సాక్షి, న్యూఢిల్లీ : కల్లుపై సుప్రీం కోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి. అదొక పోషక విలువలు కలిగిన విటమిన్ పానీయమంటూ కేరళ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు వినిపించింది.
సాధికారిక కమిటీ ఆదేశాలతో జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల లోపు మద్యం అమ్మకాలను నిషేధించాలంటూ గతంలో సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రభావంతో కేరళ వ్యాప్తంగా 520 కల్లు దుకాణాలు మూతపడగా.. 3వేల మందికి పైగా కల్లుగీత కార్మికులు రోడ్డున పడ్డారు. దీంతో కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై అఫిట్‌విట్ సమర్పించాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. దీనికి స్పందించిన కేరళ ప్రభుత్వం గురువారం అఫిడవిట్ దాఖలు చేసింది.
అఫిడవిట్‌లో అంశాలు.. ’’కేరళ ఔషద గుణాలున్న పానీయం. అంతేగానీ అది మద్యం కిందకు కాదు. కేరళ సాంప్రదాయక భోజనాల్లో కల్లుకు చాలా ప్రాముఖ్యత ఉంది. కల్లు ఓ యాంటి-బయోటిక్ అన్న విషయం శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. కేన్సర్ వ్యాధికి మూలమైన ఓబీఎస్-2(OBs-2) కణాలను నిర్మూలించే గుణం కల్లులోని చఖరోమైసెస్ అనే సూక్ష్మజీవికి ఉంటుంది. రక్త ప్రసరణ వ్యవస్థలో కూడా కల్లు కీలకపాత్ర వహిస్తుంది’’ అని పేర్కొంది.
కేరళలో కార్మికుల శాతం అధికమన్న ప్రభుత్వం.. వారికి కల్లు ద్వారానే ఆరోగ్యమని తెలిపింది. ఇక మద్యపాన నిషేధం విధించబడిన సమయంలో కూడా.. కల్లుపై నిషేధం విధించని విషయాన్ని అఫిడవిట్‌లో ప్రస్తావించింది. దీనిద్వారా హని జరుగుతుందన్న వాదనలో ఎలాంటి వాస్తవం లేదని.. అయితే కల్తీ కల్లు విషయంలోనే ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది అని కేరళ ప్రభుత్వం పేర్కొంది.
అయితే ‘కల్లు మద్యం కేటగిరీలోకి రాదని చెబుతున్నప్పుడు.. కేరళ అబ్కారీ యాక్ట్‌లో దానిని ఎందుకు పొందుపరిచారు’’ అంటూ... చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం కేరళ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇదే అంశంపై కేరళ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా పరిశీలనలు జరుపుతున్న విషయాన్ని కేరళ తరపు న్యాయవాది తెలపటంతో.. కోర్టు తదుపరి వాదనను ఫిబ్రవరి 16కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment