యువీ కెరీర్‌ను మలుపు తిప్పిన ఐదు బెస్ట్ ఇన్నింగ్స్‌లు
టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(డిసెంబర్ 12న) 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. యువీ అనగానే మొదటగా గుర్తుకువచ్చేది ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు(2007 టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై). పరిమిత ఓవర్ల క్రికెట్లో గొప్ప ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న యువరాజ్ దాదాపు రెండు దశాబ్దాల పాటు టీమిండియా క్రికెట్లో కీలకపాత్ర పోషించాడు.
ఈ రెండు దశాబ్దాల్లో ఐసీసీ మేజర్ టోర్నీలైన 2007 టి20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్‌లు అతని ఖాతాలో ఉన్నాయి. డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన యువీలో మంచి బౌలర్ కూడా ఉన్నాడు. 2000 అక్టోబర్ నెలలో కెన్యాతో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన యువరాజ్ టీమిండియా తరపున 40 టెస్టుల్లో 1900 పరుగులు, 304 వన్డేల్లో 8701 పరుగులు, 58 టి20ల్లో 1177 పరుగులు సాధించాడు. అయితే ఎన్నో ఘనతలు, రికార్డులు అందుకున్నప్పటికి ఇప్పుడు చెప్పుకోబోయే ఐదు ఇన్నింగ్స్‌లు మాత్రం అతని కెరీర్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు.
69 పరుగులు వర్సెస్ ఇంగ్లండ్(నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్)
నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్లో యువరాజ్ ఆడిన ఇన్నింగ్స్ అతని కెరీర్లో నెంబర్‌వన్ స్థానంలో ఉంటుంది. యువరాజ్ కెరీర్‌నే కాదు టీమిండియా గతినే మార్చేసింది.. ఈ మ్యాచ్. 326 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు గంగూలీ(60), సెహ్వాగ్(45) తొలి వికెట్‌కు 106 పరుగులు జోడించి పటిష్టమైన స్థితిలో నిలిపారు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు ఔట్ కావడం.. ఆ తర్వాత 146 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పుడు క్రీజులోకి వచ్చాడు యువరాజ్ సింగ్. మరో ఎండ్‌లో మహ్మద్ కైఫ్ బ్యాటింగ్ చేస్తున్నాడు.
ఇద్దరు మంచి సమన్వయంతో ఇన్నింగ్స్‌ను ముంఉదకు తీసుకెళ్లారు. ఆరో వికెట్‌కు ఇద్దరు కలిసి 221 పరుగులు రికార్డు భాగస్వామ్యంతో టీమిండియాను గెలుపు దిశగా నడిపించారు. అయితే విజయాన్ని 59 పరుగులు అవసరమైన దశలో యువీ ఔటైనప్పటికి.. అతని ఇన్నింగ్స్‌కు ముచ్చటపడిన కైఫ్ ఆ బాధ్యతలను తాను తీసుకున్నాడు. చివరి వరకు క్రీజులో నిలబడి టీమిండియాకు విజయాన్ని అందించాడు. మ్యాచ్ విజయం తర్వాత లార్డ్స్ బాల్కనీ నుంచి కెప్టెన్ గంగూలీ తన షర్ట్‌ను విప్పి సెలబ్రేట్ చేయడం అప్పట్లో బాగా వైరల్ అయింది. యువీ కెరీర్లో మొదటి టర్నింగ్ పాయింట్ ఇదే.
139 వర్సెస్ ఆస్ట్రేలియా, 2004
2004లో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించింది. సిడ్నీ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా 80 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఆసీస్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న యువరాజ్ సెంచరీ సాధించాడు. 122 బంతుల్లో 16 ఫోర్లు, రెండు సిక్సర్లతో 139 పరుగులు చేసిన యువీ కెరీర్లో ఇది రెండో బెస్ట్ అని చెప్పొచ్చు. అతని ధాటికి టీమిండియా 50 ఓవర్లలో 296 పరుగులు చేసింది. అయితే డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌ను గెలుచుకుంది.
58 వర్సెస్ ఇంగ్లండ్, 2007 టి20 ప్రపంచకప్
యువీ కెరీర్లో మూడో టర్నింగ్ పాయింట్.. 2007 టి20 ప్రపంచకప్ ఇంగ్లండ్‌తో మ్యాచ్. ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో గొడవ యువరాజ్‌లోని విధ్వంసాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది అతనికి నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. అంతేకాదు 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న యువరాజ్ టి20 క్రికెట్లో అత్యంత వేగంగా అర్థసెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటికి ఆ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. యువీ జోరుతో టీమిండియా తొలిసారి టోర్నీలో 200 పరుగుల మార్క్‌ను అందుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది.
57 వర్సెస్ ఆస్ట్రేలియా(2011 వన్డే వరల్డ్‌కప్)
2011 వన్డే వరల్డ్‌కప్‌లో యువరాజ్ ఆల్‌రౌండర్‌గా కీలకపాత్ర పోషించాడు. జట్టులో ఒక ఆల్‌రౌండర్ ఉంటే ఎంత బలమో యువీ చేసి చూపించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 143 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టపడుతోంది. పిచ్ బౌలర్లకు సహకరిస్తుండడంతో క్రీజులోకి వచ్చిన యువీ తనలోని క్లాస్ ఆటను చూపించాడు. సురేశ్ రైనా సహకారంతో ఓపికగా ఆడని యువీ టీమిండియాకు 14 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించాడు. మ్యాచ్‌లో 67 బంతుల్లో 57 పరుగులతో యువరాజ్ నాటౌట్‌గా నిలిచాడు.
150 వర్సెస్ ఇంగ్లండ్, 2017
కెరీర్ చివరి దశలో యువరాజ్ ఆడిన ఆఖరి బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. ఈ దశలో యువరాజ్.. ఎంఎస్ ధోనితో కలిసి మరుపురాని ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీతో కదం తొక్కిన యువరాజ్ 127 బంతుల్లో 150 పరుగులు చేశాడు. యువీ తన వన్డే కెరీర్లో అత్యధిక స్కోరును అందుకున్నాడు. యువీతో పాటు ధోని కూడా సెంచరీతో రాణించడంతో టీమిండియా 381 పరుగులు భారీ స్కోరు చేసింది. 15 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పరాజయం చెందింది. యువీ కెరీర్లో ఇదే ఆఖరి బెస్ట్ ఇన్నింగ్స్. ఆ తర్వాత క్రమంగా ఫామ్ కోల్పోయిన యువరాజ్ 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.
To celebrate Yuvraj Singh's birthday, tell us your favourite memory of his ✨ pic.twitter.com/bCcSuqQbHq
— ICC (@ICC) December 12, 2020
చదవండి: 'ఆ ఎక్స్ప్రెషన్ ఏంటయ్యా.. పిల్లలు జడుసుకుంటారు'
Harry Kane: హీరో అనుకుంటే జీరో అయ్యాడు