హైవేలపై కొత్త బార్లకు నో
హైవేలపై బార్ల కోసం వచ్చిన దరఖాస్తులు బుట్టదాఖలు
130 కొత్త బార్లకు గాను 57 లెసైన్సుల మంజూరు
గ్రేటర్‌లో 44, జిల్లాల్లో 13 లెసైన్సులు జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రహదారి భద్రతపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలు మొదలైంది. జాతీయ, రాష్ట్ర రహదారులకు 100 మీటర్ల పరిధిలో కొత్తగా ఏర్పాటు చేయతలబెట్టిన బార్లకు ఎక్సైజ్ శాఖ అనుమతి నిరాకరించింది. రహదారులకు వంద మీటర్ల అవతల బార్ల ఏర్పాటు కోసం వచ్చిన 57 దరఖాస్తులకు మాత్రమే లెసైన్సులు జారీ చేసింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 44 కాగా, ఇతర జిల్లాల్లో 13 మాత్రమే ఉన్నాయి.
గ్రేటర్ కాకుండా బార్లు ఏర్పాటు చేసే అవకాశం ఉన్న జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీల హెడ్ క్వార్టర్లన్నింటికి జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానం ఉండటంతో దరఖాస్తులన్నీ బుట్టదాఖలయ్యాయి. 130కిగాను 57 కొత్త బార్లకు మాత్రమే అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో మిగతా 73 బార్లకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. లెసైన్సులు పొందిన వారు ఫీజులు చెల్లించిన తరువాత కొత్త నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు.
హైవేలపై ఉన్న 468 ఔట్‌లెట్లకు నోటీసులు
జాతీయ, రాష్ట్ర రహదారులకు 100 మీటర్లలోపు మద్యం అమ్మకాలు నిషేధించాలని జస్టిస్ కె.ఎస్. రాధాకృష్ణన్ నేతృత్వంలోని రహదారి భద్రతా కమిటీ గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను పట్టించుకోకుండా ప్రభుత్వం అక్టోబర్‌లో కొత్తగా మద్యం దుకాణాలకు లెసైన్సులు జారీచేయడంతో పాటు బార్ల లెసైన్సులను రెన్యూవల్ చేసింది. దీంతో రాష్ట్రంలో 468 బార్లు, మద్యం దుకాణాలు హైవేలపైనే ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో నవంబర్‌లో రహదారుల భద్రతపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ డిసెంబర్ 31 నాటికి చర్యలు చేపట్టాలని ఆదేశించింది. దీంతో హైవేలపై ఉన్న గ్రేటర్‌లోని 170తో పాటు 468 మద్యం దుకాణాలు, బార్లకు నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో కొత్తగా 130 బార్ల లెసైన్సుల జారీ కోసం వచ్చిన 2,130 దరఖాస్తులను సమీక్షించింది. గ్రేటర్ హైదరాబాద్‌లో 60 బార్లు ఏర్పాటు కావాల్సి ఉండగా 44, ఇతర జిల్లాల్లో 70 బార్లకు అవకాశం ఉంటే కేవలం 13 దరఖాస్తులకే అనుమతి ఇచ్చింది.
రాష్ట్రంలో ఎటు చూసినా హైవేలే!
రాష్ట్రంలో 2,495.63 కి.మీ. మేర 13 జాతీయ రహదారులు ఉండగా, 2,023 కి.మీ మేర 17 రాష్ట్ర రహదారులు ఉన్నాయి. రాష్ట్రంలో 2,800కు పైగా మద్యం దుకాణాలు, బార్లు ఉండగా, వీటిలో 468 హైవేలపైనే ఉన్నాయి. సుప్రీం కమిటీ ఆదేశాల నేపథ్యంలో ఔట్‌లెట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే నోటీసులు అందుకున్న వ్యాపారులు ఏంచేయాలో తోచని స్థితిలో ఉన్నారు.
జిల్లాల్లో మద్యం దుకాణం ఔట్‌లెట్ స్థలాన్ని ఆయా వార్డుల పరిధిలోని మరో చోటుకు మార్చుకునే అవకాశం ఉన్నప్పటికీ, గ్రేటర్‌లోని వ్యాపారులకు ఇబ్బందిగా మారింది. నగరంలో కొత్తగా దుకాణాలు, బార్లు ఏర్పాటు చేసుకునేందుకు స్థలాలు దొరికే అవకాశం లేనందున లక్షలాది రూపాయల లెసైన్సు ఫీజు చెల్లించి ఎక్కడకు పోవాలని 170 మంది మద్యం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.