Bheemgal
-
TS: స్కూల్లో 90 మంది విద్యార్థినిలకు అస్వస్థత.. మంత్రి సీరియస్
సాక్షి, భీంగల్: ఫుడ్ పాయిజన్ కారణంగా కస్తూర్భా పాఠశాలలో దాదాపు 90 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. తీవ్రమైన కడుపునొప్పితో పాటుగా వాంతులు చేసుకున్నారు. దీంతో, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక, ఈ ఘటనపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా భీంగల్‌లోని కస్తూర్భా పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత పుఢ్ పాయిజన్‌తో 90 విద్యార్థినులకు కడుపునొప్పితో పాటు వాంతులు అయ్యాయి. దీంతో సిబ్బంది అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రత్యేకాధికారి శోభ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం అస్వస్థతకు గురైన విద్యార్థులందర్నీ నిజామాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే మంత్రి వేముల ప్రశాంత్ సీరియస్ అయ్యారు. దీనికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్‌కు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలని మంత్రి వేముల.. కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రస్తుతం విద్యార్థినిల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆరాతీశారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్‌తో మంత్రి మాట్లాడి.. విద్యార్థినిలకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ఇది కూడా చదవండి: డీఎస్‌కు తీవ్ర అస్వస్థత.. పరిస్థితి విషమం: ఆసుపత్రి వర్గాలు -
నిజామాబాద్: భీంగల్ కస్తూర్భా పాఠశాలలో ఫుడ్ పాయిజన్
-
కడ్తా రూపంలోనే కాదు.. తూకంలోనూ మోసాలు
సాక్షి, భీమ్‌గల్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అకవతవకలు వెలుగు చూస్తున్నాయి. కడ్తా రూపంలోనే కాదు.. తూకంలోనూ మోసాలు బయట పడుతున్నాయి. 40 కిలోల సంచికి మూడు కిలోలు ఎక్కువగా కాంటా వేస్తున్నట్లు తాజాగా వెలుగు చూసింది. భీమ్‌గల్ మండలంలోని పల్లికొండ గ్రామంలో గల ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న అక్రమాలను రైతులు ఆదివారం వెలికి తీశారు. 15 రోజుల క్రితం ముచ్కూర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో నాలుగు ఎల్రక్టానిక్ కాంటాల ద్వారా నిత్యం ధాన్యం తూకం వేసి, లారీలలో మిల్లర్లకు పంపిస్తున్నారు. అయితే, ఆదివారం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి తూకం వేసిన ఓ రైతుకు కాంటా తీరుపై అనుమానం వచ్చింది. తనకు వచ్చిన దిగుబడి ప్రకారం సుమారు 600 బస్తాల ధాన్యం రావాల్సి ఉండగా, 407 బస్తాలు మాత్రమే రావడంతో ఆ రైతు ఖంగు తిన్నాడు. దీంతో నిర్ధారణ కోసం ఒక బస్తాను మోటార్ సైకిల్‌పై గ్రామంలోని రైస్ మిల్లుకు తీసుకువెళ్లి తూకం వేయగా 40 కిలోల స్థానంలో 43 కిలోల బరువు వచ్చింది. 40 కిలోల బస్తాకు 3 కిలోలకు పైగా తేడా రావడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామంలోని ఇతర రైతులు కొనుగోలు కేంద్రం వద్దకు వచ్చి నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. రైతుల సమక్షంలో కేంద్రంలోని నాలుగు కాంటాలను తనిఖీ చేసారు. మూడు కాంటాలలో తూకం సమానంగా రాగా, ఒక కాంటాలో మాత్రం బస్తాకు 3 కిలోల వరకు తక్కువ వస్తున్నట్లు గుర్తించారు. రైతుల ఆందోళన విషయం తెలిసి తహసీల్దార్ రాజేందర్, ఆర్ఐ ధనుంజయ, సొసైటీ చైర్మన్ అక్కడకు వచ్చారు. ఏం జరిగిందో ఆరా తీశారు. అలాగే, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులతో మాట్లాడారు. సాంకేతిక లోపం కారణంగా నష్టం జరిగినందున, నష్టపోయిన రైతులకు సంచికి 3 కిలోల చొప్పున తిరిగి ఇప్పించేందుకు ఒప్పించారు. గత 15 రోజులుగా కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన ధాన్యం ట్రక్ షీట్‌ను, మిల్లుకు అప్పగించినపుడు లారీ ధర్మకాంటా రసీదును బేరీజు వేయాలని, వచ్చిన తేడాను ఆ లారీలో ఏయే రైతుల దాన్యం వెళ్లిందో గుర్తించి వారి ఖాతాలో వేయాలని అధికారులు ఆదేశించారు. ఆయా వివారలన్నీ రెండు రోజుల్లో సేకరించి, రైతులను సమావేశపరిచి వెల్లడిస్తానని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో అన్నదాతలు శాంతించారు. తేడా ఉన్న తూకం యంత్రాన్ని సీజ్ చేసి వెంట తీసుకెళ్లారు. -
క్లర్కుగా చేసిన చోటే.. చైర్‌పర్సన్‌గా..!
సాక్షి,భీమ్‌గల్ : అదృష్టమంటే ఇదేనేమో..! క్లర్కుగా పని చేసిన కార్యాలయంలోనే తొలి చైర్‌పర్సన్‌గా మల్లెల రాజశ్రీ ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మున్సిపాలిటీగా మారక ముందు గ్రామ పంచాయతీలో రాజశ్రీ క్లర్కుగా పని చేసేవారు. అయితే, 2006 నుంచి 2013 వరకు మల్లెల లక్ష్మణ్ వార్డు సభ్యుడిగా, 2013 నుంచి 2018 వరకు ఉప సర్పంచ్‌గా పని చేశారు. ఈ మధ్య కాలంలో రాజశ్రీ, లక్ష్మణ్ మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు వివాహం చేసుకున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా భీమ్‌గల్ మున్సిపాలిటీగా మారింది. చైర్పర్సన్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఈ నెల 22న జరిగిన ఎన్నికల్లో రాజశ్రీ టీఆర్ఎస్ తరఫున తొమ్మిదో వార్డు నుంచి బరిలోకి దిగి.. భారీ మెజారిటీతో గెలిచారు. సోమవారం జరిగిన పరోక్ష ఎన్నికలో ఆమె చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. -
కన్నీరు పెట్టిన మంత్రి
టీఆర్ఎస్ నేత కలీం హత్య కేసులో నిందితులకు శిక్ష పడేలా చూస్తామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి బుధవారం హామీ ఇచ్చారు. భీమ్‌గల్‌లో కలీం కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. సాక్షి, నిజామాబాద్: మండంలలోని బాబాపూర్‌లో రెండు రోజుల క్రితం హత్యకు గురైన ఖలీం కుటుంబాన్ని అన్ని విధాలా అదుకుంటామని, వారికి అండగా ఉంటామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం ఆయన భీమ్‌గల్ పట్టణంలోని కర్నె గల్లీలో కలీం ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఖలీం భార్య, కూతురు, కుమారుడితో పాటు, నెలల బాలుడిని చూపి దుఖం ఆపుకోలేక విలపించారు. వారిని ఓదార్చరు. నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చూస్తానని కుటుంబ సభ్యులకు మాటిచ్చారు. వారు ఎంతటివారైనా వదిలేదిలేదన్నారు. తాను వివరాలు కనుక్కున్నానని, అధికారులు వేగంగా విచారిస్తున్నారన్నారు. ఖలీం కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అందాల్సిన అన్ని ప్రయోజనాలు అందించేందుకు తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానన్నారు. తక్షణ సాయం కింద రూ.లక్ష నగదును అందజేశారు. ఖలీం హత్యకు కారణమైన భూవివాదం విషయంలో న్యాయ పరంగా, రెవెన్యూ పరంగా సహాయం చేస్తానన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసాత్మక ఘటనలకు తావులేదన్నారు. స్వతహాగా ప్రొఫెషనల్ చిత్రకారుడైన ఖలీం గీస్తున్న, సగం పూర్తయిన మంత్రి వేముల చిత్రపటాన్ని మృతుడి సోదరులు మంత్రికి చూపించారు. ఖలీం తన కుటుంబానికి లేకపోయినా కాలనీవాసుల మంచి చెడ్డలు చూసేవాడన్నారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా అప్పుచేసి మరీ వేసవిలో కాలనీవాసులకు ట్యాంకర్ ద్వారా నీరు అందించాడన్నారు. నిరంతరం ప్రజల కోసం తపించే ఖలీం మృతితో అతడి కుటుంబం వీధిన పడే పరిస్థితి నెలకొందన్నారు. తామె విరాళాలు వేసి అందజేసామని కాలనీవాసులు పేర్కొన్నారు. తాను అన్ని విధాలు ఆదుకుంటామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. మంత్రి వెంట ఆర్డీవో శ్రీనివాసులు, ఏసీపీ వెగ్గలం రఘు, సీఐ సైదయ్య, జెడ్పీటీసీ చౌట్పల్లి రవి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ దొనకంటి నర్సయ్య ఉన్నారు. -
ఏంది ఈ రోడ్డు ? ఎలా వెళ్లేది !
