ఆ వెబ్సైట్లు వాడితే మూడేళ్ల జైలు, భారీ ఫైన్
గత కొంతకాలం నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని వెబ్ సైట్లపై నిషేధం విధించి సూచనలు చేస్తూనే ఉన్నాయి. ఆ సైట్ల నుంచి ఏదేని రూపంలో డాటా డౌన్ లోడ్ చేసినట్లుగా, వీడియో చూసినట్లుగా గుర్తిస్తే ఆ నెటిజన్లు మూడేళ్ల జైలుశిక్ష అనుభవించడంతో పాటు రూ.3లక్షల జరిమానా కట్టాల్సి ఉంటుంది. తాజాగా జాతీయ మీడియాలో దీనిపై కొన్ని కథనాలు వస్తున్నాయి. టోరెంట్, తదితర బ్లాక్ చేసిన వెబ్ సైట్లను వాడటం మానేయాలంటూ వాటిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే ఏదో విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి అశ్లీల సమాచారం ఉండే వెబ్ సైట్ల నుంచి వీడియోలు, సినిమాలు, ఫొటోలు డౌన్ లోడ్ చేస్తూనే ఉన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది.
ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్(ఐఎస్పీ'లు) సహాయంతో ఇలాంటి వెబ్ సైట్ల నుంచి డాటా కాపీ, డౌన్ లోడ్ చేస్తున్న యూజర్లను గుర్తించే యోచనలో ఉంది. కాపీరైట్ చట్టం-1957 ప్రకారం సెక్షన్లు 63, 63-ఏ, 65, 65-ఏ కింద డాటా వాడిన యూజర్లపై గరిష్టంగా మూడేళ్ల జైలుశిక్ష, రూ.3లక్షల జరిమానా విధించాలని పేర్కొన్నారు. డొమైన్ నేమ్ సర్వీస్(డీఎన్ఎస్) సహాయంతో చాలా రకాల డాటా వెబ్ సైట్ల యూఆర్ఎల్స్(వెబ్ లింక్స్) ను బ్లాక్ చేశారు. కానీ ఇలా చేసిన సైట్లను కొన్ని టెక్నిక్స్ ద్వారా సులువుగా డీకోడ్ చేసి యూజ్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ విషయంపై సరైన మార్గదర్శకాలు లేని కారణంగా ఇప్పటివరకూ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. బ్లాక్ చేసిన వెబ్ సైట్లు వాడే యూజర్లపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి కసరత్తులు చేస్తున్నందున, త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది.