చెలరేగిన సింహా
జింఖానా, న్యూస్‌లైన్: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (రామంతపూర్-హెచ్‌పీఎస్‘ఆర్’) బ్యాట్స్‌మన్ సింహా (106 నాటౌట్) సెంచరీతో కదంతొక్కి అజేయంగా నిలిచాడు. దీంతో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో భారతీయపై ఘనవిజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత భారతీయ జట్టు 244 పరుగులకే ఆలౌటైంది. ప్రజ్వల్ (71), అశోక్ (53 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించారు.
అనంతరం బరిలోకి దిగిన హెచ్‌పీఎస్ వికెట్ కోల్పోయి 245 పరుగులు చేసింది. అభిరథ్ రెడ్డి (86 నాటౌట్) అర్ధ సెంచరీతో అజేయంగా నిలవగా... షణ్ముఖ్ 45 పరుగులు చేసి చక్కటి ఆటతీరు కనబరిచాడు. మరో మ్యాచ్‌లో భరత్ సీసీ ఆటగాడు హర్షవర్ధన్‌రెడ్డి (బ్యాటింగ్ 88; బౌలింగ్ 5/30) ఆల్ రౌండ్ ప్రతిభతో జట్టు 48 పరుగుల తేడాతో గోల్కొండ సీసీపై నెగ్గింది. మొదట భరత్ సీసీ 4 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ధీరజ్ విశాల్ (85) అర్ధ సెంచరీతో చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన గోల్కొండ సీసీ 167 పరుగులకు కుప్పకూలింది.