bhakta kannappa
-
శివుడిగా ప్రభాస్.. పార్వతిగా నయనతార..మంచు విష్ణు ప్లాన్ అదుర్స్!
వరుస పరాజయాలతో ఉన్న మంచు విష్ణు.. తాజాగా ఓ పాన్ ఇండియా సినిమాను ప్రకటించి షాకిచ్చాడు. తమ డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఎన్నాళ్లుగానో చెబుతున్న మంచు ఫ్యామిలీ ‘భక్త కన్నప్ప’ను సెట్‌పైకి తీసుకొచ్చారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రానికి బాలీవుడ్ టెలివిజన్ రంగంలో సూపర్ హిట్ మహాభారత సిరీస్ ని తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శివుడి పాత్రలో ప్రభాస్ నటించబోతున్నారని మంచు విష్ణు కన్ఫర్మ్ చేశాడు. పార్వతిగా నయన్? భక్త కన్నప్పలో ప్రభాస్ నటించబోతున్నారనే వార్త తెలియగానే.. పార్వతి పాత్రను ఎవరు పోషిస్తారనే దానిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. బాలీవుడ్ నటి పార్వతిగా నటిస్తోందని మొదట్లో గుసగుసలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం భక్త కన్నప్పలో పార్వతి పాత్రను నయనతార పోషించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో కీలక పాత్ర పోషించే ఓ సీనియర్ నటి ఈ విషయాన్ని వెల్లడించింది. మంచు విష్ణు మాత్రం ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. అప్పుడు సీత..ఇప్పుడు పార్వతి భక్తిరస పాత్రలు పోషించడం ప్రభాస్, నయన తారలకు కొత్తేమి కాదు. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించి మెప్పించాడు. శ్రీ రామ రాజ్యం సినిమాలో నయనతార సీతగా కనిపించింది. ఇలా ఇద్దరికీ భక్తిరస పాత్రలు పోషించిన అనుభవం ఉంది కాబట్టి.. శివపార్వతులుగా నటించి మెప్పిస్తారనడంతో ఎలాంటి సందేహం లేదు. పైగా ప్రభాస్, నయనతారల పెయిర్ కూడా తెరపై బాగుంటుంది. 2007లో వీరిద్దరు కలిసి యోగి సినిమాలో నటించారు. మళ్లీ 16 ఏళ్ల తర్వాత మంచు విష్ణు కలల ప్రాజెక్ట్ భక్తకన్నప్ప ద్వారా జత కట్టబోతున్నారు. -
భక్త కన్నప్పలో ప్రభాస్.. అదిరిపోయే అప్డేట్
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే! ఆగస్టు 18న శ్రీకాళహస్తిలో మోహన్‌బాబు చేతుల మీదుగా సినిమా లాంచ్ అయింది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పాడు మంచు విష్ణు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. మహాభారతం సీరియల్‌కు దర్శకత్వం వహించిన ముఖేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. ఆదిపురుష్ హీరోయిన్ కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ హీరోయిన్గా నటించనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భక్త కన్నప్ప చిత్రంలో ప్రభాస్ నటించనున్నారట. ట్విటర్లో ఈ విషయం మార్మోగిపోతుండగా తాజాగా దీనిపై విష్ణు మంచు స్పందించాడు. 'హర హర మహాదేవ్' అని రిప్లై ఇస్తూ అది నిజమేనని చెప్పకనే చెప్పాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. బాహుబలిలో శివలింగాన్ని మోసే ప్రభాస్ ఈసారి నిజంగానే శివుడి అవతారం ఎత్తబోతున్నాడంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భక్త కన్నప్పలో ప్రభాస్ ఎంట్రీ ఇస్తే ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని చెప్తున్నారు. ❤️ Har Har Mahadev ❤️ #Kannappa 🔥 https://t.co/GXbSbayFrX — Vishnu Manchu (@iVishnuManchu) September 10, 2023 చదవండి: బిగ్‌బాస్: ఆ ఇద్దరిలో ఒకరు అవుట్.. ఎలిమినేట్ అయింది ఎవరంటే? -
ప్యాన్ ఇండియా
ఇంతకుముందు ప్రాంతీయ భాషల సినిమాలకు పరిమితులుండేవి. కేవలం రీజినల్ మార్కెట్టే ఆ సినిమాల మెయిన్ టార్గెట్. సినిమా కథలు కూడా కేవలం వాళ్లకే అన్నట్టుగా తయారయ్యేవి. కానీ గడిచిన నాలుగైదేళ్ల నుంచి ప్రాంతీయ భాషల సినిమాలకు పరిమితులు తొలగిపోయాయి. హద్దులు చెరిగిపోయాయి. ఈ మార్పులో ‘బాహుబలి’ కీలక పాత్ర పోషించిందని సందేహం లేకుండా చెప్పొచ్చు. ఆ సినిమా తర్వాత దేశవ్యాప్తంగా తెలుగు సినిమాకి అభిమానులు ఎక్కువయ్యారు. మన సినిమాకి ఎక్కువమంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టే మనవాళ్లు ప్యాన్ ఇండియా (దేశంలో ఎక్కువ భాషల్లో సినిమాని విడుదల చేయడం) సినిమాగా తీయడానికి సంకోచించడం లేదు. ఐదారు భాషల్లో ఏకకాలంలో సినిమాని విడుదల చేసి మార్కెట్‌ను విస్తృతం చేసుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగులో సుమారు పది సినిమాలు ‘ప్యాన్ ఇండియా’ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ రెడీ అవుతున్నాయి. వాటి వివరాలు. త్రిబుల్ ఆర్.. టార్గెట్ 10 ‘బాహుబలి’తో మార్కెట్ లెక్కలకి కొత్త రెక్కలిచ్చారు దర్శకుడు రాజమౌళి. కథ బావుంటే సినిమా ఏ ప్రాంతంలో తయారైనా ఆదరణ అంతటా లభిస్తుందని నిరూపించారు. ‘బహుబలి’ ఇచ్చిన నమ్మకంతోనే ప్రస్తుతం మరో ప్యాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ – రామ్‌చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ అనే సినిమా తెరకెక్కుతోంది. సుమారు 400 కోట్ల వ్యయంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. 1920ల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. దాదాపు పది భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. డార్లింగ్.. టార్గెటింగ్ వరల్డ్ ‘బాహుబలి’తో నార్త్ ఆడియన్స్‌కి కూడా ప్రభాస్ డార్లింగ్ అయిపోయారు. ‘సాహో’ సౌత్‌లో అంచనాలను అందుకోలేకపోయినా నార్త్‌లో బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ప్రస్తుతం రాధాకృష్ణతో ప్రభాస్ చేస్తున్న ‘ఓ డియర్’ ప్యాన్ ఇండియా మూవీ అయితే ఆ తర్వాత నాగ్ అశ్విన్‌తో దర్శకత్వంలో చేయనున్న సినిమా ప్యాన్ వరల్డ్. ‘ఓ డియర్’ సినిమా పీరియాడిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోంది. పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రం ఐదు భాషల్లో విడుదల కానుంది. ఇక నాగ్ అశ్విన్‌తో చేయబోయేది సైన్స్ ఫిక్షన్ జానర్ సినిమా. ‘‘ఇది ప్యాన్ వరల్డ్ మూవీ’’ అంటున్నారు నాగ్ అశ్విన్. నిశ్శబ్దంగా... ‘బాహుబలి’ తర్వాత అనుష్క తాజా చిత్రం ‘నిశ్శబ్దం’ కూడా పలు భాషల్లో రిలీజ్ కానుంది. పూర్తి స్థాయిలో అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో జరిగే థ్రిల్లర్ చిత్రమిది. ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఇందులో అనుష్క మూగ, చెవిటి అమ్మాయిగా నటించారు. సినిమాలో ఆమె చిత్రకారిణి. ఇది ‘క్రాస్ ఓవర్’ మూవీ. అంటే.. పలు భాషలకు చెందినవాళ్లు కలిసి ఒకే సినిమాలో నటించడం. ఈ సినిమాలో ఎక్కువమంది హాలీవుడ్ తారలు ఉండటం విశేషం. ఐదు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇస్మార్ట్ మూవ్ ‘ఇస్మార్ట్ శంకర్’ ఘనవిజయంతో దర్శకుడు పూరి జగన్నాథ్ డబుల్ ఎనర్జీతో ఉన్నారు. ఇస్మార్ట్ ప్లాన్ చేశారు. ఇప్పుడు యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండతో కలసి బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. దీని కోసం బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా వీళ్లకు తోడయ్యారు. అనన్యా పాండే కథానాయిక. హిందీ– తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఐదు భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. గ్రాండ్ కమ్‌బ్యాక్ మూడేళ్ల నుంచి మంచు మనోజ్ ఎనర్జీ స్క్రీన్ మీద కనిపించడం లేదు. అయితే కమ్‌బ్యాక్‌ను చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేశారు మనోజ్. ‘అహం బ్రహ్మాస్మి’ అనే టైటిల్‌తో ఓ ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇటీవలే ముహూర్తం జరుపుకుంది ఈ సినిమా. ఐదు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ప్యాన్ కన్నప్ప ‘భక్త కన్నప్ప’ పై సినిమా చేయాలని కొంతకాలంగా వర్క్ చేస్తున్నారు మంచు విష్ణు. కన్నప్ప పాత్రలో నటించి ఈ సినిమాను నిర్మించనున్నారు. సుమారు 95 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ తీయనున్నారు. భారీ స్థాయిలో ఉండేలా ప్రీ– ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. హాలీవుడ్ దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. డబుల్ ప్యాన్ హిందీ–తెలుగు–తమిళం ఇలా ఏ భాషలో అయినా కనిపిస్తూనే ఉంటారు రానా. కథ నచ్చితే పాత్ర ఏదైనా డబుల్ ఓకే అంటారాయన. ప్రస్తుతం రానా ‘అరణ్య’ అనే భారీ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేశారు. అడవులను రక్షించాలనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలోని పాత్ర కోసం 30 కిలోలు తగ్గారు రానా. హిందీ, తెలుగు, తమిళంలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అలాగే ‘హిరణ్య కశ్యప’ అనే పౌరాణిక చిత్రంలో కనిపించనున్నారు. గుణశేఖర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా 180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుందట. ఇది కూడా ప్యాన్ ఇండియా సినిమానే. మేజర్ ప్లాన్ పరిమిత బడ్జెట్, పరిమిత వనరులతో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటారు ‘అడవి’ శేష్. ‘క్షణం, గూఢచారి, ఎవరు’ సినిమాలు ఈ విషయాన్ని నిరూపించాయి. ఈసారి కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు, దేశవ్యాప్తంగా ఇండియన్ ఆడియన్స్‌ను తన మ్యాజిక్‌లో పడేయడానికి సిద్ధమయ్యారు శేష్. ముంబై తాజ్ హోటల్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్‌లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా శేష్ టైటిల్ రోల్లో ‘మేజర్’ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకుడు. కరణం.. ఆదర్శం ఒలింపిక్స్‌లో మన దేశానికి వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో పతాకాన్ని తీసుకొచ్చారు కరణం మల్లీశ్వరి. ఎందరో క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారామె. ఆమె జీవితాన్ని స్క్రీన్ మీద చూపించాలనుకుంటున్నారు దర్శకురాలు సంజనా రెడ్డి. సుమారు 50 కోట్ల వ్యయంతో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందనుంది. నటీనటుల వివరాలు ఇంకా ప్రకటించలేదు. ఇవి కాకుండా మరికొన్ని ప్యాన్ ఇండియా స్థాయిలో చెప్పాల్సిన కథలు రచయితల డ్రాయింగ్ రూమ్‌లో రెడీ అవుతూనే ఉండొచ్చు. ఇవన్నీ బాగా ఆడాలని, మన కథలు ప్రపంచస్థాయికి వెళ్లాలని, తెలుగు సినిమా పరిధి, స్థాయి, మార్కెట్, గౌరవం మరింత పెరగాలని ఆశిద్దాం. తెలుగు సినిమా జయహో! – గౌతమ్ మల్లాది -
కన్నప్ప జన్మస్థలిపై కనికరమేదీ!
సాక్షి, రాజంపేట : శ్రీకాళహస్తిలో దక్షిణకాశిగా విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయం. ఈ ఆలయంలోని శివలింగానికి పూజలు చేసి అపర శివభక్తునిగా నిలిచిన భక్తకన్నప్పది వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు (ఊడుమూరు) గ్రామమని పెరియపురాణం ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇక్కడున్న శివాలయంలో శివలింగానికి కన్నప్ప పూజించినట్లుగా చెబుతుంటారు. అపర శివభక్తుడు భక్తకన్నప్ప(తిన్నడు) జన్మస్థలంపై రాష్ట్ర ప్రభుత్వం అధికారముద్ర ఇంతవరకు పడలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. జన్మస్థలం అభివృద్ధి గురించి శ్రీకాళహస్తి దేవస్థానం శీతకన్ను వేసిందని భక్తుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు పెరియపురాణం ద్వారా భక్తకన్నప్ప జన్మస్థలం రాజంపేట మండలంలోని ఊటుకూరు అని వెలుగులోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి గ్రామస్తులు దాతల సహకారంతో ఆలయాభివృద్ధికి నడుం బిగించారు. భక్త కన్నప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భక్త కన్నప్ప జన్మ స్థలంలో ప్రతిష్టించిన కన్నప్ప విగ్రహం కన్నప్ప కాళహస్తికి ఎలావెళ్లాడు.. తిన్నడు(కన్నప్ప) ఒకనాడు అడవిలో పందిని వేటాడుతూ ఊటుకూరు నుంచి అటవీ ప్రాంతంలో స్వర్ణముఖి నది వరకు వెళ్లాడు. అక్కడ నేటి శ్రీకాళహస్తి దగ్గర శివలింగాన్ని దర్శించి, శివుని భక్తునిగా మారి పూజలు చేసేవాడు. తర్వాత పరమశివునికి తన రెండు కళ్లను సమర్పించి తన భక్తిని చాటుకున్నాడు. ఆయన భక్తికి మెచ్చి శివుడు కన్నప్పకి మోక్షమిచ్చాడు. మహాభక్తుడు కన్నప్ప ప్రతిష్టించిన శివలింగం జన్మ స్థలమైన ఊటుకూరు శివాలయంలో ఉంది. కన్నప్ప ఊహాచిత్రం అన్నమయ్యతో భక్త కన్నప్ప జన్మస్థలానికి అనుబంధం.. తాళ్లపాక అన్నమాచార్యులు తాత నారాయణయ్య చదువుకోవడానికి ఊటుకూరు(ఉడుమూరు)కు వచ్చారు. చదువు అబ్బక గురువు పెట్టే శిక్షలు భరించలేక చింతాలమ్మ గుడిలోని పుట్టలో చేయిపెట్టారు. పాము కరవలేదు కానీ, చింతాలమ్మ ప్రత్యక్షమైంది. శ్రీ వేంకటేశ్వరుని అనుగ్రహం వల్ల పరమభక్తుడు నీకు మనమడుగా పుడతాడని ఆశీర్వదించింది. ఆ నారాయణయ్య మనువడే అన్నమాచార్యులు. అన్నమయ్య తండ్రి నారాయణసూరి, తల్లి లక్కమాంబ. అన్నమయ్య కూడా ఊటుకూరులో చిన్నతనంలో విద్యాభ్యాసం చేశాడు. కలియుగ దైవం వేంకటేశ్వరునిపై 32వేల కీర్తనలు రచించి, పదకవితా పితామహడు పేరు తెచ్చుకొని ధన్యుడయ్యారు. చింతాలమ్మ అమ్మవారి విగ్రహం ఇప్పటికీ ఊటుకూరు శివాలయంలో ఉంది. -
కృష్ణవంశీ దర్శకత్వంలో భక్తిరస చిత్రం
కృష్ణంరాజు హీరోగా తెరకెక్కిన చారిత్రక చిత్రం భక్త కన్నప్ప ఈ సినిమాను ఈ జనరేషన్ మెచ్చేలా అత్యున్నత సాంకేతిక విలువలతో రీమేక్ చేయాలన్న ప్రయత్నం చాలా రోజులుగా జరుగుతోంది. ముందుగా కృష్ణంరాజు, ప్రభాస్ హీరోగా ఈ సినిమాను చేయడానికి ప్లాన్ చేశాడు అయితే ఈ లోగా రచయిత, నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి తన స్వీయ దర్శకత్వంలో కన్నప్ప సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు. కామెడీ నుంచి హీరో క్యారెక్టర్లకు మారిన సునీల్ హీరోగా భక్తకన్నప్ప సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు భరణి. అయితే ఈ సినిమా పట్టాలెక్కలేదు. తరువాత అదే సినిమాను మంచు విష్ణు తన సొంత నిర్మాణ సంస్థలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. తనికెళ్ల భరణి దర్శకత్వంలోనే ఈ సినిమా ఉంటుదన్న టాక్ వినిపించింది. తాజాగా భక్తకన్నప్ప సినిమాకు కృష్ణవంశీ దర్శకత్వంలో వహిస్తాడంటూ టాక్ నడుస్తోంది. తనికెళ్ల భరణి తయారు చేసిన కథనే.. కృష్ణవంశీ డైరెక్ట్ చేయనున్నాడట. విష్ణు హీరోగా తెరకెక్కబోయే ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా నక్షత్రం సినిమాను తెరకెక్కిస్తున్న వంశీ, ఆ తరువాత మంచు విష్ణుతో తెరకెక్కబోయే సినిమా పనులు మొదలెట్టనున్నాడు. -
ఇప్పుడు కన్నప్ప మారాడు!
ఒక కథకు ముందు ఓ హీరోను అనుకొన్నా... చివరకు ఆ కథ వేరే హీరోతో తెరకెక్కడం సినిమా రంగంలో సర్వసాధారణం. ఈ మధ్య పూరి అనుకున్న కథకు నితిన్ ఎంపికై, తర్వాత ఆ స్థానంలో వరుణ్ తేజ్ వచ్చారు. తాజాగా మరో సినిమాకు అలా జరిగింది. భక్త కన్నప్ప జీవితం ఆధారంగా తాను దర్శకత్వం వహించా లనుకున్న చిత్రంలో టైటిల్ రోల్‌కు హీరోగా మారిన కమెడియన్ సునీల్‌ను ముందు ఎంపిక చేశారు దర్శక - రచయిత తనికెళ్ల భరణి. ఇప్పుడు అదే కథను మరో హీరోతో తనికెళ్ల తెరకెక్కించనున్నారు. ఈ ‘కన్నప్ప కథ’లో టైటిల్ రోల్‌ను మంచు విష్ణు పోషించనున్నారు. ఈ చిత్రాన్ని ఓ హాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్‌బాబు నిర్మించను న్నారు. ‘‘కన్నప్ప కథ ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆకట్టుకుంటుందని, కథ ఓకే అయిన ప్పట్నుంచీ ఎంతో ఉద్వేగంగా ఉన్నాం’’ అని విష్ణు అన్నారు. భారతీయ భాషలన్నింటిలోనూ ఈ చిత్రాన్ని నిర్మించనున్నామని, ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు. -
పులితోలు వలువాయె...
పాట నాతో మాట్లాడుతుంది నా ఎదురుగా ఓ సౌందర్యవతి. ‘అలంకారాల ఘలంఘలలతో విశేష విశేషణాలతో అలరిస్తున్న శ్రీనాథుని పద్య సుందరి లాగున్నావు ఎవరివమ్మా తల్లీ’’ అన్నాను. చేవ కలిగిన చేమకూర వేంకటకవి యంతటి ‘సినీ చేమకూర వేటూరి సుందరరామమూర్తి నా తండ్రి. నేను ‘భక్త కన్నప్ప’లో ‘కిరాతార్జునీయ గేయ’ కన్యకను.’ భక్త కన్నప్ప... సంగీతం - సత్యం, దర్శకులు - బాపు. చెప్పేదేముంది. రచన ముళ్లపూడి రమణ. బాపు-రమణలు వేటూరిగారికి కిరాతార్జునీయం ఘట్టం చెప్పగానే వేటూరి ‘అసాధారణ ధారణాధురీణుడు కదా’ వెంటనే శ్రీనాథుని హరవిలాసంలోని ఏడవ ఆశ్వాసంలో కిరాతార్జునీయం అటు నుంచి ఇటు - ఇటు నుండి అటు ఒక్కసారి సాక్షాత్కరించింది. ఇంక ఏ ఆధారం లేకుండా గాలి నుండి గాంధర్వ గీతాలను సృజించగలిగే వేటూరిలోని కవి పెదవులపై సాధికారికత చిరునవ్వు మెరిసింది. గీతానికి తెర లేపుతూ - తకిట తకతక తకిట చరిత పదయుగళ - మొదలైంది. పాట. మూలంలోని పద్యంలో ఏది ముట్టుకోవాలో దేన్ని వదులుకోవాలో వేటూరి కనుచూపు కొసలకు పెనుపాళి కొసలకు తెలిసిన విద్వత్తో శంకరుడు ఎరుకలవానిగా మారుతున్నాడు. వేటూరి పెనుచూపు శంకరుని తలను ఒక్కసారే నిశితంగా గుర్తు తెచ్చుకుంది. ‘తలపై నెలవంక’ను శ్రీనాథుని ‘వికట పాటల జటా మకుటికాభారంబు కరుకైన జుంజురునెరులు కాగ’ జుట్టు గురించి ఎందుకులే వదిలేశాడు ‘జారు సుధాధామ శకలావతంసంబు పెడకొప్పు పైనుండు పీకె కాగ’ - శ్రీనాథుడు నెలవంకను చుట్టపీకెలా మారిందన్నది వేటూరికి నచ్చలే. సినిమా కన్ను - సినిమా పెన్ను - అందం - ఆనందం పరమావధి అనుకుంటుంది. ‘నెలవంక తలపాగ నెమలి ఈకెగ మారె’ వేటూరి సీతకు రమణ - బాపులిద్దరు శెభాషనుకున్నారు. శ్రీనాథుడు వదిలిన ‘గంగ’ను వేటూరి అందుకున్నాడు పాటలో తన ముద్ర వేయాలని ‘తలపైన గంగమ్మ తలపులోనికి జారె ‘ఘనలలాటంబున గను పట్టు కనుచిచ్చు గైరిక ద్రవతిలకంబుగాగ’... ఇది తప్పనిసరి అనుకుని ‘నిప్పులు మిసే కన్ను నిదరోయి బొట్టాయె’ శ్రీనాథుడు వదిలిన బూదిని - పులితోలును ‘బూదిపూతకు మారు పులితోలు వలువాయె’ అంటూ ఎరుకలవానికి ఆహార్యం ధరింపజేశాడు. శ్రీనాథుడు పాములను పూసల సరులుగా మార్చిన పాదాలను వలదని శ్రీనాథుడు రాసిన శంకరుండు కిరాత వేషంబు దాల్చి యగజ చెంచెతయై తోడనరుగుదేరును వాక్యాలను. ‘ఎరుక కలిగిన శివుడు ఎరుకగా మారగా... తల్లి పార్వతి మారే తాను ఎరుకతగా’ మార్చాడు. శ్రీనాథుని ‘బాణినోంకార దివ్యచాపము ధరించి వచ్చె వివ్వచ్చు వరతపోవనము కడకు’లో ‘త్రిశూలం’ లేదని గ్రహించి ‘ఓంకార ధనువుగా ఒదిగె త్రిశూలమ్ము’ అంటూ త్రిశూలాన్ని శ్రీనాథుని ఓంకార ధనువుగా కూర్చాడు వేటూరి - కవి కన్ను జల్లెడైన వడపోతలో త్రిశూలం దొరికింది వేటూరికి. శ్రీనాథుని మూలంలోని ‘తాటియంత విల్లు ధరియించినాడవు - తాడి ఎత్తు గాండీవముతో ముత్తాడి ఎత్తుగా’ ఆనాటి కవులకు ఎత్తు అయితే తాటిచెట్టు లేదా హిమాలయం. అలా కిరాతార్జునీయ ఘట్టాన్ని సినీగీతాల చరిత్రలో హిమాలయం ఎత్తులో నిలిపిన వేటూరికి కొందరు నిర్మాతల - దర్శకుల - కథానాయకుల సంగీత దర్శకుల కొల‘తల’ మేరకు - కురచగా అపసవ్య సాచిగా పదాలతో ‘నాటు కొట్టడమూ’ తెల్సు. ఏమైనా సినీ కవులకు ఏం తెలుసు? శ్రీనాథ పద్యం అని వెటకారించే మలపరాయుల కనుల నలక మకిలి - కెలికి తీసేలా. వెలికి తీసేలా రచించిన ఈ గీతం మీ సినీగీత రచయితలందరికీ గర్వంగా హత్తుకోదగిన సగర్వంగా తలనెత్తుకోదగిన సినీమణి మకుట గీతం అంటూ వేటూరి పాట వేవేల గీతమ్మల ముద్దూ నా రాముడే - ముద్దు సుందర రాముడేనంటూ కొమ్మ కొమ్మకో సన్నాయిగా మారిపోయింది. - డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత -
'నా భక్త కన్నప్ప.. ఓ లవ్ స్టోరీ'
అలనాటి భక్త కన్నప్ప సినిమా అంటే.. అరివీర శివభక్తుడిగా కనిపించే కృష్ణంరాజు గుర్తుకొస్తారు. కానీ ఇప్పుడు అదే పేరుతో తాను హీరోగా రూపొందుతున్న సినిమా మాత్రం భక్తి సినిమా కాదని, ఓ గిరిజన ప్రేమకథా చిత్రమని సునీల్ చెబుతున్నాడు. అందులో వినోదం కూడా కావల్సినంత ఉంటుందంటున్నాడు. తాను ఈ సినిమాలో ఓ గిరిజనుడి పాత్ర పోషిస్తున్నానని, గ్రామీణ ప్రాంతంలో అందంగా సాగిపోయే ప్రేమకథ ఇందులో ఉంటుందని చెప్పాడు. ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మే రెండో వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. మరో రెండు పెద్ద సినిమాల్లో కూడా సునీల్ చేయబోతున్నాడు. నిజానికి హీరో అయినప్పటి నుంచి తాను నటిస్తున్న సినిమాల సంఖ్య గణనీయంగా పడిపోయిందని, ఇప్పుడు కనీసం ఏడాదికి ఒక సినిమా పూర్తి చేయడం కూడా కష్టమే అవుతోందని చెప్పాడు. కానీ ఈ సంవత్సరం మాత్రం ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నానని తెలిపాడు. విక్కీ దర్శకత్వంలో ఒకటి, రచయిత గోపీమోహన్ దర్శకత్వంలో మరొక సినిమా ఈసారి చేస్తానని చెప్పాడు. 2010లో రాజమౌళి తీసిన మర్యాదరామన్నతో కమెడియన్ సునీల్ హీరోగా మారాడు.