సంతృప్తి... సగం బలం
చాతుర్మాస్య దీక్ష సందర్భంగా విజయవాడ శివరామక్షేత్రానికి విచ్చేసిన శ్రీ శృంగేరీ శివగంగ శ్రీశారదాపీఠాధిపతి శ్రీశ్రీశ్రీపురుషోత్తమ భారతీ మహాస్వామి వారి అనుగ్రహభాషణం... ధర్మాచరణ ద్వారా మోక్షాన్ని సాధించినప్పుడే మానవ జీవిత లక్ష్యం నెరవేరుతుంది. మోక్షాన్ని పొందలేని మానవ జీవితం వ్యర్థమే.
♦ జీవితం ఆనందంగా గడపాలనుకునేవారు తనకి ఒక పరిమితిని ఏర్పరచుకోవాలి. అన్నీ ఉన్నా ఇంకా ఇంకా కావాలి అనుకోవటంలో ఆనందానికి దూరమవుతారు. సంతృప్తి అనేది ప్రతివ్యక్తికి ఉండి తీరాలి. అది లేకపోతే మనిషికి అన్నీ ఉన్నా ఆనందం లభించదు.
♦ అసంతృప్తి అనేది మనిషిని అన్నింటిలోనూ దిగజార్చివేస్తుంది.
♦ మనిషి ఆధ్యాత్మిక పరంగా ఎదగాలంటే వారి అవసరాలను తగ్గించుకోవాలి.
♦ పాపం వల్ల దుఃఖం వస్తుంది. అద్వైత ఆత్మజ్ఞానం చేత పాపం పోగొట్టబడుతుంది. ‘పాపౌఘపరిధూయతాం’ అన్నారు శంకరులు.
♦ దుఃఖం రాకూడదనుకునేవారు నిరంతరం ధర్మమార్గంలో ఉండాలి. మనసులో ఏ విధమైన పాపచింతన లేకుండా చూసుకోవాలి. సత్పురుషులను ఆశ్రయించి జ్ఞానమార్గాన్ని అనుసరించాలి. అటువంటి వారికి దుఃఖం చాలా దూరంగా ఉంటుంది.
♦ నిరంతరం వేదోక్త మార్గాలను అనుసరిస్తూ జిజ్ఞాసువులై శిష్యులకు మంచిని బోధించాలనే ఇచ్ఛ కలిగి ఉన్నవారే సత్పురుషులు.
♦ నిరంతరం ఆత్మయందే బుద్ధిని నిలపడం, ఆత్మను గూర్చి చింతించటం, ఆత్మయందే మనస్సు ఉంచడం వల్ల ఆత్మజ్ఞాన ప్రాప్తి కలుగుతుంది.
♦ కోరికలు పెరగడం వల్ల కష్టాల పాలవుతున్నారు. కోర్కెలను అదుపులో ఉంచుకున్న వారు, ఎంత సంపాదించినా సంతృప్తిగా జీవించేవారు సుఖవంతులు. అంతేకాని ఎంత సంపాదించామనే దానితో సంబంధం లేదు.
♦ సంతృప్తి అనేది సత్సంగం వలన కలుగుతుంది. సద్గురువుల బోధ, సత్పురుషుల సాంగత్యం వల్ల వస్తుంది. అందుకోసమే ఎల్లప్పుడూ సత్సాంగత్యాన్నే కోరుకోవాలి.
యతులు, పీఠాధిపతులు చాతుర్మాస్య దీక్ష ఎందుకు చేస్తారు?
పీఠాధిపతులకు చాతుర్మాస్య దీక్ష అవసరం. గురువులందరినీ ఆవాహన చేసి దీక్షలో ఉంటారు. యతులు, సన్యాసులు... ఒక గ్రామంలో ఒకరోజుకి మించి ఉండకూడదు. అలా వారు సంచరిస్తూ ఉంటారు. కాని, క్షేత్రంలో ఎన్నిరోజులైనా ఉండవచ్చు. పక్షాన్ని మాసంగా భావించి, రెండు మాసాలు ఈ వ్రత దీక్షలు చేస్తారు. కొందరు నాలుగు మాసాలు ఆచరిస్తారు. గృహస్థులు కూడా నియమానుసారం ధర్మసింధు’ బోధించిన నియమాలు అనుసరిస్తారు. సనాతన ధర్మప్రచారం కోసం... నిరంతరం ధర్మశాస్త్రం అనుసరించడం, ధర్మప్రచారం చేయడం పీఠాధిపతుల కర్తవ్యం. ప్రతివారు ఆరోగ్య నియమాలు, సూత్రాలు పాటించాలి. ముఖ్యంగా యతులు సన్యాసులు ఆరోగ్య సూత్రాలను విధిగా అనుసరిస్తారు. ఆయా ఋతువుల్లో ఆహార నియమాలు పాటిస్తే రోగాలు రావు.