battina harinathgoud
-
ఇబ్బందులు కలగకుండా చేప ప్రసాదం పంపిణీ
సాక్షి, హైదరాబాద్ : చేప మందు ప్రసాదం కోసం వచ్చే వారికి ఏలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దాదాపు 173 ఏళ్ల నుంచి వంశపారంపర్యంగా బత్తిని హరనాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. చేపమందు ప్రసాదం కోసం మన రాష్ట్రం నుంచే కాక ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి కూడా జనాలు వస్తారన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకునేలా సీఎస్‌తో చర్చింమన్నారు. చేపమందు ప్రసాదం కోసం వచ్చేవారికి జీహెచ్ఎంసీ అధ్వర్యంలో రూ.5కే భోజన సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. నగరం నలుమూలల నుంచి ఆర్టీసీ అధ్వర్యంలో రవాణా ఏర్పాట్లు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమానికి వచ్చే వారందరికి సరిపడా చేప పిల్లలను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఏర్పాట్లు భేష్ : బత్తిని ఎన్నడు లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేప మందు ప్రసాదం కార్యక్రమం కోసం అనేక ఏర్పాట్లు చేస్తోందన్నారు బత్తిని హరనాథ్ గౌడ్. 8వ తేదీ సాయంత్రం మొదలై 9వ తేదీ రాత్రి వరకూ చేప ప్రసాదం అందజేస్తామన్నారు. ఒక వేళ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దొరక్కపోతే.. తమ నివాస గృహాల్లో.. వారి కుటుంబ సభ్యులు కూడా ప్రసాదం అందజేస్తారని తెలిపారు. చేప ప్రసాదం కోసం గత ఏడాది లానే ఈ సంవత్సరం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి తలసాని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రజలందరికి సరిపోయే విధంగా చేప ప్రసాదం తయారు చేస్తామన్నారు. -
జూన్ 8,9 తేదీల్లో చేపమందు పంపిణీ
సాక్షి, హైదరాబాద్: మృగశిర కార్తె సందర్భంగా వచ్చే నెల 8, 9వ తేదీల్లో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప మందు పంపిణీ చేయనున్నట్టు బత్తిని హరినాథ్ గౌడ్ తెలిపారు. వంశపారంపర్యంగా వస్తున్న చేప ప్రసాదం పంపిణీని నిస్వార్థంగా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా కొనసాగిస్తున్నట్టు ఆయన చెప్పారు. చేపప్రసాదం తీసుకున్న తర్వాత 40 రోజుల పాటు కొన్ని ఆహార నియమాలు పాటిస్తే ఉబ్బసం, శ్వాస సంబంధిత రోగాల నుంచి ఉపశమనం కలుగుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూల నుంచి భారీగా ప్రజలు తరలివస్తారని.. జీహెచ్ఎంసీ, జలమండలి, ఆర్టీసీ, రెవెన్యూ, పోలీసు అధికారులు సహకరించి తగిన ఏర్పాట్లు చేస్తున్నారని హరినాథ్ గౌడ్ వివరించారు. స్వచ్ఛందంగా సేవలందిస్తున్న పన్నిలాల్ పిట్టి ట్రస్ట్, అగర్వాల్ సేవా దళ్, గౌడ వసతి గృహం వలంటీర్లకు హరినాథ్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. -
జూన్ 8 నుంచి చేపమందు పంపిణీ
హైదరాబాద్: మృగశిరకార్తె సందర్భంగా ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు ప్రతియేడు అందచేసే చేప మందు ప్రసాదం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జూన్ 8వ తేదీన రాత్రి 11:45 గంటలకు ప్రారంభించి 9వ తేదీ రాత్రి వరకు కొనసాగించనున్నట్లు బత్తిన హరినాథ్ గౌడ్ తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నాలుగు తరాలుగా ఈ ప్రసాదాన్ని తాము ఉచితంగా ప్రజలకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. గతేడాది సుమారు 4.5 లక్షల మంది ప్రసాదం తీసుకున్నట్లు వెల్లడించారు. చేప మందు తీసుకునేవారు 3 గంటల ముందు, వేసుకున్న తర్వాత గంటన్నర వరకు ఏలాంటి ఆహారం తీసుకోరాదన్నారు.ప్రసాదం తీసుకున్నవారు 45 రోజుల వరకు పత్యం పాటించాలన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రసాదం తీసుకోలేక పోయినవారు దూద్‌బౌలిలోని తమ నివాసంలో తీసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో బత్తిని శివానంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.