మా భూములు తీసుకోవద్దు
కొత్తూరు, న్యూస్‌లైన్: వంశధార ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్వాసితుల పునరావాస కాలనీకోసం తమ భూములు తీసుకోవద్దని మండలంలోని మెట్టూరుకు చెందిన గిరిజన, ఎస్పీలకు చెందిన రైతులు కోరారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో రైతులతో ఆర్డీవో తేజ్‌భరత్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. పునరావాస కాలనీ, రిజర్వాయర్, వరద కాలువల కోసం రైతుల నుంచి భూములను ప్రభుత్వం తీసుకుందని మెట్టూరు సర్పంచ్ బర్రి గోవిందరావు, రైతులు కె.సవరయ్య, టి.దురువు, సవరమ్మ తదితరులు తెలిపారు. తమ భూములను తీసుకోవడంతో కుటుంబాలతో వీధిన పడుతున్నామన్నారు.
తమ భూములు తీసుకుంటే ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేయలేని పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు తీసుకుంటే రైతులకు మరో చోట విలువైన ప్రభుత్వ భూములు ఇవ్వాలని రైతుల తరపున సర్పంచ్ గోవిందరావు కోరారు. తీసుకున్నభూములకు నాణ్యమైన పరిహారం చెల్లిస్తామని ఆర్డీవో తేజ్‌భరత్ తెలిపారు. తీసుకున్న భూములకు మార్కెట్ ధర చెల్లిస్తామన్నారు. భూములు తీసుకునేందుకు ఈనెల 23లోగా అంగీకారం తెలపాలని పేర్కొన్నారు. సమావేశం 23న నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్డీసీ సీతారాములు, తహశీల్దార్ శ్యామ్‌సుందరరావు, ఆర్ఐ భీమారావు, వీఆర్వో సంగమేశ్వరావు పాల్గొన్నారు.