చిన్నచేప దొరికింది.. పెద్దది తప్పించుకుంది
బిహార్‌లో తొలిదశ పోలింగ్ ముందురోజు నితీశ్‌కుమార్ సర్కారు ఇబ్బందికర పరిస్థితిలో పడింది. నితీశ్ కేబినెట్లో పట్టణాభివృద్ధి, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్ ప్రొహిబిషన్ మంత్రిగా ఉన్న అవధేశ్ ప్రసాద్ కుష్వాహా రూ. 4 లక్షల లంచం తీసుకుంటున్నట్లుగా చూపిస్తున్న స్టింగ్ ఆపరేషన్ వీడియో వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు.
అయితే, నిజానికి ఈ విషయంలో చిన్నచేప మాత్రమే దొరికిందని, పెద్ద చేప దొరకాల్సింది గానీ, తప్పించుకుందని బీజేపీ నాయకుడు గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. అంటే, బిహార్ మంత్రివర్గంలో మరో పెద్ద నాయకుడిపై కూడా ఈ స్టింగ్ ఆపరేషన్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు మంత్రి కుష్వాహా రాజీనామాను ఆమోదం కోసం గవర్నర్‌కు పంపినట్లు అధికార జేడీయూ అధ్యక్షుడు శరద్‌యాదవ్ మీడియాకు తెలిపారు. తూర్పు చంపారన్ జిల్లాలోని పిప్రా నియోజకవర్గం అభ్యర్థిగా కూడా అవధేష్‌ను తప్పిస్తున్నామని, ఆ స్థానంలో కొత్త అభ్యర్థిని నిలబెడతామని ఆయన చెప్పారు.