చిత్తూరు జేసీగా భరత్‌గుప్తా
కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్,టీటీడీ ఈవో గోపాల్ తెలంగాణకే...
జీఏడీకి రిపోర్ట్ చేసుకోవాల్సిందిగా జేసీ శ్రీధర్‌కు ఉత్తర్వులు
ఎస్పీలు శ్రీనివాస్,గోపినాథ్ జట్టీలు జిల్లాలోనే
జిల్లాకు త్వరలో కొత్త కలెక్టర్
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా మదనపల్లె సబ్‌కలెక్టర్ భరత్‌గుప్తాను ప్రభుత్వం నియమించింది. చిత్తూరు జేసీ, ప్రస్తుత ఇన్చార్జి కలెక్టర్ శ్రీధర్‌ను జీఏడీకి రిపోర్ట్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం జరిగిన ఐఏఎస్‌ల బదిలీల్లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా ఈ ఏడాది మార్చి 10న శ్రీధర్ బాధ్యతలు తీసుకున్నారు. ఎన్నికల సమయంలో గట్టిగా పనిచేశారు.
రాజం పేట పార్లమెంట్ రిటర్నింగ్ అధికారిగా విధులు నిర్వహించారు. ప్రజలు ఏదైనా సమస్యతో తన వద్దకు వస్తే తక్షణమే స్పందిస్తారనే మంచి పేరు తెచ్చుకున్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో కూడా దూకుడుగా వ్యవహరించారు. ముఖ్యంగా ఎర్రచందనం అంతర్జాతీయ స్మగర్లపై దాదాపు రెండు నెలలుగా పీడీయాక్టు నమోదు చేయకుండా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ తాత్సారం చేశారు. ఈ అంశంలో కలెక్టర్‌పై పలు విమర్శలు, ఆరోపణలు కూడా వచ్చాయి.
కలెక్టర్‌ను తెలంగాణకు కేటాయించడం, సింగపూ ర్ పర్యటనకు వెళ్లడంతో ఇన్చార్జి కలెక్టర్‌గా శ్రీధర్ ఈ నెల 24న బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు తీసుకున్న వెంట నే ఏడుగురు అంతర్జాతీయ స్మగ్లర్లపై పీడీయాక్టు నమోదు చే సి ‘శభాష్’ అనిపించుకున్నారు. తక్కిన వారిపై పీడీ నమోదు చేసేందుకు ఫైళ్లు సిద్ధం చేయాలని పోలీసులను ఆదేశించారు.
సబ్‌కలెక్టర్‌గా సక్సెస్
చిత్తూరు జేసీగా నియమితులైన భరత్‌గుప్తా మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా 2013 అక్టోబర్ 27న బాధ్యతలు తీసుకున్నారు. అతిపెద్ద రెవెన్యూ డివిజన్ అయిన మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా సక్సెస్ అయ్యారు. ప్రజా సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని, తన వరకూ వచ్చిన విషయాలకు వీలైనంత వరకూ తక్షణ పరిష్కారం చూపిస్తారని పేరు తెచ్చుకున్నారు. ఒకే స మస్యపై పలుసార్లు తన వద్దకు ప్రజలు వస్తే తీవ్రంగా స్పందించేవారు. జిల్లా పరిస్థితులపై భరత్‌గుప్తాకు పూర్తిగా అవగాహన ఉండటంతో జాయింట్ కలెక్టర్‌గా తన బాధ్యతలు మరింత సులువు కానున్నాయి.
తెలంగాణకే కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్
కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ తెలంగాణకే వెళ్లనున్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, టీటీడీ ఈవో గోపాల్ తెలంగాణ కేడర్‌కు, జేసీ శ్రీధర్, మదనపల్లె సబ్‌కలెక్టర్ భరత్‌గుప్తా ఆంధ్రాకు కేటాయించబడ్డారు. ఈ నెల 2 వరకూ అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం స్వీకరించింది. ఈ క్రమంలో ఐఏఎస్, ఐపీఎస్‌ల అభ్యంతరాలను పూర్తిగా తోసిపుచ్చింది.
ఇదివరకే జరిగిన బదలాయింపులే ఫైనల్ అని తేల్చి చెప్పింది. దీంతో సిద్ధార్థ్‌జైన్, గోపాల్ తెలంగాణకు వెళ్లడం అనివార్యమైంది. చిత్తూరు, తిరుపతి ఎస్పీలు జిల్లాలోనే కొనసాగనున్నారు. జూలై 12న జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ్‌జైన్ దూకుడుగా పాలన అందించేందుకు ప్రయత్నించారు. అయితే పూర్తిగా కుప్పంపైనే దృష్టి సారించి విమర్శల పాలయ్యారు. అలాగే అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి మోపి ఇబ్బంది పెట్టారని కూడా అధికార వర్గాలు చెబుతున్నాయి.
మదనపల్లెను మరువలేను
దేశంలో అతి పెద్ద రెవెన్యూ డివిజన్ కేంద్రమైన మదనపల్లెను జీవితంలో మరువలేను. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ శుభాలే జరిగాయి. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఇక్కడ చాలా మధురానుభూతులు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడి వాతావరణం, రాజకీయ నాయకులు, ప్రజల సహకారం మరువలేను. జాయింట్ కలెక్టర్‌గా శుక్రవారం బాధ్యతలు చేపడతా.
- భరత్ గుప్తా
చిత్తూరు చాలామంచి జిల్లా : శ్రీధర్, ఇన్చార్జి కలెక్టర్
చిత్తూరులో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా మంచి జిల్లా. వీలైనంత వరకూ ప్రజలకు ఉపయోగపడేలా పాలన సాగించాననే తృప్తి ఉంది. ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్లు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లకూడదనే నిర్ణయంతోనే ఇన్చార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత పీడీయాక్టుపై తక్షణ నిర్ణయం తీసుకున్నా. జిల్లా ప్రజలు, అధికారులు కూడా నాపై మంచి ప్రేమ చూపారు. అందరికీ కృతజ్ఞతలు.