Beedi pension
-
అనర్హులకు ‘బీడీ పింఛన్’
వేములవాడరూరల్: తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ప్రభుత్వాన్ని, అధికారులను మోసం చేసి లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్మును పింఛన్ రూపంలో కాజేస్తున్నవారి గుట్టు రట్టయింది. ఎలాంటి అర్హతలు లేకుండా బీడీ కంపెనీ యజమానుల నుంచి ధ్రువీకరణ పత్రాలు పొంది మధ్య దళారులకు కమీషన్లు ఇస్తూ పింఛన్ పొందుతున్న కొంతమంది బండారం బట్టబయలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రూరల్ మండలం, అర్బన్ మండలంలోని దాదాపు 29 గ్రామాల్లో 10,295 మంది లబ్ధిదారులు వివిధ పథకాల కింద ప్రభుత్వ సొమ్మును పొందుతున్నారు. వీరికి ప్రభుత్వం ప్రతినెలా రూ.1.12 లక్షలు అందిస్తుంది. ఇందులో ప్రధానంగా 3,506 మంది మహిళలు బీడీ కార్మికుల పింఛన్ పొందుతున్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ. వెయ్యి చొప్పున నెలనెలా బ్యాంకులో జమ అవుతున్నాయి. అయితే వీరిలో చాలామంది బీడీ కంపెనీల నుంచి తప్పుడు ధ్రువీకరణ పత్రాలను పొంది ప్రభుత్వం నుంచి పింఛన్ పొందుతున్నట్లు తెలిసింది. వేములవాడ మండలంలో నెలకు రూ.2 లక్షలు బోగస్ లబ్ధిదారులు తీసుకుంటున్నట్లు అధికారుల విచారణలో బయటపడింది. కలెక్టర్ కృష్ణభాస్కర్ బోగస్ లబ్ధిదారులను గుర్తించేందుకు జిల్లా డీఆర్డీఏ, అడిషనల్ అధికారి మదన్మోహన్, ప్రత్యేక అధికారిగా నియమిస్తూ విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో వేములవాడ రూరల్ మండలంలోని కోనాయిపల్లి గ్రామంలో 24 మంది బీడీ కార్మికులు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి లబ్ధి పొందుతున్నట్లు బయటపడింది. ఈ విషయంపై ఎంపీడీవో వేణుగోపాల్‌తో చర్చించి వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పింఛన్ పొందుతున్న 24 మంది బీడీ కార్మికులపై కేసు నమోదు చేసినట్లు వేములవాడ సీఐ వెంకట స్వామి తెలిపారు. -
బీడీ కార్మికుల ఎంపికలో అయోమయం
తాజా మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం మోర్తాడ్/నిజామాబాద్: బీడీ కార్మికులకు ప్రతి నెలా వెయ్యి రూపాయల భృతిని చెల్లించేందుకు ప్రభుత్వం సవాలక్ష కొర్రీలు పెడుతోంది. లబ్ధిదారుల ఎంపిక కోసం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం రెవెన్యూ అధికారులు సోమవారం నుంచి గ్రామాలలో సర్వే నిర్వహిస్తున్నారు. మొదట్లో జారీ చేసిన మార్గదర్శకాలకు, తాజా ఉత్తర్వులకు తేడా చాలా ఉండడంతో లబ్ధిదారుల ఎంపిక వారికి తలకు మించిన భారంగా మారింది. అయితే, తాజా మార్గదర్శకాల బీడీ కార్మికుల ప్రభుత్వం ఇవ్వదల్చుకున్న జీవన భృతి పథకాన్ని ఆసరా పథకం కిందనే అమలు చేయాలని భావిస్తోంది. బీడీ కార్మిక కుటుం బాల్లో ఇప్పటికే కొందరికి వితంతు, వికలాంగ, వృద్ధాప్య పింఛన్లు వస్తున్నాయి. కొత్త మార్గదర్శకాల ప్రకారం ‘ఆసరా’ కింద ఇప్పటికే పింఛన్ పొందుతున్నందున వీరికి ‘భృతి’ లభించదు. ప్రభుత్వ ఆంక్షల కారణంగా అర్హత ఉన్న కార్మికులకు సైతం భృతి లభించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇవీ నిబంధనలు.. గతంలో బీడీలు చుట్టి మానివేసినవారు కేంద్రం అందిస్తున్న పీఎఫ్‌ను పొందుతూ ఉంటే, వారి కుటుం బంలోని ఇతర బీడీ కార్మికులకు జీవనభృతి వర్తిం చదు. ‘ఆసరా’ కింద లబ్ధి పొందుతున్నవారు ఉన్న కుటుంబంలోని కార్మికులకు వర్తించదు. ‘ఆసరా’ కింద ఫించన్ పొందేవారి కుటుంబంలో ఒకరికి మాత్రమే బీడీ భృతిని అందిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఎవరికీ బీడీ భృతిని వర్తింప చేయమని తాజా మార్గదర్శకాలలో ఉంది. అంతేకాక బీడీలు చుట్టి మానివేసి బీడీ పింఛన్‌ను పొందుతున్నవారు ఎవరైనా ఉంటే ఆ కుటుంబంలోని ఇతర సభ్యులకు బీడీ భృతి వర్తించదు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేయాలి. వచ్చే నెల ఒకటి నుంచి బీడీ కార్మికులకు భృతిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం లబ్ధిదారుల ఎంపికకు అధికారులు గ్రామాలలో సర్వే చేస్తున్నారు. ఇదీ పరిస్థితి... ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో రిజిస్టర్డ్ బీడీ కార్మికులు దాదాపు 6.50 లక్షల మంది ఉన్నారు. పేరున్న బీడీ కంపెనీలే తమ కార్మికులను పీఎఫ్‌లో చేర్చు తున్నారుు. మిగతావారికి భృతి అందుతుందా లేదా అనేది తెలియడం లేదు. భృతి పొందాలంటే సమగ్ర కుటుంబ సర్వేలో కచ్చితంగా బీడీ కార్మికురాలుగా నమోదై ఉండాలి.వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలనే నిబంధనలు చేర్చారు. ఈ లెక్కన చూస్తే వేలాది మంది అనర్హులుగా మారే అవకాశముంది.