Ashleigh Barty: ఈమె ఓ క్రికెటర్ అన్న విషయం తెలుసా..?
లండన్: 41 ఏళ్ల తర్వాత వింబుల్డన్ టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియన్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన ఆష్లీ బార్టీ.. ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి అడుగుపెట్టక ముందు కొంతకాలంపాటు క్రికెట్ ఆడిందన్న విషయం చాలా మందికి తెలీదు. 2011లో జూనియర్ బాలికల వింబుల్డన్ టైటిల్ నెగ్గిన బార్టీ.. 2014లో ఆటపై ఆసక్తి కోల్పోయి రెండేళ్లపాటు టెన్నిస్ నుంచి బ్రేక్ తీసుకుంది. 2015–2016లో బిగ్‌బాష్ మహిళల టీ20 క్రికెట్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ జట్టు తరఫున బరిలోకి దిగింది. అయితే క్రికెటర్‌గా అంతగా సఫలం కాకపోవడంతో 2016లో టెన్నిస్‌లోకి పునరాగమనం చేసింది. బార్టీ 2015లో క్వీన్స్లాండ్ తరఫున 2 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో కూడా ఆడింది. రైట్ హ్యాండ్ బ్యాటింగ్, మీడియం పేస్ బౌలింగ్ చేసే బార్టీ.. 19 ఏళ్ల వయసులోనే ఆసీస్ అండర్-15 జట్టు కోచ్‌గా కూడా వ్యవహరించింది.
2019లో తొలి గ్రాండ్‌స్లామ్(ఫ్రెంచ్ ఓపెన్) సాధించిన 25 ఏళ్ల బార్టీ.. శనివారం జరిగిన ఫైనల్లో ఎనిమిదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై 6–3, 6–7 (4/7), 6–3తో విజయం సాధించి వింబుల్డన్ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ క్రమంలో ఆమె పలు ఘనతలను సొంతం చేసుకుంది. వింబుల్టన్‌లో జూనియర్, సీనియర్ మహిళల సింగిల్స్ టైటిల్స్ గెలిచిన నాలుగో క్రీడాకారిణిగా నిలిచింది. గతంలో యాన్ షిర్లే జోన్స్ (బ్రిటన్–1956, 1969), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్–1994, 1997), అమెలీ మౌరెస్మో (ఫ్రాన్స్–1996, 2006) ఈ ఘనత సాధించారు. అలాగే, వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన మూడో ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా అరుదైన గుర్తింపు దక్కించుకుంది. గతంలో మార్గరెట్ కోర్ట్ స్మిత్ (1963, 1965, 1970), ఇవోన్ గూలాగాంగ్ (1971, 1980) మాత్రమే ఈ ఘనత సాధించారు.