వేరుశనగ వేయకపోవడమే మేలు
అనంతపురం అగ్రికల్చర్: ఆగస్టులో వేరుశనగ పంట వేయకూడదని శాస్త్రవేత్తలు సంయుక్తంగా ప్రకటించారు. గత చరిత్రను పరిశీలిస్తే ఆగస్టులో వేసిన పంట నుంచి 40 శాతం మేర దిగుబడులు తగ్గిపోయినందున జూలై 31వ తేదీనే కటాఫ్ తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. మంగళవారం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై ఆరు జిల్లాల అధికారులు, శాస్త్రవేత్తల మధ్య జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లాల వారీగా పంట సాగు, వర్షపాతం, ప్రత్యామ్నాయ ప్రణాళిక గురించి ఆయా జిల్లాల జేడీఏలు పవర్‌పాయింట్ ద్వారా వివరించారు.
వ్యవసాయశాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్, ఆంగ్రూ విస్తరణ సంచాలకులు డాక్టర్ కె.రాజారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎన్వీ నాయుడు, నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ అధిపతి డాక్టర్ బి.గోపాలరెడ్డి సమక్షంలో ఖరీఫ్ వ్యవసాయం, ప్రత్యామ్నాయంపై సుదీర్ఘచర్చలు జరిపారు. నీటి సమస్య ఎక్కువగా ఉండటంతో రక్షకతడికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్ని జిల్లాల అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. బోరుబావుల నుంచి నీరు తొడేస్తే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని, మొబైల్ లిఫ్ట్ ఇరిగేషన్ అందుబాటులోకి వస్తే కొంత వరకు ఫలితం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
+ అనంతపురం జిల్లా పరిస్థితి గురించి వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి పవర్‌పాయింట్ ఇచ్చారు. 8 లక్షల హెక్టార్లకు గానూ 2 లక్షల హెక్టార్లలో పంటలు వేశారని, అందులో వేరుశనగ 6.04 లక్షల హెక్టార్లు కాగా 1.60 లక్షల హెక్టార్లలో వేశారన్నారు. జూలైలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో కేవలం 26 శాతం విస్తీర్ణం సాగులోకి వచ్చిందన్నారు. కూడేరు, బీకేఎస్, పుట్లూరు, తనకల్లు మినహా మిగతా మండలాల్లో వర్షాలు తక్కువగా పడ్డాయన్నారు. అందులో 46 మండలాల్లో మరీ తక్కువ వర్షాలు నమోదైనట్లు తెలిపారు. ఈ క్రమంలో 5.36 లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడానికి 72,238 క్వింటాళ్లు జొన్న, రాగి, అలసంద, పెసర, పొద్దుతిరుగుడు, ఉలవ, సజ్జ విత్తనాలు అవసరమవుతామని ప్రతిపాదించామన్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు వై.పద్మలత, రవీంద్రనాథరెడ్డి, నాయక్‌లు మాట్లాడుతూ... కదిరి ప్రాంతంలో ఆగస్టు మొదటి వారం వరకు వేరుశనగ వేసుకోవచ్చన్నారు. మిగతా ప్రాంతాల్లో వేయకపోవడం మేలన్నారు. ఇటీవల తేలికపాటి వర్షాలు పడటంతో వేసిన వేరుశనగ పంట పరిస్థితి ఆశాజనకంగా ఉందన్నారు. రక్షకతడి కార్యక్రమం కొనసాగిస్తున్నామన్నారు. అనంతరం చిత్తూరు జేడీఏ విజయకుమార్, కర్నూలు జేడీఏ ఉమా మహేశ్వరి, వైఎస్సార్ కడప జిల్లా జేడీఏ ఠాగూర్‌నాయక్, ప్రకాశం జిల్లా జేడీఏ వంశీకృష్ణారెడ్డి పవర్‌పాయింట్ ద్వారా ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు..తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలను తెలియజేశారు.