ఖరీదైన కాలేజిలు.. పనికిమాలిన డిగ్రీలు: రాజన్
పెద్ద మొత్తాల్లో ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకుని బడా సంస్ధల్లో డిగ్రీలు చేయడం వల్ల ఏం ప్రయోజనం కలగదనీ.. అందువల్ల విద్యార్ధి అప్పుల పాలవుతారని రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. శివనాదర్ యూనివర్సిటీలో స్నాతకోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రాజన్.. ఈ పై వ్యాఖ్యలు చేశారు. పెద్ద సంస్థల్లో చేరడం వల్ల ఏమీ ఉపయోగం లేదని, విద్యార్థి డిగ్రీని అందుకునే క్రమంలో అందుకు తగ్గ కృషి చేయాలని ఆయన అన్నారు. ఖరీదైన కాలేజీలు ఇస్తున్నవాటిలో చాలావరకు డిగ్రీలు పనికిమాలినవేనని.. వాటి వల్ల ఉద్యోగాలు రాక, తీసుకున్న విద్యారుణాలు తిరిగి చెల్లించలేక విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు అప్పుల పాలు అవుతున్నారని ఆయన వివరించారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రైవేటు విద్య ఖరీదు ఎక్కువగా ఉందనీ.. రాబోయే కాలంలో ఇది మరింతగా పెరగనుందని అన్నారు. ఈ విద్యాసంస్థలు వెనుకబడిన విద్యార్ధుల వైపు కన్నెత్తి కూడా చూడవనీ.. ఆఖరి అతను పనికిరాని డిగ్రీ, అప్పులతో సతమతం కావాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపారు. ఇలా స్నాతకోత్సవంలో చెప్పిన మాటలను పిల్లలు త్వరగానే మర్చిపోతారని కానీ, ఇప్పటి నుంచి ఐదేళ్ల తర్వాత విద్యార్థులకు ఉన్న నైపుణ్యాలను బట్టి మంచి ఉద్యోగాలు వస్తాయని అన్నారు.