‘ఇది అల్లాహ్కి-రాముడికి మధ్య యుద్ధం!’
బెంగళూరు : ఎన్నికల రాష్ట్రం కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు దిగజారుడు వ్యాఖ్యల్లో పోటీపడుతున్నారు. ‘ఈ ఎన్నికలు అల్లాహ్కి రాముడికి మధ్య యుద్ధం’అంటూ బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపుతున్నాయి. అంతకుముందు మంత్రి రామనాథ రాయ్ ‘అల్లాహ్ అనుగ్రహంతోనే ఆరు సార్లు గెలిచాన’న్న మాటలు కూడా వివాదాస్పదమయ్యాయి.
అంతా అల్లాహ్ దయ! : దక్షిణ కన్నడ జిల్లాలోని బంత్వాల్ నియోజకవర్గంలో ముస్లింల ప్రాబల్యం ఎక్కువ. ఇక్కడి నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామనాథ్ రాయ్(కాంగ్రెస్).. మంత్రిగానూ కొనసాగుతున్నారు. ఇటీవలే నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. ‘ముస్లింలలోని లౌకికభావన, అల్లాహ్ అనుగ్రహాల వల్లే నేను ఆరుసార్లు గెలిచాను’ అని అన్నారు. మంత్రి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడంతో కాంగ్రెస్ వివరణ ఇచ్చుకోవాల్సివచ్చింది.
రాముణ్ని గెలిపించుకుందాం : అదే బంత్వాల్ నియోజకవర్గంలోని కల్లాడ్కలో మంగళవారం రాత్రి బీజేపీ భారీ సభను నిర్వహించింది. ఆ సభలో కర్కాల ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ.. మంత్రి రాయ్కి కౌంటర్ ఇచ్చారు. ‘‘ఆయన(రాయ్) అల్లాహ్ దువాతో గెలిచానని చెప్పుకుంటున్నాడు. మరి మనం మన దేవుణ్నిగెలిపించుకోలేమా, ఈ సారి బంత్వాల్లో జరిగే ఎన్నిక కాంగ్రెస్,బీజేపీల మధ్యకాదు.. అల్లాహ్-రాముడికి మధ్య యుద్ధం. మీరంతా రాయ్కి వ్యతిరేకంగా ఓటేసి మన దేవుణ్నే గెలిపించాలి’’ అని సునీల్ కుమార్ అన్నారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నంచేసిన ఈ ఇద్దరు నాయకులపై ఇప్పటివరకు ఎలాంటి కేసులూ నమోదుకాలేదు.