Big Bash T20 match
-
‘బిగ్‌బాష్’లో షఫాలీ, రాధ
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ టీనేజ్ సెన్సేషన్ షఫాలీ వర్మకు మరో మంచి అవకాశం లభించింది. ఇంగ్లండ్‌లో జరిగే ‘హండ్రెడ్’లో బర్మింగ్‌హామ్ ఫోనిక్స్‌కు ఆడనున్న షఫాలీ... ఆస్ట్రేలియాలో జరిగే మహిళల బిగ్‌బాష్ లీగ్ టి20 టోర్నమెంట్లో కూడా బరిలోకి దిగనుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. లీగ్‌లో ఆమె సిడ్నీ సిక్సర్స్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం నంబర్‌వన్‌గా ఉన్న 17 ఏళ్ల షఫాలీ, భారత్ తరఫున 22 మ్యాచ్‌లలో 148.31 స్ట్రయిక్‌రేట్‌తో 617 పరుగులు చేసింది. మరో భారత క్రీడాకారిణి, 21 ఏళ్ల రాధా యాదవ్ కూడా బిగ్‌బాష్‌లో ఆడే అవకాశం ఉంది. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్‌తో కూడా సిడ్నీ సిక్సర్స్ టీమ్ చర్చలు తుది దశకు చేరాయని సమాచారం. బిగ్‌బాష్ లీగ్‌లో భారత్ నుంచి గతంలో హర్మన్‌ప్రీత్ (సిడ్నీ థండర్), స్మృతి మంధాన (బ్రిస్బేన్ హీట్స్), వేద కృష్ణమూర్తి (హోబర్ట్ హరికేన్స్) ప్రాతినిధ్యం వహించారు. -
బిగ్‌బాష్ విజేత రెనెగేడ్స్
మెల్బోర్న్: ప్రతిష్టాత్మక బిగ్‌బాష్ లీగ్ టి20 టోర్నీ టైటిల్‌ను తొలిసారి మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్టు చేజిక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో రెనెగేడ్స్ జట్టు మెల్బోర్న్ స్టార్స్‌పై 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. మెల్బోర్న్లోని డాక్‌ల్యాండ్స్ స్టేడియంలో అదే నగరానికి చెందిన రెండు జట్ల మధ్య ఆసక్తికరంగా సాగిన తుది పోరులో చివరకు రెనెగేడ్స్దే పైచేయి అయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రెనెగేడ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 145 పరుగులు చేయగా... అనంతరం స్టార్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులకే పరిమితమైంది. ముందుగా రెనెగేడ్స్ తరఫున టామ్ కూపర్ (35 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), డేనియల్ క్రిస్టియాన్ (30 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఆరో వికెట్‌కు అభేద్యంగా 58 బంతుల్లో 80 పరుగులు జోడించి జట్టుకు చెప్పుకోదగ్గ స్కోరు అందించారు. 15 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు స్కోరు 91 పరుగులే. అయితే చివరి 5 ఓవర్లలో రెనెగేడ్స్ 54 పరుగులు రాబట్టింది. అనంతరం సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన స్టార్స్‌కు ఓపెనర్లు బెన్ డంక్ (45 బంతుల్లో 57; 4 ఫోర్లు, 1 సిక్స్), మార్కస్ స్టొయినిస్ (38 బంతుల్లో 39; 2 ఫోర్లు, 1 సిక్స్) శుభారంభం అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 77 బంతుల్లో 93 పరుగులు జోడించారు. చేతిలో 10 వికెట్లు ఉండగా... గెలుపు కోసం స్టార్స్ మిగిలిన 43 బంతుల్లో 53 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. ఈ దశలో ట్రైమెన్ (2/21), బాయ్స్ (2/30), క్రిస్టియాన్ (2/33) మ్యాచ్‌ను మలుపు తిప్పారు. వీరి దెబ్బకు స్టార్స్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఫలితంగా ఆ జట్టు 43 బంతుల్లో 7 వికెట్లు చేజార్చుకొని 39 పరుగులే చేయగలిగింది. ప్రధాన ఆటగాళ్లు హ్యాండ్స్కోంబ్ (0), మ్యాక్స్‌వెల్ (1), మ్యాడిసన్ (6), డ్వేన్ బ్రేవో (3) విఫలమయ్యారు. క్రిస్టియాన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. 2011లో ప్రారంభమైన బిగ్‌బాష్ లీగ్‌లో ఇది ఎనిమిదో టోర్నీ. వీటిలో పెర్త్ స్కార్చర్స్ మూడు సార్లు విజేతగా నిలిచింది. సిడ్నీ సిక్సర్స్, సిడ్నీ థండర్స్, బ్రిస్బేన్ హీట్, అడిలైడ్ స్ట్రయికర్స్ ఒక్కోసారి టైటిల్ గెలుచుకున్నాయి. -
అంపైర్ హెల్మెట్ ధరించిన వేళ..
మెల్ బోర్న్:క్రికెట్ ఫీల్డ్ లో అంపైర్లు హెల్మెట్ ధరించటం చాలా అరుదైన విషయమే. సాధారణంగా బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్, డేంజర్ జోన్లలో ఫీల్డింగ్ చేసే వారే ఎక్కువగా హెల్మెట్ తో కనిపిస్తారు. అయితే మోడ్రన్ క్రికెట్ లో వచ్చిన మార్పులతో అంపైర్లు కూడా హెల్మెట్ ధరించడానికే మొగ్గు చూపుతున్నారు. బ్యాట్స్ మెన్ బంతిని బాదుతున్న తీరు కూడా అంపైర్లకు హెల్మెట్ తప్పనిసరి అని హెచ్చరికలు పంపిస్తోంది. ఇటీవల భారత్‌లో పంజాబ్-తమిళనాడుల మధ్య జరిగిన రంజీ మ్యాచ్ సందర్బంగా ఆస్ట్రేలియాన్ అంపైర్ జాన్ వార్డ్ కు తలకు బంతి తగిలి స్వల్పంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో బుధవారం మెల్ బోర్న్-పెర్త్ స్కార్చెర్స్ ల మధ్య ఇథిహాడ్ స్టేడియంలో జరిగిన బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ లో అంపైర్ గెరాడ్ అబూద్ హెల్మెట్‌ను ధరించాడు. దీంతో హెల్మెట్ ను ధరించిన తొలి ఆస్ట్రేలియన్ అంపైర్ గా గెరాడ్ గుర్తింపు పొందాడు. తన సహచర అంపైర్ జాన్ వార్డ్ కు బంతి తగలడంతోనే హెల్మెట్ ధరించాలని బలంగా నిశ్చయించుకున్నట్లు గెరాడ్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా గతేడాది ఇజ్రాయిల్ జాతీయ క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు హిల్లెల్ అవాస్కర్ అంపైరింగ్ చేస్తూ బంతి బలంగా తగలడంతో మృతి చెందిన సంగతి తెలిసిందే.