కొంపముంచిన బ్యూటీషియన్‌.. అందం కోసం వెళ్తే మొదటికే మోసం | - | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో బ్యూటీషియన్‌ నిర్వాకం.. అందం కోసం వెళ్తే మొదటికే మోసం, జర జాగ్రత్త! ఆ క్రీమ్స్‌ నకిలీవైతే!

Published Fri, Aug 4 2023 6:26 AM | Last Updated on Fri, Aug 4 2023 11:00 AM

- - Sakshi

హైదరాబాద్‌: కొందరు బ్యూటీపార్లర్ల అవగాహనా లోపం, అనధికారిక లేపనాల వినియోగం నగర వాసులను తీవ్ర సమస్యల్లోకి నెట్టేస్తోంది. కొందరికి ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుండగా అందంగా మారాలని కోరుకుంటున్న మరికొందరిని అనాకారిగా మార్చేస్తోంది.

నగరంలోని అబిడ్స్‌ ప్రాంతంలో గురువారం ఓ పార్లర్‌ నిర్వాకం దీనికి అద్దం పట్టింది. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా అయింది ఆ మహిళ పరిస్థితి. తన భర్త కోరిక మేరకు మరింత అందంగా, మోడల్‌లా మారాలని బ్యూటీపార్లర్‌కు వెళ్లిన ఆమె ఉన్న జుట్టునూ సైతం పోగొట్టుకుని పోలీస్‌న్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఆమె జుట్టుకు బ్యుటిషియన్‌ ఏదో ఆయిల్‌ అప్‌లై చేసింది. అనంతరం హెయిర్‌ కట్‌ చేయడం ప్రారంభించగా.. జుట్టు దానంతట అదే విపరీతంగా ఊడిపోవడం ప్రారంభమైంది. తలపై ఉన్న జుట్టు రాలిపోతుండడంతో ఆ మహిళ తీవ్రమైన షాక్‌కు గురైంది.

అనధికారిక ఉత్పత్తులు.. అవగాహన లేని సిబ్బంది..
► నగరంలోని పలు పార్లర్లలో సరైన శిక్షణ లేని సిబ్బందిని నియమించుకుంటున్నారు. దీనిపై ఎటువంటి నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడంతో పార్లర్ల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.

లాభాల కోసం ఊరూ పేరూ లేని బ్రాండ్లకు చెందిన ఆయిల్స్‌, క్రీమ్స్‌, పౌడర్స్‌ వీరు వినియోగిస్తున్నారు. గత కొంత కాలంగా అనేక మంది పార్లర్ల ద్వారా వీటి వల్ల కష్టనష్టాలు చవిచూసినప్పటికీ వెలుగు చూస్తున్నవి చాలా తక్కువే.

► గతంలో ఒక పార్లర్‌లో హెడ్‌ వాష్‌ చేయించుకున్న ఓ మహిళ ఏకంగా స్ట్రోక్‌కి గురవ్వడం దీనికి కారణం అక్కడి సిబ్బంది ఆ మహిళ మెడ నరాన్ని నిర్లక్ష్యంగా వత్తడమేనని కూడా వెల్లడైంది. అదే విధంగా పలువురికి ముఖ వర్ఛస్సు మారిపోవడం, దద్దుర్లు, రాషెస్‌, అలర్జీలు రావడం సాధారణంగా మారింది.

వారిలో అత్యధికులు తమలో తాము కుమిలిపోవడం తప్ప పెద్దగా బయటకు రావడం, ఘర్షణకు దిగడం లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు వెలుగు చూడడం లేదు. ఇది పార్లర్ల నిర్వాహకులకు మరింత ఊతంగా మారింది.

బ్యూటీపార్లర్‌పై కేసు నమోదు..
హెయిర్‌ కట్టింగ్‌ కోసం వెళ్లిన ఓ మహిళ జుట్టు బ్యూటీషియన్‌ నిర్వాకంతో ఊడిపోయిన ఘటన గురువారం అబిడ్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. అబిడ్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చార్మినార్‌కు చెందిన సీజ్‌ (35) హెయిర్‌ కటింగ్‌ కోసం అబిడ్స్‌లోని న్యూక్వీన్‌ బ్యూటీపార్లర్‌కు వెళ్లింది.

బ్యూటీషియన్‌ ఆయిల్‌ను ఆమె తలకు వాడటంతో జుట్టు పూర్తిగా రాలిపోయింది.. దీంతో పార్లర్‌ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు సీజ్‌ మాట్లాడుతూ.. పార్లర్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే తన జట్టు ఊడిపోయిందని ఆరోపించారు. సదరు పార్లర్‌ను సీజ్‌ చేసి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

జాగ్రత్తలు అవసరం..
హెయిర్‌ ఫాల్‌కి రీజన్‌ కనుక్కొవాలి. నూనెలవీ ఏది పడితే అది వాడకూడదు. లైసెన్స్‌ ఉందా లేదా? క్వాలిటీ కంట్రోల్‌ ఉందా లేదా ఫ్లేవర్‌ ఒకటి మాత్రమే యాడ్‌ చేస్తున్నారా లేదా? నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా? పార్లర్‌లోని సిబ్బంది క్వాలిఫైడ్‌ అవునా కాదా? అని చూడాలి. పార్లర్స్‌ వాళ్లు వాడే ఆయిల్స్‌ సరైనవి వాడుతున్నారా లేదా అని తనిఖీ చేసుకోవాలి.

ఆయిల్స్‌ ఏవీ కూడా మన వాతావరణం రీత్యా అవసరం లేదు. ఆయిల్‌ మసాజ్‌ వల్ల కొంత లాభం ఉండొచ్చు తప్ప ఇతరత్రా జుట్టుకు ఆయిల్‌తో పనేమీ లేదు. అంతేకాకుండా కొన్ని లేపనాలు కొందరి చర్మానికి నప్పనివి ఉంటాయి. వాటిలోని కెమికల్స్‌ వల్ల తీవ్రమైన వ్యతిరేక రియాక్షన్స్‌ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
– డాక్టర్‌ పద్మావతి, డెర్మటాలజిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement