అంపైర్ హెల్మెట్ ధరించిన వేళ..
మెల్ బోర్న్:క్రికెట్ ఫీల్డ్ లో అంపైర్లు హెల్మెట్ ధరించటం చాలా అరుదైన విషయమే. సాధారణంగా బ్యాట్స్మెన్, వికెట్ కీపర్, డేంజర్ జోన్లలో ఫీల్డింగ్ చేసే వారే ఎక్కువగా హెల్మెట్ తో కనిపిస్తారు. అయితే మోడ్రన్ క్రికెట్ లో వచ్చిన మార్పులతో అంపైర్లు కూడా హెల్మెట్ ధరించడానికే మొగ్గు చూపుతున్నారు. బ్యాట్స్ మెన్ బంతిని బాదుతున్న తీరు కూడా అంపైర్లకు హెల్మెట్ తప్పనిసరి అని హెచ్చరికలు పంపిస్తోంది. ఇటీవల భారత్లో పంజాబ్-తమిళనాడుల మధ్య జరిగిన రంజీ మ్యాచ్ సందర్బంగా ఆస్ట్రేలియాన్ అంపైర్ జాన్ వార్డ్ కు తలకు బంతి తగిలి స్వల్పంగా గాయపడ్డాడు.
ఈ నేపథ్యంలో బుధవారం మెల్ బోర్న్-పెర్త్ స్కార్చెర్స్ ల మధ్య ఇథిహాడ్ స్టేడియంలో జరిగిన బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ లో అంపైర్ గెరాడ్ అబూద్ హెల్మెట్ను ధరించాడు. దీంతో హెల్మెట్ ను ధరించిన తొలి ఆస్ట్రేలియన్ అంపైర్ గా గెరాడ్ గుర్తింపు పొందాడు. తన సహచర అంపైర్ జాన్ వార్డ్ కు బంతి తగలడంతోనే హెల్మెట్ ధరించాలని బలంగా నిశ్చయించుకున్నట్లు గెరాడ్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా గతేడాది ఇజ్రాయిల్ జాతీయ క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు హిల్లెల్ అవాస్కర్ అంపైరింగ్ చేస్తూ బంతి బలంగా తగలడంతో మృతి చెందిన సంగతి తెలిసిందే.