సాక్షి, భీమ్‌గల్(నిజామాబాద్) : మండలంలోని సంతోష్‌నగర్ తండాలో నీటి లీకేజీ కారణంగా ప్రధాన రహదారి దెబ్బ తినడంపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమ్‌గల్‌లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన కలెక్టర్ రామ్మోహన్‌రావుతో కలిసి కారులో బయల్దేరారు. అయితే, తండా వద్దకు రాగానే రోడ్డంతా దెబ్బతిని బురదమయం కావడాన్ని గమనించిన మంత్రి.. వాహనాన్ని ఆపి కిందికి దిగారు. రోడ్డు ఇలా కావడంపై సర్పంచ్ ఎంజీ నాయక్‌ను ప్రశ్నించారు. పక్కనే ఉన్న భగీరథ పైపులైన్ లీకేజీ కారణంగా నీరు రోడ్డుపై ప్రవహించి బురదమయంగా మరుతోందని సర్పంచ్ తెలిపారు. దీంతో ఆయన అక్కడి నుంచే ఎస్ఈతో ఫోన్లో మాట్లాడి వెంటనే రోడ్డును సరిచేయాలని ఆదేశించారు. -
భీమ్‌గల్‌లో చిరుత సంచారం
భీమ్‌గల్ : నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. మండలంలోని లింబాద్రి గుట్టపై చిరుత సంచరిస్తూ ఆవు దూడలపై దాడి చేస్తోందని గ్రామస్థులు గుర్తించారు. దీంతో వారు అటవీ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు గుట్టపై చిరుత సంచారానికి సంబంధించిన ఆధరాలు సేకరిస్తున్నారు. -
'తాగడానికి నీరివ్వకుండా.. బీరు కంపెనీలకు ధారపోత'
భీమ్‌గల్ (నిజామాబాద్) : ప్రజలు తాగేందుకు నీరు ఇవ్వకుండా తెలంగాణ సర్కారు బీరు కంపెనీలకు మాత్రం నీటిని సరఫరా చేస్తోందని ఏఐసీసీ నాయకుడు మధుయాష్కీ మండిపడ్డారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, తీవ్ర నీటి కరువుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తగిన చర్యలు తీసుకోవడంలో సర్కారు విఫలమైందని విమర్శించారు. -
యువకుడి ఆత్మహత్య
భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండల కేంద్రంలో కోటగిరి పవన్ (29) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం మధ్యాహ్నం అయ్యప్పగనర్లోని తన ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పవన్ గత కొంతకాలంగా గల్ఫ్‌లో ఉంటున్నాడు. మూడు రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. ఇంతలోనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. పవన్ ఆత్మహత్యతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. పవన్ కు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన యువతితో కొన్నేళ్ల క్రితం వివాహమయ్యింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఏడాదిగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
విహార యాత్రలో విద్యార్థిని మృతి
భీమ్‌గల్: విహార యాత్ర విషాదం నింపింది. భీమ్‌గల్ మండలంలోని బాచన్పల్లి గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థిని ఆకుల నిఖిత(15) పాఠశాల నుంచి వెళ్లిన విహార యాత్రలో మృతి చెందింది. వివరాల్లోకెలితే గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థులను సంక్రాతి సెలవుల్లో విహార యాత్రకు తీసుకువెళ్లారు. సుమారు 50 మంది విద్యార్థులను 7 గురు ఉపాధ్యాయుల సంరక్షణలో ప్రయివేటు టూరిస్టు బస్సులో శనివారం బయలుదేరి వెళ్లారు. ఆదివారం తమిళనాడులోని వేలూరుకు సమీపంలో వయాఅంబాడి గ్రామ సమీపంలో నిఖిత అస్వస్థతకు గురైంది. పాఠశాల సిబ్బంది స్థానికంగా వైద్యుడి వద్ద చికిత్స చేయించారు. చికిత్స అనంతరం కొద్దిగా ఆరోగ్యం కుదుటపడిందన్నారు. తెల్లవారు జామున మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురైందని, ఫిట్స్ రాగా వేలూర్‌లోని వైద్యకళాశాలకు తరలించామన్నారు. అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు తెలిపారన్నారు. ఈ విషయం తెలిసిన విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.