ప్యాన్‌ ఇండియా | Tollywood Heros Pan India Movies Special Story | Sakshi
Sakshi News home page

ప్యాన్‌ ఇండియా

Published Tue, Mar 10 2020 3:24 AM | Last Updated on Tue, Mar 10 2020 4:59 AM

Tollywood Heros Pan India Movies Special Story - Sakshi

ఇంతకుముందు ప్రాంతీయ భాషల సినిమాలకు పరిమితులుండేవి. కేవలం రీజినల్‌ మార్కెట్టే ఆ సినిమాల మెయిన్‌ టార్గెట్‌. సినిమా కథలు కూడా కేవలం వాళ్లకే అన్నట్టుగా తయారయ్యేవి. కానీ గడిచిన నాలుగైదేళ్ల నుంచి ప్రాంతీయ భాషల సినిమాలకు పరిమితులు తొలగిపోయాయి. హద్దులు చెరిగిపోయాయి. ఈ మార్పులో ‘బాహుబలి’ కీలక పాత్ర పోషించిందని సందేహం లేకుండా చెప్పొచ్చు. ఆ సినిమా తర్వాత దేశవ్యాప్తంగా తెలుగు సినిమాకి అభిమానులు ఎక్కువయ్యారు. మన సినిమాకి ఎక్కువమంది ఫ్యాన్స్‌ ఉన్నారు కాబట్టే మనవాళ్లు ప్యాన్‌ ఇండియా (దేశంలో ఎక్కువ భాషల్లో సినిమాని విడుదల చేయడం) సినిమాగా తీయడానికి సంకోచించడం లేదు. ఐదారు భాషల్లో ఏకకాలంలో సినిమాని విడుదల చేసి మార్కెట్‌ను విస్తృతం చేసుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగులో సుమారు పది సినిమాలు ‘ప్యాన్‌ ఇండియా’ మార్కెట్‌ను టార్గెట్‌ చేస్తూ రెడీ అవుతున్నాయి. వాటి వివరాలు.  

త్రిబుల్‌ ఆర్‌.. టార్గెట్‌ 10
‘బాహుబలి’తో మార్కెట్‌ లెక్కలకి కొత్త రెక్కలిచ్చారు దర్శకుడు రాజమౌళి. కథ బావుంటే సినిమా ఏ ప్రాంతంలో తయారైనా ఆదరణ అంతటా లభిస్తుందని నిరూపించారు. ‘బహుబలి’ ఇచ్చిన నమ్మకంతోనే ప్రస్తుతం మరో ప్యాన్‌ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్‌ – రామ్‌చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అనే సినిమా తెరకెక్కుతోంది. సుమారు 400 కోట్ల వ్యయంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. 1920ల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. దాదాపు పది భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.


డార్లింగ్‌.. టార్గెటింగ్‌ వరల్డ్‌

‘బాహుబలి’తో నార్త్‌ ఆడియన్స్‌కి కూడా ప్రభాస్‌ డార్లింగ్‌ అయిపోయారు. ‘సాహో’ సౌత్‌లో అంచనాలను అందుకోలేకపోయినా నార్త్‌లో బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది. ప్రస్తుతం రాధాకృష్ణతో ప్రభాస్‌ చేస్తున్న ‘ఓ డియర్‌’ ప్యాన్‌ ఇండియా మూవీ అయితే ఆ తర్వాత నాగ్‌ అశ్విన్‌తో దర్శకత్వంలో చేయనున్న సినిమా ప్యాన్‌ వరల్డ్‌. ‘ఓ డియర్‌’ సినిమా పీరియాడిక్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోంది. పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రం ఐదు భాషల్లో విడుదల కానుంది. ఇక నాగ్‌ అశ్విన్‌తో చేయబోయేది సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌ సినిమా. ‘‘ఇది ప్యాన్‌ వరల్డ్‌ మూవీ’’ అంటున్నారు నాగ్‌ అశ్విన్‌.

 

నిశ్శబ్దంగా...
‘బాహుబలి’ తర్వాత అనుష్క తాజా చిత్రం ‘నిశ్శబ్దం’ కూడా పలు భాషల్లో రిలీజ్‌ కానుంది. పూర్తి స్థాయిలో అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో జరిగే థ్రిల్లర్‌ చిత్రమిది. ఏప్రిల్‌ 2న విడుదల కానుంది. ఇందులో అనుష్క మూగ, చెవిటి అమ్మాయిగా నటించారు. సినిమాలో ఆమె చిత్రకారిణి. ఇది ‘క్రాస్‌ ఓవర్‌’ మూవీ. అంటే.. పలు భాషలకు చెందినవాళ్లు కలిసి ఒకే సినిమాలో నటించడం. ఈ సినిమాలో ఎక్కువమంది హాలీవుడ్‌ తారలు ఉండటం విశేషం. ఐదు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.


ఇస్మార్ట్‌ మూవ్‌

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ఘనవిజయంతో దర్శకుడు పూరి జగన్నాథ్‌ డబుల్‌ ఎనర్జీతో ఉన్నారు. ఇస్మార్ట్‌ ప్లాన్‌ చేశారు. ఇప్పుడు యూత్‌ సెన్సేషన్‌ విజయ్‌ దేవరకొండతో కలసి బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ  యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నారు. దీని కోసం బాలీవుడ్‌ ప్రొడ్యూసర్‌ కరణ్‌ జోహార్‌ కూడా వీళ్లకు తోడయ్యారు. అనన్యా పాండే కథానాయిక. హిందీ– తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఐదు భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు.  


గ్రాండ్‌ కమ్‌బ్యాక్‌

మూడేళ్ల నుంచి మంచు మనోజ్‌ ఎనర్జీ స్క్రీన్‌ మీద కనిపించడం లేదు. అయితే కమ్‌బ్యాక్‌ను చాలా గ్రాండ్‌గా ప్లాన్‌ చేశారు మనోజ్‌. ‘అహం బ్రహ్మాస్మి’ అనే టైటిల్‌తో ఓ ప్యాన్‌ ఇండియా సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇటీవలే ముహూర్తం జరుపుకుంది ఈ సినిమా. ఐదు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.  

 

ప్యాన్‌ కన్నప్ప
‘భక్త కన్నప్ప’ పై సినిమా చేయాలని కొంతకాలంగా వర్క్‌ చేస్తున్నారు మంచు విష్ణు.  కన్నప్ప పాత్రలో నటించి ఈ సినిమాను నిర్మించనున్నారు. సుమారు 95 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ తీయనున్నారు. భారీ స్థాయిలో ఉండేలా ప్రీ– ప్రొడక్షన్‌ పనులు చేస్తున్నారు. హాలీవుడ్‌ దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్‌ చేయనున్నారు.  


డబుల్‌ ప్యాన్‌

హిందీ–తెలుగు–తమిళం ఇలా ఏ భాషలో అయినా కనిపిస్తూనే ఉంటారు రానా. కథ నచ్చితే పాత్ర ఏదైనా డబుల్‌ ఓకే అంటారాయన.  ప్రస్తుతం రానా ‘అరణ్య’ అనే భారీ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేశారు. అడవులను రక్షించాలనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలోని పాత్ర కోసం 30 కిలోలు తగ్గారు రానా. హిందీ, తెలుగు, తమిళంలో ఈ సినిమా రిలీజ్‌ కాబోతోంది. అలాగే  ‘హిరణ్య కశ్యప’ అనే పౌరాణిక చిత్రంలో కనిపించనున్నారు. గుణశేఖర్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా 180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుందట. ఇది కూడా ప్యాన్‌ ఇండియా సినిమానే.


మేజర్‌ ప్లాన్‌

పరిమిత బడ్జెట్, పరిమిత వనరులతో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటారు ‘అడవి’ శేష్‌. ‘క్షణం, గూఢచారి, ఎవరు’ సినిమాలు ఈ విషయాన్ని నిరూపించాయి. ఈసారి కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు, దేశవ్యాప్తంగా ఇండియన్‌ ఆడియన్స్‌ను తన మ్యాజిక్‌లో పడేయడానికి సిద్ధమయ్యారు శేష్‌. ముంబై తాజ్‌ హోటల్‌లో జరిగిన టెర్రరిస్ట్‌ అటాక్‌లో ప్రాణాలు కోల్పోయిన మేజర్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితం ఆధారంగా శేష్‌ టైటిల్‌ రోల్‌లో ‘మేజర్‌’ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి శశికిరణ్‌ తిక్క దర్శకుడు.


కరణం.. ఆదర్శం

ఒలింపిక్స్‌లో మన దేశానికి వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పతాకాన్ని తీసుకొచ్చారు కరణం మల్లీశ్వరి. ఎందరో క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారామె. ఆమె జీవితాన్ని స్క్రీన్‌ మీద చూపించాలనుకుంటున్నారు దర్శకురాలు సంజనా రెడ్డి. సుమారు 50 కోట్ల వ్యయంతో ప్యాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందనుంది. నటీనటుల వివరాలు ఇంకా ప్రకటించలేదు.  ఇవి కాకుండా మరికొన్ని ప్యాన్‌ ఇండియా స్థాయిలో చెప్పాల్సిన కథలు రచయితల డ్రాయింగ్‌ రూమ్‌లో రెడీ అవుతూనే ఉండొచ్చు. ఇవన్నీ బాగా ఆడాలని, మన కథలు ప్రపంచస్థాయికి వెళ్లాలని, తెలుగు సినిమా పరిధి, స్థాయి, మార్కెట్, గౌరవం మరింత పెరగాలని ఆశిద్దాం. తెలుగు సినిమా జయహో!

– గౌతమ్‌ మల్లాది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement