ఆదుకోవాల్సిందే...మింగేసింది
బీహార్ : అత్యవసర సమయాల్లో ఆదుకొని ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్సే రాకాసిలా దూసుకొస్తే .... బీహార్లోని మంగర్ గ్రామంలో అదే జరిగింది. మృత్యుదేవతలా దూసుకొచ్చిన ఓ అంబులెన్స్ ఇద్దర్ని పొట్టన బెట్టుకుని మరో ఏడుగుర్ని తీవ్రంగా గాయపర్చి బీభత్సం సృష్టించింది. గురువారం జరిగిన ఈ ఘటనతో స్థానికంగా భయానక వాతావరణం నెలకొంది.
పోలీసుల సమాచారం ప్రకారం... భగల్ప పూర్ నుంచి వస్తున్న ఆంబులెన్స్ అదుపుతప్పి పక్కనే ఉన్న ఇంటిపైకి దూసుకెళ్లింది. గోడల్ని బద్దలు కొట్టుకుంటూ వేగంగా దూసుకువెళ్ళిన ఈ ప్రమాదంలో 22 సంవత్సరాల ఝునియా దేవితో పాటు అయిదేళ్ల పాప అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక సదర్ అసుపత్రికి తరలించామని ఎస్పీ బరున్ కుమార్ సిన్హా తెలిపారు. అంబులెన్స్ డ్రైవర్ పరారీలో ఉన్నాడని తెలిపారు.