెండు రోజులుగా ప్రచారం జరుగుతున్నా.. సీపీఐ ఈ స్థానంపై పట్టువీడడం లేదు. అవసరమైతే నామినేషన్ వేయడానికి సైతం వెనుకాడబోమని కూటమిలో కీలక పక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు సంకేతాలు పంపించడంతో సీపీఐని సర్దుబాటు చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ నేతలతో అధిష్టానం సమాలోచనలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక వైరా నియోజకవర్గం సీపీఐకి కేటాయించడం దాదాపు ఖరారైనా.. అక్కడి కాంగ్రెస్ ఆశావహులు మాత్రం తమకు ఒక్క అవకాశం కల్పించాలంటూ ఢిల్లీ నేతలను ఒప్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇక ఇల్లెందులో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక రసకందాయంలో పడింది.
ఇప్పటివరకు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య, పార్టీ నేతలు చీమల వెంకటేశ్వర్లు, హరిప్రియనాయక్ మధ్య ఈ సీటు దోబూచులాడుతుండగా.. తాజాగా మీటూనాయక్ పేరు ఏఐసీసీ స్థాయిలో ప్రస్తావనకు రావడం.. అభ్యర్థిత్వంపై ఆరా తీయడం కాంగ్రెస్ పార్టీ ఆశావహుల్లో కొంత అలజడి రేపుతోంది. పినపాకకు సంబంధించి రేగా కాంతారావు పేరు ఖరారయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా.. అశ్వారావుపేట నియోజకవర్గాన్ని టీడీపీ బలంగా కోరుతుండడంతో అక్కడి కాంగ్రెస్ ఆశావహుల్లో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి. అయినా తమకున్న మార్గాల ద్వారా కాంగ్రెస్‌కు టికెట్ కేటాయించాలని చివరి ప్రయత్నం చేస్తుండడం విశేషం. భద్రాచలంలో కృష్ణమోహన్, కృష్ణబాబు మధ్య సీటు దోబూచులాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే వీరిలో ఒకరి అభ్యర్థిత్వం పట్ల మరొకరు సుముఖంగా లేనిపక్షంలో ములుగు మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యను భద్రాచలం నుంచి బరిలోకి దింపే అవకాశాన్ని కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పాలేరుకు సంబంధించి కందాల ఉపేందర్‌రెడ్డి పేరు ఖరారైనట్లు ప్రచారం జరిగినా.. చివరి నిమిషంలో ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందనే ఆశతో అక్కడ టికెట్ ఆశిస్తున్న ఆశావహులు ఏఐసీసీ నేతలను కలిసినట్లు సమాచారం.
ఈ సీటు తనకే ఇవ్వాలని గట్టిగా పట్టుపడుతున్న మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ ఏఐసీసీ నేతలను ఇప్పటికే పలు దఫాలుగా కలిసినట్లు సమాచారం. నామినేషన్ల దాఖలుకు గడువు ముంచుకొస్తున్నా.. కాంగ్రెస్ జాబితా ప్రకటించకపోవడంతో ఆశావహుల్లో ఆందోళన పెల్లుబికుతుండగా.. ప్రధాన ప్రత్యర్థి అభ్యర్థుల జాబితాపై అనేక అంచనాలతో ఉన్న టీఆర్‌ఎస్.. ఆ జాబితా బహిర్గతమైతే తప్ప తన వ్యూహాలకు పదును పెట్టడం సాధ్యం కాదన్న భావనలో ఉందనే ప్రచారం జరుగుతోంది. 12వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుండడంతో ఆదివారం సాయంత్రం నాటికి కాంగ్రెస్, భాగస్వామ్య పక్షాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment