కొత్త కానుక
చాలామంది... ఇంటిముందు అందమైన గార్డెన్ ఏర్పాటుచేసుకుని, అందులో కుర్చీ వేసుకుని పేపర్ చదువుతూ ఆనందించాలని కలలు కంటారు. పెరుగుతున్న అపార్ట్మెంట్ కల్చర్ వల్ల మొక్కలను ఆరుబయట పెంచుకోవాలనే అవకాశాలు తగ్గిపోతున్నాయి. అందుకే చాలామంది ఇండోర్ ప్లాంట్స్‌ని పెంచడానికి ఆసక్తి చూపుతున్నారు. అటువంటివారు మీ స్నేహితులు, బంధువులలో ఎవరైనా ఉంటే, ఈ నూతన సంవత్సరం సందర్భంగా వారికి ఒక ఇండోర్ ప్లాంట్‌ని కానుకగా ఇవ్వండి. ఇచ్చి ఊరుకోకండి... ఈ కాగితాన్ని కూడా అందచేయండి. మిమ్మల్ని వారు ఎన్నటికీ మరచిపోరు.
ఇండోర్ ప్లాంట్స్ అందంగా ఉండటమే కాకుండా, తాజా ఆక్సిజన్‌ను సరఫరా చేస్తా యి. అందువల్ల ఇంట్లోని గాలి ఎప్పటికప్పుడు శుభ్రపడుతూ, ఇంటికి తాజాదనాన్ని తీసుకువస్తుంది. ఉద్యోగరీత్యా కాని, ఇంట్లో కాని చాలాసేపు పనిచేసిన తర్వాత, మొక్కల దగ్గర కూర్చుంటే చాలు అంత ఒత్తిడి తొలగిపోతుంద ని పరిశోధనలు తెలియచేస్తున్నాయి.
ఏ మొక్కయినా పచ్చగా కళకళలాడుతుంటేనే అందంగా ఉంటుంది. ఇంకా... బలంగా, ఏపుగా కూడా ఉండాలి. అందుకు తగినంత నీరు, సూర్యరశ్మి, అనుకూల వాతావరణం, పరిసరాలు తప్పనిసరి. అయితే అన్నిరకాల మొక్కలకూ ఒకే సూత్రం వర్తించదు. కొన్ని మొక్కలకు ఎక్కువ ఎండ అవసరమైతే, మరికొన్ని మొక్కలకు తక్కువ ఎండ సరిపోతుంది.
నర్సరీలో మొక్క కొనేటప్పుడు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో నర్సరీ వ్యక్తిని అడిగి, ఆ ప్రకారంగానే మొక్కలను పెంచాలి. ఇండోర్‌ప్లాంట్స్ విషయంలో అందరూ చేసే ఒక తప్పు... నీటిని ఎక్కువగా, వేగంగా పోసేయడం. అలా చేయకూడదు. నీటిని నెమ్మదిగా పోయాలి. అలాగే ఎక్కువైన నీరు కుండీలో నుంచి సులువుగా బయటకు వెళ్లే మార్గం ఏర్పాటుచేయాలి. నీరు నిల్వ ఉండిపోతే వేళ్లు కుళ్లిపోతాయి. ఇంకా... చిన్నచిన్న కీటకాలు, బ్యాక్టీరియా వంటివి చేరతాయి. దోమలు గుడ్లు పెట్టి, ఇల్లంతా దోమలు వ్యాపించే అవకాశం ఉంటుంది.
మొక్కలు చాలా సున్నితమైనవి. వాటిని ఒక్కసారిగా చీకటి నుంచి వెలుగులోకి, తక్కువ ఉష్ణోగ్రత నుంచి అధిక ఉష్ణోగ్రత ఉన్నచోటికి మార్చడం వలన లాభం కంటె నష్టాలే ఎక్కువ. వాటి పెరుగుదలకు సంగీతం ఎంతగానో ఉపయోగపడుతుంది. పెద్దపెద్ద శబ్దాల సంగీతం కంటె, మృదువుగా ఉండే సంగీతం వల్ల మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయని పరిశోధనలలో తేలింది. మొక్కలకు నీరు ఎక్కువైనా తక్కువైనా కూడా ఎదుగుదల సరిగా ఉండదు. నీరు ఎక్కువైతే గాలి సరిగా అందక మొక్కలు ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయలేకపోతాయి.
మరిన్ని వివరాల కోసం మైడెకొరేటివ్.కామ్ (mydrcorative.com) ను చూడవచ్చు.