Best Institutes
-
విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల.. టాప్ 10లో హైదరాబాద్‌కు దక్కని చోటు
సాక్షి, న్యూఢిల్లీ/రాయదుర్గం: దేశంలోని విద్యాసంస్థల్లో అన్ని విభాగాల్లో కలిపి ఐఐటీ–మద్రాస్ అత్యుత్తమ విద్యాసంస్థగా నిలిచింది. మొత్తం విభాగాల్లో ఐఐటీ–మద్రాస్‌కు మొదటిస్థానం దక్కడం ఇది ఐదోసారి కాగా, ఇంజనీరింగ్ విభాగంలోనూ వరుసగా ఎనిమిదోసారి నంబర్‌వన్ స్థానాన్ని నిలుపుకోవడం విశేషం. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్–2023) నివేదికను విద్య, విదేశీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి డాక్టర్ రాజ్‌కుమార్ రంజన్ సింగ్ సోమవారం విడుదల చేశారు. బోధనా అభ్యాసం, మౌలిక వసతులు, పరిశోధన, వృత్తిపరమైన అభ్యాసం, గ్రాడ్యుయేషన్ ఫలితం, విద్యార్థులు పొందే ఉపాధి అవకాశాలు వంటి అంశాల ఆధారంగా విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, లా, మెడికల్ కాలేజీలకు ర్యాంకులను ప్రకటించారు. వీటిలో అన్ని కేటగిరీల్లో ఐఐటీ–మద్రాస్ తొలిస్థానంలో ఉండగా, ఐఐఎస్సీ–బెంగళూరు రెండో స్థానంలో, ఐఐటీ–ఢిల్లీ మూడో స్థానంలో నిలిచాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఐఐటీ–హైదరాబాద్ 14వ స్థానం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్‌సీయూ) 20వ స్థానం, నిట్–వరంగల్ 53, ఉస్మానియా యూనివర్సిటీ 64, వడ్డేశ్వరంలోని కేఎల్ కాలేజ్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ 50, వైజాగ్‌లోని ఆంధ్రా యూనివర్సిటీ 76వ స్థానంలో నిలిచాయి. ర్యాంకింగ్స్ కోసం 200కు పైగా యూనివర్సిటీలను సర్వేచేశారు. దరఖాస్తు చేసిన దాదాపు 8వేల సంస్థల నుంచి 2023 ర్యాంకులను ప్రకటించారు. అత్యుత్తమ వర్సిటీల విభాగంలో... ఇక అత్యుత్తమ వర్సిటీల విభాగంలో ఐఐఎస్సీ–బెంగళూరు తొలి స్థానంలో ఉండగా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 10వ స్థానం, ఉస్మానియా యూనివర్సిటీ 36, హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 84వ స్థానంలో నిలిచింది. ఏపీలోని ఆంధ్రా యూనివర్సిటీ 43, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ 60వ స్థానం దక్కించుకున్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 8వ, నిట్–వరంగల్ 21వ స్థానంలో ఉన్నాయి. పరిశోధన విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 14వ స్థానంలో, హెచ్‌సీయూ 25వ స్థానంలో నిలిచాయి. మేనేజ్మెంట్ విభాగంలో ఐఐఎం–వైజాగ్ 29వ, ఐసీఎఫ్ఏఐ–హైదరాబాద్ 40వ స్థానంలో ఉన్నాయి. ఫార్మసీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్–హైదరాబాద్ తొలి స్థానంలో ఉండగా, న్యాయ విభాగంలో నల్సార్ యూనివర్సిటీ 3వ స్థానంలో ఉంది. ఇన్నోవేషన్ విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 3వ స్థానంలో నిలిచింది. వ్యవసాయ విభాగంలో.. ఇక వ్యవసాయం, దాని అనుబంధ విభాగాల్లో గుంటూరులోని ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ 20వ, వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 31వ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్–హైదరాబాద్ 32వ స్థానంలో ఉన్నాయి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ కోసం https://www.nirfindia.org/ వెబ్సైట్లో చూడొచ్చు. సమష్టి కృషితోనే సాధ్యం జాతీయ, అంతర్జాతీయస్థాయిలో మంచి గుర్తింపే లక్ష్యం. సమష్టి కృషితోనే సాధ్యం. దేశంలో టాప్– 10 విశ్వవిద్యాలయాల్లో హెచ్సీయూకు మళ్లీ ర్యాంక్‌ను పొందడం ఆనందంగా ఉంది. ఉత్తమ పద్ధతులు, నాణ్యతతో కూడిన బోధన, పరిశోధనల కారణంగా ఈ ర్యాంకు సాధ్యమైంది. భవి ష్యత్‌లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు కృషి చేస్తాం. -ప్రొ. బీజే రావు, వైస్‌చాన్స్‌లర్ హెచ్‌సీయూ మానవాళి కోసం టెక్నాలజీ ఈ విజయంలో విద్యార్థులు, అధ్యాపకులతోపాటు, పూర్వ విద్యార్థుల కృషి కూడా ఉంది. మానవాళి కోసం సాంకేతిక పరిజ్ఞానం అనే నినాదంతో ఐఐటీహెచ్ ముందుకెళ్తోంది. – ప్రొ. బీఎస్ మూర్తి, ఐఐటీహెచ్ డైరెక్టర్ IIT Madras ranked best institution followed by IISC Bengaluru and IIT Delhi as per the NIRF Ranking released by the Union Ministry of Education pic.twitter.com/yAKN3uVnuU— ANI (@ANI) June 5, 2023 IISC, Bangalore ranked best university followed by JNU and Jamia Millia Islamia as per the NIRF Ranking released by the Union Ministry of Education pic.twitter.com/Jvr1OixSHz— ANI (@ANI) June 5, 2023 ఫార్మసీ విభాగంతో హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మొదటి స్థానంలో నిలిచింది. జామియా హమ్దర్ద్, బిట్స్ పిలానీ రెండో, మూడో స్థానాలు సాధించాయి.న్యాయ విద్యలో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, దిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని ‘నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా’ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. దీనికి సంబంధించిన సమగ్ర వార్తకథనం మా ఎడ్యుకేషన్ వెబ్ సైట్లో చదవండి -
ఉజ్వల భవిష్యత్తుకు... బెస్ట్ ఇన్స్టిట్యూట్స్
బేసిక్ సెన్సైస్ నుంచి స్టాటిస్టిక్స్ వరకు... ఆతిథ్య రంగం నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వరకు.. ఐఐటీలు, ఐఐఎంలకు దీటుగా.. వినూత్న కోర్సులను అందిస్తూ.. ఉజ్వల భవితకు మార్గం వేస్తున్న ఉత్తమ విద్యా సంస్థలు దేశంలో ఎన్నో! ఇంటర్మీడియెట్ అర్హతతో.. ఇంజనీరింగ్, మెడికల్‌కు సరితూగే కోర్సులను ఆఫర్ చేస్తున్న బెస్ట్ ఇన్స్టిట్యూట్స్పై ఫోకస్.. ఐఐఎస్ఈఆర్ బేసిక్ సైన్స్ రంగంలో విద్యార్థులను ప్రోత్సహించి, వారిని మెరికల్లా తీర్చిదిద్దే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ క్యాంపస్‌లను ఏర్పాటు చేసింది. కోర్సులు: ఏడు క్యాంపస్‌ల్లో (బరంపూర్, భోపాల్, కోల్‌కత, పుణె, తిరువనంతపురం, మొహాలి, తిరుపతి) ఇంటర్మీడియెట్ అర్హతగా ఐదేళ్ల బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ. ప్రవేశం: మూడు విధానాల్లో ఉంటుంది. అవి.. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకు; కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన స్ట్రీమ్ ఎక్స్ఏ ఉత్తీర్ణత ఆధారంగా; ఐఐఎస్ఈఆర్ ప్రత్యేకంగా నిర్వహించే ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత ద్వారా. ప్రకటన మేలో వెలువడుతుంది. వెబ్సైట్: www.iiseradmission.in ఐఐఎస్సీ (బెంగళూరు) బేసిక్ సైన్స్‌లో కెరీర్ అందించేందుకు, పోటీ ప్రపంచానికి తగినట్లు సైన్స్ నిపుణులను తీర్చిదిద్దేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) తోడ్పడుతోంది. బ్యాచిలర్ కోర్సులు: బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (రీసెర్చ్). ఇది నాలుగేళ్ల కోర్సు. ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. ప్రవేశం: జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులకు నిర్ణీత సంఖ్యలో వేర్వేరుగా సీట్లు కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రవేశం సమయంలో పరిగణనలోకి తీసుకునే అంశాలు: కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజనలో అర్హత; జేఈఈ-మెయిన్ స్కోర్; జేఈఈ అడ్వాన్స్డ్ స్కోర్; ఏఐపీఎంటీ ర్యాంకు. ఎంపికైన వారికి స్కాలర్షిప్స్ ఉంటాయి. వెబ్సైట్: www.iisc.ernet.in ఐఐఎస్టీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్టీ).. అంతరిక్ష శాస్త్రంలో అద్భుత కెరీర్‌కు మార్గం వేస్తోంది. కోర్సులు: ఇస్రో ఆధ్వర్యంలో తిరువనంతపురంలో ఉన్న క్యాంపస్‌లో నాలుగు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి.. బీటెక్- ఏరోస్పేస్ ఇంజనీరింగ్; బీటెక్ ఏవియానిక్స్; ఐదేళ్ల బీటెక్+ఎంఎస్/ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ. అర్హత: ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణతతో పాటు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు పొందాలి. ఎంపికైన విద్యార్థులకు ట్యూషన్ ఫీజు, మౌలిక సదుపాయాల వ్యయాలకు అయ్యే మొత్తానికి సమానమైన స్థాయిలో అసిస్టెన్స్‌షిప్ పేరిట ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది. ప్రవేశాలకు సంబంధించి మేలో ప్రకటన వెలువడుతుంది. వెబ్సైట్: www.iist.ac.in ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ గణాంక శాస్త్రంలో నిపుణులను తీర్చిదిద్దుతూ.. ఉన్నత విద్య, ఉద్యోగావకాశాల పరంగా గుర్తింపు పొందిన సంస్థ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. కోల్‌కతలో ప్రధాన క్యాంపస్ ఉంది. ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, తేజ్‌పూర్‌లో బోధన కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. బ్యాచిలర్ కోర్సులు: బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ (ఆనర్స్); బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఆనర్స్). అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. ఎంపిక: ఇన్స్టిట్యూట్ నిర్వహించే ప్రత్యేక ఎంట్రన్స్‌లో ప్రతిభ, ఇంటర్వ్యూ ఆధారంగా. కోర్సుల్లో ప్రవేశం పొందిన వారికి నెలకు రూ.మూడు వేల స్కాలర్షిప్ లభిస్తుంది. వెబ్సైట్: www.isical.ac.in టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ ముంబై ప్రధాన క్యాంపస్‌తో పాటు హైదరాబాద్, తుల్జాపూర్, గువహటిలలో మరో మూడు క్యాంపస్‌లు ఉన్నాయి. సోషల్ సైన్స్ ఎడ్యుకేషన్‌లో ఉత్తమ సంస్థగా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ (టిస్) నిలుస్తోంది. బ్యాచిలర్ కోర్సులు: ఐదేళ్ల బీఏ-ఎంఏ సోషల్ సైన్స్ కోర్సు; సోషల్ సైన్స్ విత్ రూరల్ డెవలప్మెంట్ స్పెషలైజేషన్.తో బీఏ (ఆనర్స్). ప్రవేశం: ఇంటర్ అర్హతతో నిర్వహించే బ్యాచిలర్ అడ్మిషన్ టెస్ట్‌లో ర్యాంకు ఆధారంగా ఉంటుంది. ఎంపికైనవారికి స్కాలర్షిప్, అసిస్టెన్స్‌షిప్‌లు లభిస్తాయి. వెబ్సైట్: www.admissions.tiss.edu ప్రొఫెసర్ కె.పి.జె.రెడ్డి, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఐఐఎస్సీ (బెంగళూరు). సైన్స్ కోర్సులకు ఆదరణ, విద్యార్థుల చేరిక పరంగా కొంతకాలం స్తబ్ధత నెలకొన్నా. ప్రస్తుతం మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. ఐఐఎస్సీ, ఐఐఎస్ఈఆర్ వంటి సైన్స్ స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూట్స్లో కోర్సులు పూర్తిచేస్తే ఉజ్వల భవిష్యత్తుకు మార్గం వేసుకోవచ్చు. ప్రొఫెసర్ జి.ఎస్.ఆర్.మూర్తి,ఐఎస్ఐ (హైదరాబాద్). గణాంక శాస్త్రంలో బ్యాచిలర్, పీజీ డిగ్రీ పూర్తిచేసిన వారికి ఉన్నత అవకాశాలున్నాయి. మ్యాథమెటిక్స్, కంప్యుటేషనల్ స్కిల్స్ ఉన్న విద్యార్థులు ఈ రంగాన్ని ఎంచుకుంటే కెరీర్లో మరింత రాణించగలరు. ఇతర బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఇఫ్లూ (ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ) : ఇంగ్లిష్తో పాటు వివిధ విదేశీ భాషల్లో ఇంటర్మీడియెట్ అర్హతతో కోర్సులున్నాయి. వెబ్సైట్: www.efluniversity.ac.in ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్: బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో బ్యాచిలర్ డిగ్రీ కోర్సు అందుబాటులో ఉంది. వెబ్సైట్: www.applyadmission.net/nchmjee ఫ్యాషన్ కోర్సులకు కేరాఫ్ నిఫ్ట్: ఈ సంస్థ ఇంటర్ అర్హతతో దేశవ్యాప్తంగా 16 క్యాంపస్‌ల్లో వివిధ బ్యాచిలర్ కోర్సులను అందిస్తోంది. అవి: బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (యాక్సెసరీ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, ఫ్యాషన్ డిజైన్, నిట్వేర్ డిజైన్, లె దర్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్); బీఎఫ్‌టెక్.