bar license
-
తాగినా... ఇన్ని అబద్ధాలు కష్టమే.. ఎల్లో మీడియా విషపురాతలు
చంద్రబాబు ప్రభుత్వం వేలం నిర్వహించకుండా లైసెన్సులిచ్చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ–వేలం నిర్వహించి లైసెన్సులు కేటాయించింది. ఎవరిది పారదర్శకత? బాబు హయాంలో 840 బార్లకు లైసెన్సులివ్వటం ద్వారా ప్రభుత్వానికి వచ్చింది ఏడాదికి రూ.289 కోట్లు. ఇప్పుడు 815 బార్లకు వేలంలో లైసెన్సులిస్తే వచ్చింది ఏకంగా రూ.597.35 కోట్లు. మరి ఎవరి హయాంలో ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చినట్లు? ఇక్కడ చెప్పాల్సిందేమిటంటే... చంద్రబాబు హయాంలో అడ్డగోలుగా తమ పార్టీ నేతలకు పంచేశారు. దోచుకో–పంచుకో–తినుకో (డీపీటీ) అనే తమ పాలసీలో భాగంగా బార్ల లైసెన్సుల్ని దోచుకున్నారు. ఇప్పుడేమో పారదర్శకంగా ఈ–వేలం నిర్వహించడంతో పోటీ పెరిగింది. ఎక్కువ మంది పాల్గొన్నారు. అందుకే ప్రభుత్వానికి అప్పటికన్నా రెట్టింపును మించి ఆదాయం వచ్చింది. కాకపోతే అప్పట్లో కేటాయింపులపై పెన్నెత్తని రామోజీరావు... ఇప్పుడు మాత్రం ‘కూడబలుక్కుని’ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు లైసెన్సులు పంచేసుకున్నారని రాయటం దిగజారుడుకు పరాకాష్ట కాక ఇంకేమనుకోవాలి? ఒకవంక ఈ ప్రభుత్వానికి బార్ల కేటాయింపుల ద్వారా ఎక్కువ డబ్బులు వస్తున్నాయని రాస్తూ... పోటీ వల్లే అంత వచ్చిందనే విషయాన్ని వదిలిపెట్టి, అంతా కుమ్మక్కయిపోయారని రాయటం ఏ మార్కు జర్నలిజం? అసలు మీ పాఠకులంటే మీకు అంత చులకనగా ఉందా రామోజీరావుగారూ? ఈ ప్రభుత్వ హయాంలో ఆదాయం పెరిగింది తప్ప ఒక్కటంటే ఒక్క బార్ కూడా పెరగలేదు. . అధికారంలోకి వస్తూనే వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఒక్క బెల్టు షాపు కూడా ఉండటానికి వీల్లేదనే కృతనిశ్చయంతో ఆ వ్యవస్థనే లేకుండా చేశారు. మద్యం దుకాణాల్లో వాటికి అనుబంధంగా నడిచే పర్మిట్ రూమ్‌లను రద్దు చేశారు. దుకాణాల సంఖ్యను గణనీయంగా తగ్గించి, ప్రభుత్వ నియంత్రణలో... నిర్ణీత వేళలు పాటిస్తూ అమ్మకాలు జరిపేలా నిర్దేశించారు. మొత్తంగా మద్యం లభ్యమయ్యే సమయాన్ని తగ్గించారు. తాగేవారు వెనకడుగు వేసేలా మద్యం ధరలు కూడా పెంచారు. ఇన్ని చర్యలు తీసుకున్నా... ‘ఈనాడు’ మాత్రం మద్యం విషయంలో రోజూ పిల్లిమొగ్గలు వేస్తూనే ఉంది. ప్రభుత్వంపై విషం చిమ్ముతూనే ఉంది. బాబు లైసెన్స్ ఇవ్వాలంటే.... టీడీపీ ప్రభుత్వం 2017లో రాష్ట్రంలో బార్ లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ జారీ చేయాలన్న కనీస విధానాన్ని కూడా పాటించ లేదు. అప్పటికే కాలపరిమితి ముగిసిన బార్ల యజమానులకే మళ్లీ లైసెన్సులను రెన్యూవల్ చేసేశారు. వేలం లేకుండా లైసెన్సులు మరో ఐదేళ్లు పొడిగించినందుకు అప్పటి 747 బార్ల యజమానులు భారీగా ముట్టజెప్పారనేది టీడీపీలో అప్పట్లో బహిరంగ రహస్యం. అదే ఏడాది కొత్తగా అనుమతి ఇచ్చిన మరో 84 బార్లదీ అదేతీరు. అతి తక్కువ అప్సెట్ ధరను ప్రభుత్వమే నిర్ణయించి... వాటికి బిడ్లు వేసిన వారిని లాటరీ ద్వారా ఎంపిక చేసేశారు. అలా 2017లో టీడీపీ ప్రభుత్వం 840 బార్లకు ఏకంగా ఐదేళ్లకు లైసెన్సులు జారీ చేసింది. 2019లో తమ ప్రభుత్వం పోయినా సరే టీడీపీ తమ్ముళ్ల బార్ల దందా అడ్డులేకుండా సాగాలనే కుతంత్రం ఆయనది. వీటిద్వారా 2021–22లో ప్రభుత్వానికి వచ్చింది కేవలం రూ.289.14కోట్లు. ఇప్పుడు పారదర్శకంగా ఈ–వేలం... అందుకే పోటీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేస్తూ కొత్త బార్ పాలసీని ప్రకటించింది. బార్ల సంఖ్యను పెంచలేదు. గతంలో ఉన్న 840 బార్లకే పరిమితమైంది. ఇక ఏకపక్షంగా బార్ల లైసెన్సులు కేటాయించకుండా నోటిఫికేషన్ జారీ చేసింది. తద్వారా బార్ల లైసెన్సు కోసం ఎవరైనా సరే పోటీ పడేందుకు అవకాశం కల్పించింది. అంతేకాదు బార్ల లైసెన్సుల కేటాయింపునకు ఇ–వేలం ప్రక్రియ నిర్వహించాలని నిర్ణయించింది. అంటే దరఖాస్తు సమర్పించినప్పటి నుంచి వేలంలో బిడ్ల దాఖలు వరకూ కూడా ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే నిర్వహించింది. ఎక్కడా అధికారులుగానీ మరెవరూగానీ జోక్యం చేసుకునేందుకు అవకాశమే ఇవ్వ లేదు. ఈ పారదర్శక విధానంతో బార్ల లైసెన్సుల కోసం ఎక్కువ మంది పోటీపడ్డారు. దాంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా ఎక్కువగా వచ్చింది. అదీ సంగతి. రాష్ట్రంలో 838 బార్ల లైసెన్సుల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి శని, ఆదివారాలు ఈ–వేలం నిర్వహించింది. మొత్తం 838 బార్ల కోసం 1,159మంది దరఖాస్తు చేశారు. వారిలో 1,078మంది ఈ–వేలంలో పాల్గొన్నారు. అదీ 815 బార్ల కోసమే. ( మరో 23 బార్ల లైసెన్సుల కోసం ఎవరూ ఆసక్తి చూపించలేదు. వాటి కోసం మళ్లీ ఈ–వేలం నిర్వహించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.) వైఎస్సార్సీపీ నేతలు సిండికేట్ అయ్యుంటే అంతమంది ఎందుకు బిడ్డింగులో పాల్గొంటారన్న నిజాన్ని ‘ఈనాడు’ ఉద్దేశపూర్వకంగానే విస్మరించింది. ముందే సిండికేట్ అయ్యుంటే ఆ ఒప్పందం ప్రకారం 815 మందికి 815 మందే ఈ–వేలంలో పాల్గొనేవారు. కానీ ఎక్కువ మంది పాల్గొన్నారంటే సిండికేట్ కాలేదన్నది స్పష్టమవుతోంది. ఇక సిండికేట్ అయ్యుంటే 23 బార్లకు ఎవరూ పోటీ పడకుండా ఎందుకు ఉంటారు...!? ఆ బార్లకు కూడా సిండికేట్ అయి తక్కువ ధరకే లైసెన్సు తీసుకునేవారు కదా. ఎందుకంటే బార్ల కోసం నోటిఫికేషన్ జారీ చేసిన నగరం, పట్టణాల్లో ఉన్న మార్కెట్‌ను అంచనా వేసుకునే బిడ్డర్లు పోటీ పడ్డారన్నది స్పష్టమవుతోంది. ఎక్కడా సిండికేట్ ఏర్పడలేదన్నది కూడా తేటతెల్లమవుతోంది. ప్రభుత్వానికి భారీగా ఆదాయం...టీడీపీ హయాం కంటే 106 శాతం అధికం... ఎక్కడైనా సిండికేట్ అయితే ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది. ప్రైవేటు వ్యక్తులకు లాభం పెరుగుతుంది. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం బార్ల లైసెన్సుల కోసం నిర్వహించిన ఈ–వేలం ద్వారా ప్రభుత్వ ఆదాయం ఏకంగా 106శాతం పెరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీ ప్రభుత్వం 2017లో ఐదేళ్లకు రెన్యూవల్ చేసిన 840 బార్ల లైసెన్సులతో చివరి ఏడాది అంటే 2021–22లో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.289.14కోట్లు మాత్రమే. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ–వేలం ద్వారా 815 బార్లకు కేటాయించిన లైసెన్సులతో మొదటి ఏడాదే రూ.506కోట్లు( దరఖాస్తు ఫీజుతో కలిపితే రూ.597.35కోట్లు)వచ్చాయి. టీడీపీ ప్రభుత్వ హయాం కంటే 106 శాతం అధికం. ఇక 2023–24, 2024–25లలో దరఖాస్తు ఫీజు ఉండదు. కానీ ప్రభుత్వ బార్ పాలసీలో పేర్కొన్న ప్రకారం అప్ సెట్ ధర, లైసెన్సు ఫీజు 10 శాతం చొప్పున పెరుగుతాయి. తద్వారా 2023–24లో రూ.543కోట్లు, 2024–25లో రూ.584.41కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రానుంది. రాష్ట్రంలో ఏకంగా 52 బార్ల లైసెన్సులను రూ.కోటి కంటే అధిక మొత్తానికి బిడ్డర్లు దక్కించుకున్నారు. అంటే ఈ–వేలంలో ఎంత తీవ్రంగా పోటీ సాగిందో తెలుస్తునే ఉంది. సిండికేట్ అయ్యుంటే అంతటి పోటీ జరిగేదా...!? నామమాత్రపు ధరకే లైసెన్సులు పొందేవారు కదా...!? చదవండి: ఫుల్ స్పీడ్‌తో ఇళ్లు -
పారదర్శకంగా బార్ల లైసెన్సుల ప్రక్రియ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో బుధవారం నాటికి 834 మంది నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించారు. కొత్త బార్ పాలసీ ప్రకారం బార్ల లైసెన్సుల జారీ ప్రక్రియను ఎక్సైజ్ శాఖ పూర్తిగా ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా నిర్వహిస్తోంది. మొత్తం 130 మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో మూడేళ్లపాటు 840 బార్ల లైసెన్సుల కేటాయింపునకు ఎక్సైజ్ శాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీచేసింది. వాటిలో 123 మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో బార్ల లైసెన్సుల కోసం 1,672 మంది ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. వారిలో 1,441 మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించారు. వారిలో 1,308 మంది చలానాలు తీసుకోగా బుధవారం నాటికి 834 మంది నాన్‌రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు చెల్లించారు. నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు చెల్లించేందుకు గురువారం సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది. చలానాలు తీసుకున్నప్పటికీ సాంకేతికపరమైన సందేహాలతో పలువురు వేచిచూసే ధోరణి అవలంబించారు. ఆ సందేహాలు కూడా తొలగిపోవడంతో నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజు చెల్లింపులు వేగం పుంజుకున్నాయి. గురువారం మరింతమంది దరఖాస్తు ఫీజు చెల్లిస్తారని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. అనంతరం బిడ్లు తెరిచి ఈ నెల 30, 31 తేదీల్లో ఈ–వేలం నిర్వహించి బార్ల లైసెన్సులను ఖరారు చేస్తారు. -
‘బార్ల లైసెన్సు’పై 20% కోవిడ్ ఫీజు
సాక్షి, అమరావతి: ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్స్ ఫీజుపై 20% కోవిడ్ ఫీజు విధిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఉన్న 840 బార్ల లైసెన్సులను వచ్చే ఏడాది జూన్ 30 వరకు కొనసాగిస్తూనే 2020–21 సంవత్సరానికి సంబంధించి కొత్త బార్ లైసెన్సు విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ► విదేశీ మద్యం, దేశంలో తయారయ్యే విదేశీ మద్యం, బీర్లు, రెడీ టు డ్రింక్, వైన్ అన్నింటిపైనా 10% అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధిస్తారు. ► హెకోర్టులో కొత్త బార్ పాలసీపై స్టే ఉన్నందున పాత బార్ పాలసీనే కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ► మార్చి 22 నుంచి ఇప్పటివరకు బార్లు మూసివేసి ఉన్నాయి. అయితే కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం శనివారం నుంచి వాటిని తెరిచేందుకు అవకాశం లభించింది. ► లాక్డౌన్ పీరియడ్‌లో రాష్ట్రంలో మూసి వేసిన బార్లకు సంబంధించి 101 రోజులకు లైసెన్సు ఫీజును ఈ సంవత్సరం ఫీజులో సర్దుబాటు చేస్తారు. -
బార్ల లైసెన్స్ దరఖాస్తుకు 9 వరకు గడువు
సాక్షి, అమరావతి: మద్యాన్ని ప్రజలకు దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. బార్ల లైసెన్సులకు దరఖాస్తులను ఆహ్వానించగా.. స్పందన లేకపోవడమే ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది. రాష్ట్రంలో 40 శాతం బార్ల సంఖ్యను తగ్గించి 487 బార్ల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తుల్ని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్లో దరఖాస్తుల స్వీకరణకు డిసెంబర్ 5వ తేదీ వరకు గడువు విధించారు. పెద్దగా స్పందన లేకపోవడంతో మళ్లీ ఒక రోజు గడువు పెంచి సవరణ నోటిఫికేషన్ జారీ చేశారు. శుక్రవారం రాత్రికి రాష్ట్ర వ్యాప్తంగా 301 దరఖాస్తులు అందాయి. రాష్ట్రంలో 105 మున్సిపాలిటీలు ఉండగా, అసలు 45 మున్సిపాలిటీల్లోని బార్లకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దీంతో ఎక్సైజ్ శాఖ రెండో సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. గడువును డిసెంబరు 9వ తేదీ వరకు పొడిగిస్తూ ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్ నోటిఫికేషన్ జారీ చేశారు. మద్యం విధానంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తూ దశల వారీగా మద్య నిషేధం వైపు అడుగులు వేయడం వల్లే దరఖాస్తులు రావడం లేదని ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
బార్ లైసెన్స్ గెజిట్ నోటిఫికేషన్ జారీ
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా బార్ లైసెన్సులకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం శుక్రవారం సచివాలయంలో జారీ చేసింది. ఈ మేరకు వచ్చే జనవరి 1నుంచి కొత్త బార్ పాలసీని అమలు చేయాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా కొత్త బార్ పాలసీ విధానం కింద రూ. 10 లక్షలు బార్ లైసెన్స్ దరఖాస్తు ఫీజుగా ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే జనవరి 1 నుంచి 2021 డిసెంబర్ 31 వరకు రెండేళ్ల పాటు లైసెన్సులు జారీ చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను యూనిట్లుగా నిర్థారించి ప్రభుత్వం బార్లను కేటాయించనుంది. నేటి నుంచి డిసెంబర్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొంది. కాగా, డిసెంబర్ 7న మధ్యాహ్నం 2 గంటలకు లాటరీ తీయనున్న కలెక్టర్లు అదేరోజు రాత్రి 7 గంటలకు బార్ల కేటాయింపుల జాబితాను విడుదల చేయనున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కొత్త బార్ల నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్, లైసెన్సు ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి 50 వేలు లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో బార్ల కు ఏడాదికి రూ. 25 లక్షలు 5 లక్షల లోపు జనాభా ఉన్న పట్టణాల్లో బార్ల కు రూ. 50 లక్షలు 5 లక్షల కంటే అధిక జనాభా ఉన్న ప్రాంతాల్లో బార్లకు రూ. 75 లక్షలు -
బార్ల లైసెన్సుల రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్సులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బార్లతోపాటు స్టార్ హోటళ్లు, మైక్రో బ్రూవరీల లైసెన్సులు కూడా రద్దు కానున్నాయి. దశల వారీ మద్యనిషేధం, నియంత్రణలో భాగంగా ప్రస్తుతం ఉన్న 797 బార్లలో 40 శాతం(319) మూసేయనున్నారు. మిగిలిన 60 శాతం (478 బార్లు)కు జనవరి 1 నుంచి కొత్తగా లైసెన్సులు జారీ చేయనున్నారు. అదేవిధంగా కొత్త బార్లకు లైసెన్సు ఫీజులను భారీగా పెంచింది. ఈ మేరకు బార్ల రద్దు, కొత్త బార్ల పాలసీకి సంబంధించి ప్రభుత్వం శుక్రవారం వేర్వేరుగా ఉత్తర్వులు ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి.. 2021 డిసెంబర్ 31 వరకు రెండేళ్లపాటు కొత్త బార్ల పాలసీ అమల్లో ఉంటుంది. దీని ప్రకారం.. బార్ లైసెన్స్ దరఖాస్తు ఫీజును రూ.10 లక్షలుగా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకున్నవారికి బార్ లైసెన్సు వచ్చినా, రాకున్నా ఈ రుసుం తిరిగి చెల్లించరు. బార్లలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే మద్యం సరఫరా చేస్తారు. ఆహార పదార్థాలను 11 గంటల వరకు అందిస్తారు. త్రీస్టార్,ఆపై స్థాయి హోటళ్లలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం అందుబాటులో ఉంటుంది. ఆహారాన్ని అర్ధరాత్రి 12 గంటల వరకు సర్వ్ చేస్తారు. లాటరీ విధానంలో బార్ల కేటాయింపు పేద, సామాన్య ప్రజానీకానికి మద్యాన్ని దూరం చేసేందుకు సెప్టెంబర్ 30న మద్యం బాటిళ్ల రేట్లను భారీగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినట్లే ఇప్పుడు బార్లలోనూ మద్యం ముట్టుకుంటే భారీ షాక్ కొట్టేలా అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ కింద ధరలను పెంచారు. ఈ నిర్ణయం శనివారం నుంచి అమల్లోకి వస్తుంది. జనవరి 1 నుంచి ఏర్పాటయ్యే బార్లను లాటరీ విధానంలో ఆయా జిల్లాల కలెక్టర్లు దరఖాస్తుదారులకు కేటాయిస్తారు. బార్ల లైసెన్సుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రూ.10 లక్షల చలానా, బార్ ఏర్పాటు చేసే ప్రదేశానికి చెందిన ప్లాన్, అద్దెకు తీసుకుంటే యజమాని నుంచి కన్సెంట్ లెటర్‌ను సమర్పించాలి. -
బార్ లైసెన్సుల అనుమతి పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న బార్‌షాపుల అనుమతులను మరో ఏడాదికి పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 10 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు 2బీ బార్ లైసెన్సులను రెన్యువల్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా వైన్‌షాపుల లైసెన్సుల కాలపరిమితి ఈనెల 30వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఈ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై ఎక్సైజ్‌శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం చర్చించినట్లు తెలిసింది. సోమవారం ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
సర్కారు ‘మందు’ చూపు!
అధికారం కోల్పోయినా మరో మూడేళ్లు బార్ల వ్యాపారం కొనసాగేలా వ్యూహం - ఏడాదికే పరిమితమైన లైసెన్స్‌ను ఐదేళ్లకు పెంచుతూ నిర్ణయం - ఈ లెక్కన బార్ లైసెన్సుల రెన్యూవల్‌కు ఓ మంత్రి భారీగా వసూళ్లు - రూ.332.8 కోట్లు దండుకోవడానికి మంత్రాంగం - కొత్తగా 85 బార్లకు అనుమతి.. జూలై 1 నుంచి నూతన బార్ల విధానం సాక్షి, అమరావతి: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం ఒకెత్తయితే బాబు సర్కారు ఇంకో అడుగు ముందుకేసి అధికారం పోయాక కూడా మద్యం వ్యాపారాల్లో మునిగితేలేలా నూతన బార్ల విధానం తీసుకు వచ్చింది. సాధారణంగా ఏడాదికోసారి బార్ల లైసెన్స్‌ల ను రెన్యువల్ చేస్తారు. ప్రస్తుతం ఇదే విధానం కొనసాగుతోంది. అయితే ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఐదేళ్ల పాటు బార్ల లైసెన్స్‌లను మంజూరు చేసేందుకు వీలుగా నూతన బార్ల విధానాన్ని తీసుకువచ్చింది. అంటే రెండేళ్ల తర్వాత అధికారం కోల్పోయినా సరే, మరో మూడేళ్ల పాటు బార్ల లైసెన్స్‌లు కొనసాగాల న్నదే వ్యూహం. గతంలో ఉన్న బార్ లైసెన్స్‌లు గత ప్రభుత్వానికి చెందిన వారివనే సాకుతో మొత్తం లైసెన్స్‌లను రద్దు చేస్తూ.. తమ వారికి ఇచ్చుకునేందుకు వీలుగా ఎవరు ముందు దరఖాస్తు చేస్తే వారికే లెసెన్స్లంటూ తీసు కొచ్చిన విధానాన్ని హైకోర్టు కొట్టివేసింది. దీం తో మద్యం వ్యాపారం లేదా వ్యాపారుల ద్వారా భారీగా దండుకోడానికి వ్యూహం రూ పొందించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్స్‌దారుల నుంచే భారీగా ముడుపులు పొందేందుకు వీలుగా నూతన బార్ల విధానాన్ని తెరపైకి తెచ్చింది. సాధారణంగా ఏడాది లేదా రెండేళ్లకు బార్ల లైసెన్స్‌లను మంజూరు చేయాలి. అలాంటిది ఐదేళ్లకు లైసెన్స్‌లను మంజూరు చేసే విధానం తీసుకువచ్చింది. రెండేళ్లకు లైసెన్స్ మంజూరు చేస్తే సరిపోతుందని అధికారులు ప్రతిపాదిం చినా వినకుండా, ప్రభుత్వపెద్దలు ఐదేళ్లకు లైసెన్స్ మంజూరు చేయాలని నిర్ణయం తీసు కున్నారు. ఈ మేరకు ఈ నెల 15న క్యాబినెట్ సమావేశంలో ఆమోదించారు. ఇందుకు అను గుణంగా ఒక మంత్రి ప్రస్తుత బార్ లైసెన్స్ దారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తు న్నారు. ఒక్కో బార్ లైసెన్స్‌దారు నుంచి రూ.40 లక్షల చొప్పున వసూళ్ల పర్వం ప్రారంభించారు. మధ్యవర్తిత్వం లేకుం డా నేరుగా తననే సంప్రదిం చాలనే సంకేతా లను ఆ మంత్రి పంపు తున్నారని ఎక్సైజ్ వర్గాలే పేర్కొంటున్నాయి. ఈ లెక్కన కొత్తగా మంజూరయ్యే బార్ల తో సహా సర్కారు పెద్దలు రూ.332.8 కోట్లు దండుకో నున్నారని స్పష్టమవుతోంది. ఐదేళ్లకు లైసెన్స్ మంజూరు చేస్తున్నందున వ్యాపారంలో స్థిరత్వం నెలకొంటుందని ప్రభు త్వం ఈ విధానాన్ని సమర్థించు కోజూస్తోంది. ప్రస్తుత బార్ లైసెన్స్దారులందరూ అర్హులే: ప్రస్తుత బార్ల లైసెన్స్‌ల కాల పరిమితి ఈ నెలాఖరుతో ముగియనుంది. వచ్చే నెల 1 నుంచి నూతన బార్ల లైసెన్స్ విధానం అమ ల్లోకి వస్తుంది. నిబంధనలకు అనుగుణంగా ఉన్న ప్రస్తుత బార్ లైసెన్సుదారులందరూ కొత్తగా లైసెన్స్ పొందేందుకు అర్హులేనని నూతన బార్ల విధానంలో పేర్కొన్నారు. ఒక బార్ లైసెన్స్ కోసం ఒకటికన్నా ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ విధానంలో లైసెన్స్ మంజూరు చేస్తారు. ఆన్లైన్లో బార్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మంచినీరు దొరక్కపోయినా బార్లు మాత్రం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం తీసు కొచ్చిన నూతన బార్ల విధానంపై ఎక్సైజ్ శాఖ వర్గాలే విస్తుపోతున్నాయి. మామూళ్ల కోసం ఇంత బరితెగింపా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 747 బార్లుండగా, కొత్తగా 85 బార్లకు లైసెన్స్‌లు మంజూరు చేయాలని నిర్ణయించింది. 30 వేల జనాభాకొక బార్ చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉండగా జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కనే బార్లు ఏర్పాటు చేయరాదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు రాష్ట్ర ప్రభుత్వం వక్రభాష్యం చెప్పింది. జాతీయ రహదారులకు 500 మీటర్లలోపు, రాష్ట్ర రహదారులకు 220 మీటర్లలోపు బార్లను అనుమతించరాదని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే సుప్రీం ఆదేశాలను పాటిస్తే బార్ల సంఖ్య సగం తగ్గిపోనున్న నేపథ్యంలో రాష్ట్ర రహదారులను జిల్లాల్లో జిల్లా ప్రధాన రహదారులగా పేరు మార్చుతూ బార్ల లైసెన్స్‌లను మంజూరు చేయాలని నిర్ణయించింది. లైసెన్సు ఫీజు తగ్గింపు స్థానంలో అదనపు ఎక్సైజ్ డ్యూటీ బార్ లైసెన్స్ ఫీజుపై సర్వీసు పన్ను చెల్లించాల్సి ఉన్నందున, ఆ పన్ను మొత్తం కేంద్రానికే వెళ్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్ ఫీజును తగ్గించింది. తద్వారా తగ్గిన ఆదాయాన్ని అదనపు ఎక్సైజ్ డ్యూటీ పేరుతో రాబట్టుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం 50 వేల జనాభా లోపు గల బార్ల లైసెన్స్ ఫీజు రూ.25 లక్షలుండగా రూ.15 లక్షలకు తగ్గించారు. 5 లక్షలలోపు జనాభా గల ప్రాంతాల్లో ప్రస్తుతం రూ.40 లక్షలుండగా రూ.30 లక్షలకు తగ్గించారు. 5 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుతం రూ.50 లక్షలుండగా రూ.40 లక్షలకు తగ్గించారు. -
హైవేలపై కొత్త బార్లకు నో
-
హైవేలపై కొత్త బార్లకు నో
హైవేలపై బార్ల కోసం వచ్చిన దరఖాస్తులు బుట్టదాఖలు 130 కొత్త బార్లకు గాను 57 లెసైన్సుల మంజూరు గ్రేటర్లో 44, జిల్లాల్లో 13 లెసైన్సులు జారీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రహదారి భద్రతపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలు మొదలైంది. జాతీయ, రాష్ట్ర రహదారులకు 100 మీటర్ల పరిధిలో కొత్తగా ఏర్పాటు చేయతలబెట్టిన బార్లకు ఎక్సైజ్ శాఖ అనుమతి నిరాకరించింది. రహదారులకు వంద మీటర్ల అవతల బార్ల ఏర్పాటు కోసం వచ్చిన 57 దరఖాస్తులకు మాత్రమే లెసైన్సులు జారీ చేసింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 44 కాగా, ఇతర జిల్లాల్లో 13 మాత్రమే ఉన్నాయి. గ్రేటర్ కాకుండా బార్లు ఏర్పాటు చేసే అవకాశం ఉన్న జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీల హెడ్ క్వార్టర్లన్నింటికి జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానం ఉండటంతో దరఖాస్తులన్నీ బుట్టదాఖలయ్యాయి. 130కిగాను 57 కొత్త బార్లకు మాత్రమే అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో మిగతా 73 బార్లకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. లెసైన్సులు పొందిన వారు ఫీజులు చెల్లించిన తరువాత కొత్త నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు. హైవేలపై ఉన్న 468 ఔట్లెట్లకు నోటీసులు జాతీయ, రాష్ట్ర రహదారులకు 100 మీటర్లలోపు మద్యం అమ్మకాలు నిషేధించాలని జస్టిస్ కె.ఎస్. రాధాకృష్ణన్ నేతృత్వంలోని రహదారి భద్రతా కమిటీ గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను పట్టించుకోకుండా ప్రభుత్వం అక్టోబర్‌లో కొత్తగా మద్యం దుకాణాలకు లెసైన్సులు జారీచేయడంతో పాటు బార్ల లెసైన్సులను రెన్యూవల్ చేసింది. దీంతో రాష్ట్రంలో 468 బార్లు, మద్యం దుకాణాలు హైవేలపైనే ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో నవంబర్‌లో రహదారుల భద్రతపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ డిసెంబర్ 31 నాటికి చర్యలు చేపట్టాలని ఆదేశించింది. దీంతో హైవేలపై ఉన్న గ్రేటర్‌లోని 170తో పాటు 468 మద్యం దుకాణాలు, బార్లకు నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో కొత్తగా 130 బార్ల లెసైన్సుల జారీ కోసం వచ్చిన 2,130 దరఖాస్తులను సమీక్షించింది. గ్రేటర్ హైదరాబాద్‌లో 60 బార్లు ఏర్పాటు కావాల్సి ఉండగా 44, ఇతర జిల్లాల్లో 70 బార్లకు అవకాశం ఉంటే కేవలం 13 దరఖాస్తులకే అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో ఎటు చూసినా హైవేలే! రాష్ట్రంలో 2,495.63 కి.మీ. మేర 13 జాతీయ రహదారులు ఉండగా, 2,023 కి.మీ మేర 17 రాష్ట్ర రహదారులు ఉన్నాయి. రాష్ట్రంలో 2,800కు పైగా మద్యం దుకాణాలు, బార్లు ఉండగా, వీటిలో 468 హైవేలపైనే ఉన్నాయి. సుప్రీం కమిటీ ఆదేశాల నేపథ్యంలో ఔట్లెట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే నోటీసులు అందుకున్న వ్యాపారులు ఏంచేయాలో తోచని స్థితిలో ఉన్నారు. జిల్లాల్లో మద్యం దుకాణం ఔట్లెట్ స్థలాన్ని ఆయా వార్డుల పరిధిలోని మరో చోటుకు మార్చుకునే అవకాశం ఉన్నప్పటికీ, గ్రేటర్‌లోని వ్యాపారులకు ఇబ్బందిగా మారింది. నగరంలో కొత్తగా దుకాణాలు, బార్లు ఏర్పాటు చేసుకునేందుకు స్థలాలు దొరికే అవకాశం లేనందున లక్షలాది రూపాయల లెసైన్సు ఫీజు చెల్లించి ఎక్కడకు పోవాలని 170 మంది మద్యం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.