
విచారణ చేపడుతున్న ఎస్సై రమేశ్
వేములవాడరూరల్: తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ప్రభుత్వాన్ని, అధికారులను మోసం చేసి లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్మును పింఛన్ రూపంలో కాజేస్తున్నవారి గుట్టు రట్టయింది. ఎలాంటి అర్హతలు లేకుండా బీడీ కంపెనీ యజమానుల నుంచి ధ్రువీకరణ పత్రాలు పొంది మధ్య దళారులకు కమీషన్లు ఇస్తూ పింఛన్ పొందుతున్న కొంతమంది బండారం బట్టబయలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రూరల్ మండలం, అర్బన్ మండలంలోని దాదాపు 29 గ్రామాల్లో 10,295 మంది లబ్ధిదారులు వివిధ పథకాల కింద ప్రభుత్వ సొమ్మును పొందుతున్నారు. వీరికి ప్రభుత్వం ప్రతినెలా రూ.1.12 లక్షలు అందిస్తుంది.
ఇందులో ప్రధానంగా 3,506 మంది మహిళలు బీడీ కార్మికుల పింఛన్ పొందుతున్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ. వెయ్యి చొప్పున నెలనెలా బ్యాంకులో జమ అవుతున్నాయి. అయితే వీరిలో చాలామంది బీడీ కంపెనీల నుంచి తప్పుడు ధ్రువీకరణ పత్రాలను పొంది ప్రభుత్వం నుంచి పింఛన్ పొందుతున్నట్లు తెలిసింది. వేములవాడ మండలంలో నెలకు రూ.2 లక్షలు బోగస్ లబ్ధిదారులు తీసుకుంటున్నట్లు అధికారుల విచారణలో బయటపడింది. కలెక్టర్ కృష్ణభాస్కర్ బోగస్ లబ్ధిదారులను గుర్తించేందుకు జిల్లా డీఆర్డీఏ, అడిషనల్ అధికారి మదన్‌మోహన్, ప్రత్యేక అధికారిగా నియమిస్తూ విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో వేములవాడ రూరల్ మండలంలోని కోనాయిపల్లి గ్రామంలో 24 మంది బీడీ కార్మికులు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి లబ్ధి పొందుతున్నట్లు బయటపడింది. ఈ విషయంపై ఎంపీడీవో వేణుగోపాల్‌తో చర్చించి వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పింఛన్ పొందుతున్న 24 మంది బీడీ కార్మికులపై కేసు నమోదు చేసినట్లు వేములవాడ సీఐ వెంకట స్వామి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment