అమ్మానాన్నలకు చెబితే మళ్లీ కొడతా
* పలకతో చిన్నారి తలపై బాదిన టీచర్
* తోటి విద్యార్థులతో మాట్లాడటమే తప్పు
ఆదోని : తోటి విద్యార్థులతో మాట్లాడుతోందని ఓ ప్రైవేట్ స్కూల్ టీచరు విద్యార్థిని నుదుటిపై పలకతో దాడి చేసింది. రక్తమోడుతున్న విద్యార్థినికి వైద్యం అందించాల్సింది పోయి ‘అమ్మానాన్నలకు చెబితే మళ్లీ కొడతాను. పిల్లలు కొట్టడం వల్లే గాయమైందని చెప్పు’ అంటూ బెదిరించింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో చోటు చేసుకుంది. పట్టణంలోని గౌళిపేటలో నివసిస్తున్న మహేష్, సంగీత దంపతుల రెండో కుమార్తె శిల్ప స్థానిక కుమ్మరిగేరిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతోంది. బుధవారం పాఠశాలకు వెళ్లిన శిల్ప పక్కనున్న పిల్లలతో మాట్లాడుతుండటంతో టీచరు పలకతో చిన్నారి నుదుటిపై బాదింది.
రక్తగాయం కావడంతో.. ఇంట్లో చెబితే మళ్లీ కొడతానంటూ బెదిరింపులకు పాల్పడింది. ఆ తర్వాత ఎలాంటి ప్రాథమిక చికిత్స చేయకనే ఇంటికి పంపేశారు. రక్తం కారుతూ ఎడుస్తూ ఇంటికి చేరుకున్న చిన్నారిని చూసి తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్ వద్దకు వెళ్లి నిలదీయగా.. టీచరు వారి కాళ్లపై పడి తప్పయిందంటూ వేడుకోవడంతో సమస్య సద్దుమణిగింది.