beauti parlaour
-
కొంపముంచిన బ్యూటీషియన్.. అందం కోసం వెళ్తే మొదటికే మోసం
హైదరాబాద్: కొందరు బ్యూటీపార్లర్ల అవగాహనా లోపం, అనధికారిక లేపనాల వినియోగం నగర వాసులను తీవ్ర సమస్యల్లోకి నెట్టేస్తోంది. కొందరికి ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుండగా అందంగా మారాలని కోరుకుంటున్న మరికొందరిని అనాకారిగా మార్చేస్తోంది. నగరంలోని అబిడ్స్ ప్రాంతంలో గురువారం ఓ పార్లర్ నిర్వాకం దీనికి అద్దం పట్టింది. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా అయింది ఆ మహిళ పరిస్థితి. తన భర్త కోరిక మేరకు మరింత అందంగా, మోడల్లా మారాలని బ్యూటీపార్లర్‌కు వెళ్లిన ఆమె ఉన్న జుట్టునూ సైతం పోగొట్టుకుని పోలీస్న్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె జుట్టుకు బ్యుటిషియన్ ఏదో ఆయిల్ అప్లై చేసింది. అనంతరం హెయిర్ కట్ చేయడం ప్రారంభించగా.. జుట్టు దానంతట అదే విపరీతంగా ఊడిపోవడం ప్రారంభమైంది. తలపై ఉన్న జుట్టు రాలిపోతుండడంతో ఆ మహిళ తీవ్రమైన షాక్‌కు గురైంది. అనధికారిక ఉత్పత్తులు.. అవగాహన లేని సిబ్బంది.. ► నగరంలోని పలు పార్లర్లలో సరైన శిక్షణ లేని సిబ్బందిని నియమించుకుంటున్నారు. దీనిపై ఎటువంటి నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడంతో పార్లర్ల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. లాభాల కోసం ఊరూ పేరూ లేని బ్రాండ్లకు చెందిన ఆయిల్స్, క్రీమ్స్, పౌడర్స్ వీరు వినియోగిస్తున్నారు. గత కొంత కాలంగా అనేక మంది పార్లర్ల ద్వారా వీటి వల్ల కష్టనష్టాలు చవిచూసినప్పటికీ వెలుగు చూస్తున్నవి చాలా తక్కువే. ► గతంలో ఒక పార్లర్లో హెడ్ వాష్ చేయించుకున్న ఓ మహిళ ఏకంగా స్ట్రోక్‌కి గురవ్వడం దీనికి కారణం అక్కడి సిబ్బంది ఆ మహిళ మెడ నరాన్ని నిర్లక్ష్యంగా వత్తడమేనని కూడా వెల్లడైంది. అదే విధంగా పలువురికి ముఖ వర్ఛస్సు మారిపోవడం, దద్దుర్లు, రాషెస్, అలర్జీలు రావడం సాధారణంగా మారింది. వారిలో అత్యధికులు తమలో తాము కుమిలిపోవడం తప్ప పెద్దగా బయటకు రావడం, ఘర్షణకు దిగడం లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు వెలుగు చూడడం లేదు. ఇది పార్లర్ల నిర్వాహకులకు మరింత ఊతంగా మారింది. బ్యూటీపార్లర్‌పై కేసు నమోదు.. హెయిర్ కట్టింగ్ కోసం వెళ్లిన ఓ మహిళ జుట్టు బ్యూటీషియన్ నిర్వాకంతో ఊడిపోయిన ఘటన గురువారం అబిడ్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. అబిడ్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చార్మినార్‌కు చెందిన సీజ్ (35) హెయిర్ కటింగ్ కోసం అబిడ్స్‌లోని న్యూక్వీన్ బ్యూటీపార్లర్‌కు వెళ్లింది. బ్యూటీషియన్ ఆయిల్‌ను ఆమె తలకు వాడటంతో జుట్టు పూర్తిగా రాలిపోయింది.. దీంతో పార్లర్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు సీజ్ మాట్లాడుతూ.. పార్లర్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే తన జట్టు ఊడిపోయిందని ఆరోపించారు. సదరు పార్లర్‌ను సీజ్ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జాగ్రత్తలు అవసరం.. హెయిర్ ఫాల్‌కి రీజన్ కనుక్కొవాలి. నూనెలవీ ఏది పడితే అది వాడకూడదు. లైసెన్స్ ఉందా లేదా? క్వాలిటీ కంట్రోల్ ఉందా లేదా ఫ్లేవర్ ఒకటి మాత్రమే యాడ్ చేస్తున్నారా లేదా? నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా? పార్లర్లోని సిబ్బంది క్వాలిఫైడ్ అవునా కాదా? అని చూడాలి. పార్లర్స్ వాళ్లు వాడే ఆయిల్స్ సరైనవి వాడుతున్నారా లేదా అని తనిఖీ చేసుకోవాలి. ఆయిల్స్ ఏవీ కూడా మన వాతావరణం రీత్యా అవసరం లేదు. ఆయిల్ మసాజ్ వల్ల కొంత లాభం ఉండొచ్చు తప్ప ఇతరత్రా జుట్టుకు ఆయిల్‌తో పనేమీ లేదు. అంతేకాకుండా కొన్ని లేపనాలు కొందరి చర్మానికి నప్పనివి ఉంటాయి. వాటిలోని కెమికల్స్ వల్ల తీవ్రమైన వ్యతిరేక రియాక్షన్స్ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. – డాక్టర్ పద్మావతి, డెర్మటాలజిస్ట్ -
తాలిబాన్ దురాగతాలు: బ్యూటీ పార్లర్లు ఫినిష్.. ఇప్పుడు వాయిద్య పరికరాల వంతు!
అఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్ ఆంక్షలు, దురాగతాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా తాలిబన్ ప్రభుత్వ అధికారులు సంగీతం అనైతికమైనదని తీర్మానిస్తూ ప్రజల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న సంగీత పరికరాలను హెరాత్ ప్రాంతంలో దహనం చేశారు. ఈ సందర్భంగా స్థానిక అధికారి అల్-ముజ్రిమ్ మాట్లాడుతూ సంగీతాన్ని ప్రోత్సహించడం అనేది నైతిక విలువలను దెబ్బతీస్తుందని, సంగీతాన్ని వాయించేవారు తప్పుదారి పడతారని వ్యాఖ్యానించారు. 2021 ఆగస్టులో అఫ్ఘానిస్తాన్‌ను కబ్జా చేసుకున్న తాలిబాన్ నేతలు ఇష్టమొచ్చిన రీతిన కఠిన శాసనాలను, చట్టాలను చేస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా బహిరంగంగా సంగీతం ఆలపించడంపై నిషేధం విధించారు. దీనికి ముందు బ్యూటీ పార్లర్లపై నిషేధం విధించారు. తాజాగా వేల డాలర్ల విలువైన వాయిద్య పరికరాలను స్థానిక ప్రజల నుంచి స్వాధీనం చేసుకుని వాటిని దహనం చేశారు. వీటిలో గిటార్, తబలా, డ్రమ్ తదితర వాయిద్య పరికరాలతో పాటు ఆంప్లిఫయర్, స్పీకర్ మొదలైనవి కూడా ఉన్నాయి. ఇది కూడా చదవండి: రణభూమిలో యోగ సాధన: సిరియా ముఖచిత్రాన్ని మారుస్తున్న రిషికేశ్ "Music causes moral corruption and playing it will cause the youth to go astray." Afghanistan's vice ministry burns musical instruments and equipment, deeming music immoralhttps://t.co/as5hDUQ7BX pic.twitter.com/eh9xSgWhkU — AFP News Agency (@AFP) July 31, 2023 -
బ్యూటీపార్లర్ కోర్సుతో ఉపాధి
నిజామాబాద్: బ్యూటీపార్లర్ కోర్సుకు మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉందని, కోర్సు పూర్తి చేసిన తర్వాత స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుందని ఎస్బీఐ సీనియర్ మేనేజర్ శాంసన్ అన్నారు. ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ (ఆర్ఎస్ఈటీఐ) అధ్వర్యంలో బ్యూటీపార్లర్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. వాటి నిర్వహణ ద్వారా పలువురు ఆర్థికంగా స్థిరపడ్డారని సంస్థ డైరక్టర్ సుంకం శ్రీనివాస్ తెలిపారు. శిక్షణ అనంతరం బ్యాంక్‌ల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. అనంతరం చీఫ్ మేనే జర్ను సన్మానించారు. ఫ్యాకల్టీ రామకృష్ణ, నవీన్, రంజిత్, భాగ్యలక్ష్మీ, ప్రణీత పాల్గొన్నారు. -
ఇల్లు ఖాళీ చేయమన్నందుకు... అసభ్యంగా ప్రవర్తించాడంటూ..
సాక్షి, వరంగల్: న్యాయం చేయాల్సిన పోలీసులే అన్యాయంగా అట్రాసిటీ కేసు నమోదు చేశారని బాధిత కుటుంబసభ్యులు సోమవారం ఆరోపించారు. బాధితుల కథనం ప్రకారం.. కాశిబుగ్గ తిలక్‌రోడ్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న మహిళ ఏడు నెలల క్రితం తమ ఇంట్లో అద్దెకు తీసుకుందని, సదరు మహిళకు తమకు బేదాభిప్రాయాలు రావడంతో ఇళ్లు ఖాళీ చేయాలని చెప్పారు. ఖాళీ చేయక తమను దూషిందని, దీంతో పాటు సదరు మహిళ స్థానిక నేతల సహకారంతో పోలీస్‌స్టేషన్‌లో ఇంటి యజమాని కుమారుడు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు మహిళ ఆరోపించిన విషయంలో వాస్తవం లేదని గుర్తించి సదరు మహిళను మందలించి వదిలేశారు. ఇదిలా ఉండగా మరుసటి రోజు సీఐ బదిలీపై వెళ్లడంతో విషయం మళ్లీ మొదటికి వచ్చింది.‘ఓసిటీ మైదానంలో పంచాయితీ నిర్వహిస్తున్నాం.. హాజరు కావాలి’ అంటూ సమాచారం పంపడంతో ఖంగుతి న్న బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. మా మాటలు లెక్కచేయకుండా పీఎస్‌కు పోతావా? అంటూ ఏకంగా పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే దాడికి దిగినట్లు తెలిసింది. సదరు మహిళకు మద్దతుగా వ్యవహరిస్తున్న అధికార పార్టీకి చెందిన ఓ నేత ఎస్సై ఆధ్వర్యంలో కొత్తగా బాధ్యతలు తీసుకున్న సీఐని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి మళ్లీ కేసు విషయంలో మంతనాలు జరిపినట్లు సమాచారం. గత సీఐ జరిపిన విచారణను పరిగణలోకి తీసుకోకుండానే కుటుంబంలోని ఆరుగురిపై అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో బాధిత కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని పలువురు కోరుకుంటున్నారు. ఈ విషయంపై ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ మల్లేష్‌ను వివరణ కోరగా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసు ప్రస్తుతం ఏసీపీ విచారణలో ఉన్నట్లు తెలిసింది. -
దరఖాస్తుల ఆహ్వానం
ఆసిఫాబాద్‌అర్బన్: ‘బ్యూటీ పార్లర్స్’ ఏర్పాటు చేసుకోవడానికి అర్హత గల గిరిజన మహిళలు ఈ నెల 27లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ ఆర్థిక సహకారం కింద జిల్లాలో మొత్తం 10 బ్యూటీ పార్లర్స్ మంజూరైనట్లు తెలిపారు. 10వ తరగతి పాస్, లేదా ఫెయిల్, 21 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు, వార్షిక ఆదాయం ఏజెన్సీలో రూ.1.50లక్షలు మైదాన ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించరాదన్నారు. బ్యూటీషియన్, ఆరోగ్య పరిరక్షణలో శిక్షితులైన అభ్యర్థులై ఉండాలని తెలిపారు. ఇందుకుగాను ఒక్కొక్క యూనిట్ అంచనా రూ.2 లక్షలు కాగా ఇందులో 70 శాతం సబ్సిడీ ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. మిగతా నిధులు జాతీయ బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించన్నుట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఎంపిక ప్రక్రియ 31లోపు పూర్తి చేసి అర్హత గల గిరిజన మహిళలకు అర్థిక సహాయంతోపాటు, స్వయం ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల గిరిజన మహిళలు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో పని వేళల్లో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
మేకప్ చేయాలని.. మత్తు మందు చల్లి..
-
వధువుకు మేకప్ చేయాలని.. మత్తు మందు చల్లి..
సాక్షి, హైదరాబాద్ : పెళ్లి కూతురుకి మేకప్ చేయాలంటూ మాయ మాటలు చెప్పి మత్తు మందు చల్లి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లింది ఓ కిలాడీ లేడీ. ఈ ఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఆర్ నగర్‌లోని సోనాబాయి టెంపుల్ ఎదురుగా ఉన్న స్మార్ట్ బ్యూటీ పార్లల్ యజమానురాలు పెళ్లి కుమార్తెకు మేకప్ చేయాలని మాయ మాటలు చెప్పింది. దీనికి వధువు అంగీకరించడంతో ఆమెపై మత్తు మందు చల్లి మూడు తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లింది. ఈ ఘటన జరిగి మూడు రోజులైనా కేసు నమోదు చేయడంలో పోలీసులు తాత్సారం చేస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. -
ఇంటి వద్దే బ్యూటీఫుల్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలోనే మొబైల్ బ్యూటీపార్లర్లు అందుబాటులోకి రానున్నాయి. పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా సెమీ అర్బన్, జిల్లా కేంద్రాలు, వాటికి సమీప ప్రాంతాల్లో ఇళ్ల వద్దే సౌందర్య సేవలు లభించనున్నాయి. యువతులకు ఉపాధి కల్పించేలా అధికారులు ప్రణాళిక రచిస్తున్నారు. ఇటీవలి కాలంలో అందంపై అతివల అభిరుచి పెరగిన నేపథ్యంలో.. ఇటువంటి సేవలు కోరుకునే మహిళల ఇళ్ల వద్దకే వెళ్లి బ్యూటీపార్లర్లలో లభించే సేవలను అందుబాటులోకి తేవాలని బీసీ సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. బీసీ వర్గాలకు చెందిన యువతులకు దీనిని ఒక ఉపాధి అవకాశంగా మలచాలని బీసీ సంక్షేమశాఖ నడుం బిగించింది. దాదాపు వెయ్యి మంది యువతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి బ్యూటీషియన్ కోర్సు లో శిక్షణ ఇవ్వనుంది. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి స్కూటర్ లేదా మోపెడ్, మొబైల్ బ్యూటీ కిట్, యాప్రాన్, ఫోన్‌ను ఉచితంగా అందించనుంది. అతివలు ఇళ్ల వద్దే ఈ సేవలు వినియోగించుకునేందుకు వీలుగా మొబైల్ యాప్‌ను రూపొందించనుంది. వచ్చే నెల నుంచే దీనిని ప్రారంభించేం దుకు సన్నాహాలు చే స్తున్నారు. బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. బీసీ సంక్షేమశాఖ ఇన్చార్జి ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ పథకానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. సంచారజాతులకు ఫెడరేషన్.. సంచారజాతుల వారికోసం ప్రభుత్వం విడిగా ఫెడరేషన్ ఏర్పాటు చేయనుంది. రానున్న బడ్జెట్లో (2016-17) నిధులు కేటాయించనుంది. జిల్లాలవారీగా సంచారజాతుల వారిని గుర్తించి, స్వయం ఉపాధి, నైపుణ్యాల మెరుగుదలకు తోడ్పాటు అందించనుంది. జిల్లా కేంద్రాలకు దగ్గరలో వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వడంతోపాటు ఇతర పథకాలను వారికి చేరువ చేయాలనే అభిప్రాయంతో బీసీ సంక్షేమశాఖ ఉంది.