'మానసిక ఒత్తిడే అసలు సమస్య'
ఇండియాకి అతి పెద్ద సవాలు ఉగ్రవాదం కాదు. జనవిస్ఫోటనం కాదు. పర్యావరణం కాదు, గ్లోబల్ వార్మింగ్ కానే కాదు. భారతదేశంలో అతి పెద్ద సమస్య మానసిక ఒత్తిడి. ప్రాణాలు తీయడంలో మానసిక ఒత్తిడే ఫస్ట్ అని టవర్స్ వాట్సన్ అనే సుప్రసిద్ధ మానవ వనరుల సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది.
బారతదేశంలో ఉద్యోగంలో యాజమాన్యం ఆపేక్షకీ, ఉద్యోగి ఆకాంక్షకి లంకె కుదరకపోవడం 40 శాతం మందిలో ఒత్తిడికి కారణం అని సంస్థ వెల్లడించింది. తక్కువ స్టాఫ్ తో ఎక్కువ పనిచేయించడం కూడా 38 శాతం మందిలో మానసిక ఒత్తిడికి దారి తీస్తోంది. పని ఒత్తిడి, కుటుంబ సమస్యల మధ్య లంకె లేకపోవడం కూడా 38 శాతం మందిలో ఒత్తిడిని పెంచుతోంది. తక్కువ జీతం, నిరంతరం పెరుగుతున్న ఆర్ధికావసరాలు కూడా ఒత్తిడికి కారణమౌతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా 22 వేల మంది ఉద్యోగులను సర్వే చేశారు. వీరిలో 2006 మంది మన దేశానికి చెందిన వారు. చాలా సంస్థల్లో మానవ వనరులను సరిగా ఉపయోగించుకునే విషయంలో, ఉద్యోగుల ఒత్తిడిని తగ్గించే విషయంలో సరైన వ్యూహాలు లేవని కూడా సంస్థ తన నివేదికలో చెప్పింది. ఒత్తిడి వల్ల హై బీపీ, డయాబెటిస్, నాడీ మండల వ్యాధులు, స్థూలకాయం, గుండెపోటు వంటి సమస్యలు తలెత్తుతున్నాయని కూడా నివేదిక తెలిపింది.