చట్టాల గురించి తెలుసుకోండి
పౌరకార్మికులకు హైకోర్టు న్యాయమూర్తి ఎన్.కె.పాటిల్ సూచన
బెంగళూరు(బనశంకరి):చట్టాల గురించి తెలుసుకుంటే జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని పౌరకార్మికులకు హైకోర్టు న్యాయమూర్తి ఎన్.కె.పాటిల్ సూచించా రు. బీబీఎంపీ కార్యాలయంలో పౌర కార్మికులకు శని వారం ఏర్పాటు చేసిన చట్టాలపై అవగాహన శిబిరంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల లబ్ధి పొందాలంటే వాటిపై సంపూర్ణంగా అవగాహన ఉండాలని, ఇది చట్టాల గురించి తెలుసుకున్నప్పుడే సాధ్యమవుతుందని అన్నారు. పౌరకార్మికులకు సకాలంలో వేతనాలను కాంట్రాక్టర్లు అందించడం లేదని అన్నారు. ఫలితంగా వారి పరిస్థితి మరింత దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పౌరకార్మికుల వేతనాలనున సకాలంలో అందించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. మ్యాన్హోల్లను శుభ్రం చేయడానికి యంత్రాలు వచ్చినా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో సఫాయి కార్మికులతోనే పనులు చేయిస్తున్నారని, ఫలితంగా వారు రోగాల బారిన పడుతుండడంతో వారి కుటుంబంపై ఆ ప్రభావం తీవ్రంగా చూపుతోందని ఆందోళన వ్యక్తతం చేశారు. ఈ దయనీయ పరిస్థితిని అధిగమించేందుకు శాస్త్రీయ పద్ధతులను అవలంభించాలని అన్నారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయరాదన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వైద్య చికిత్సలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రి రామలింగారెడ్డి, బీబీఎంపీ మేయర్ శాంతకుమారి, డిప్యూటీ మేయర్ రంగణ్ణ, పాలికె కమిషనర్ లక్ష్మినారాయణ పాల్గొన్నారు.