bignotes
-
నోటు.. లోటు!
జిల్లాలోని ఏటీఎంలు 485 శుక్రవారం(2వ తేదీన) పని చేసిన ఏటీఎంలు 11 మధ్యాహ్నం తర్వాత పని చేసిన ఏటీఎంలు 2 సాక్షి ప్రతినిధి, కర్నూలు: పెద్ద నోట్ల రద్దుతో జిల్లావ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఉద్యోగులు, పింఛనుదారులతో పాటు సామాజిక పింఛన్లు తీసుకునే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు కష్టాలు తప్పని పరిస్థితి. జిల్లాలో ట్రెజరీ ద్వారా(010 పద్దు కింద) వేతనాలు తీసుకుంటున్న ఉద్యోగులు 45 వేల మంది ఉన్నారు. వీరు కాకుండా ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తూ వేతనాలు తీసుకుంటున్న వారు 30వేల మంది పైనే. మొత్తం 75వేల మందికి వేతనాల రూపంలో రూ.250 కోట్ల వరకూ అవసరమవుతామని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇందులో ఇప్పటి వరకు ఈ నెల 1, 2 తేదీలను కలుపుకుని జిల్లాలోని వివిధ బ్యాంకుల ద్వారా ప్రజల చేతుల్లోకి వచ్చిన మొత్తం కేవలం రూ.85 కోట్లు మాత్రమే. అంటే ఉద్యోగులతో పాటు ఇతర ప్రజలకు కలిపి పంపిణీ చేసిన మొత్తం. ఇక ప్రైవేటు ఉద్యోగుల ఇబ్బందులు మరింత అధ్వానం. జిల్లా కేంద్రంలో ఉన్న ఎస్బీఐ ట్రెజరీశాఖలో అకౌంటు ఉన్న ఉద్యోగులకు ఒకేసారి రూ.24 వేల మొత్తాన్ని అందజేయడంతో ప్రభుత్వ ఉద్యోగులు కాస్తా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఇతర శాఖల్లో అకౌంట్లు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు ఉద్యోగులు మాత్రం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కేవలం రూ.2 వేలతో ఇంటి అద్దె ఎలా కట్టాలని? పిల్లల ఫీజులు, పాల బిల్లు తదితర అవసరాలు ఎలా తీర్చుకోవాలని వాపోతున్నారు. ఏటీఎంలలో డబ్బులు తీసుకుందామంటే జిల్లాలోని మెజార్టీ ఏటీఎంలు ఎక్కడా పనిచేయడం లేదు. పనిచేస్తున్న కొద్దిపాటి ఏటీఎంలలోనూ నగదు పెట్టిన రెండు, మూడు గంటలకే ఖాళీ అవుతోంది. ఇక మధ్యాహ్న భోజన నిర్వాహకులు తమ వద్దనున్న కమ్మలను కుదువపెట్టి మరీ మధ్యాహ్న భోజనాన్ని వడ్డించాల్సిన దుస్థితి నెలకొంది. పింఛన్లకు పడరాని పాట్లు ఇక సామాజిక పింఛను పొందే లబ్ధిదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకు ఖాతాలలో పింఛను సొమ్ము వేస్తామని ప్రభుత్వం అంటోంది. అయితే, జిల్లావ్యాప్తంగా ఖాతాలేని పింఛనుదారులే ఏకంగా 66వేల మంది ఉన్నారు. వీరందరికి ఇప్పుడు ఖాతాలు తెరవాల్సిన అవసరం ఉంది. ఖాతా ఉన్నప్పటికీ బ్యాంకులో వేసిన మొత్తాన్ని తీసుకునేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉదాహరణకు జిల్లాలోని కోవెలకుంట్ల మండలంలో మొత్తం 4వేల మంది పింఛనుదారులు ఉన్నారు. వీరికి పింఛను సొమ్ము ఇచ్చే బాధ్యతను 6గురు బిజినెస్ కరస్పాండెంట్లకు అప్పగించారు. రోజుకు కేవలం 50 మందికి మాత్రమే పింఛను ఇస్తామని అంటున్నారు. అంటే రోజుకు 50 మందికి చొప్పున ఈ బిజినెస్ కరస్పాండెంట్లు 300 మందికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది. అంటే మండలంలోని మొత్తం 4వేల మందికి పింఛను ఇచ్చేందుకు ఏకంగా 13 రోజులు పడుతుందన్నమాట. అదీ బ్యాంకులో ఖాతా ఉంటేనే. ఇక ఖాతాలేని వారికి ఈ నెల పింఛను అందేది అనుమానమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరికొన్ని మండలాల్లో ఈ నెల 6వ తేదీ తర్వాత పింఛన్లను పంపిణీ చేస్తామని చెబుతున్నారు. అంటే ఈ మండలాల్లో పింఛను వచ్చే సరికి నెలాఖరు అవుతుందన్నమాట. కేవలం పింఛను మీదనే ఆధారపడి జీవిస్తున్న వారి పరిస్థితి దారుణంగా ఉంది. మూతపడిన ఏటీఎంలు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు ఏటీఎంలు ఉన్నాయి. జిల్లా కేంద్రం మొదలుకుని మండల కేంద్రంతో పాటు కొన్ని ప్రధాన గ్రామాల్లో ఏటీఎంలు ఏర్పాటయ్యాయి. ఈ విధంగా మొత్తం 485 ఏటీఎంలు జిల్లాలో ఉన్నాయి. ఇందులో శుక్రవారం(ఈ నెల 2న) పనిచేస్తోంది కేవలం 11 ఏటీఎంలు మాత్రమే. ఇందులో 10 ఎస్బీఐకి చెందినవి కాగా ఒకటి మాత్రం యాక్సిస్ బ్యాంకుది. ఈ ఏటీఎంల్లో కూడా కేవలం రూ.2 వేల నోటు మాత్రమే వస్తోంది. పనిచేసిన ఏటీఎంల్లో కూడా మధ్యాహ్నానికే ఒకటి రెండు మినహా అన్ని ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఎప్పటికైనా నగదు పెట్టకపోతారా అనే ఆశతో ఉదయం 8–9 గంటలకే ఏటీఎంల ముందు వచ్చి కూర్చుంటున్నారు. అయితే, నగదు లేకపోవడంతో మధ్యాహ్నం 12–1 గంట ప్రాంతంలో నగదును నింపుతున్నారు. అప్పటి దాకా వేచిచూసినా అందరికీ నగదు అందుతుందనే నమ్మకం లేకుండా పోయింది. -
బంద్‌ను జయప్రదం చేద్దాం
– వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య కర్నూలు (ఓల్డ్‌సిటీ): పెద్దనోట్ల రద్దుకు నిరసనగా వామపక్షాలు సోమవారం నిర్వహించ తలపెట్టిన హర్తాళ్ (బంద్)ను జయప్రదం చేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోట్ల రద్దు అమలు విధానం సరిగ్గా లేకపోతే ఇబ్బందులొస్తాయని వైఎస్ఆర్సీపీ ముందే చెప్పిందన్నారు. సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నాలుగు రోజుల క్రితం తమ పార్టీ అధనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారన్నారు. ప్రజల పక్షాన ఉండే పార్టీలన్నీ బంద్‌లో పాల్గొంటున్నాయని, టీడీపీ ప్రజాపక్షం వహించడం లేదా అని ప్రశ్నించారు. సుమారు 20 రోజులుగా 95 శాతం మంది ప్రజల ఇబ్బందులు పడుతున్నారన్నారు. 1978లో రూ.500, రూ. 10 వేల నోట్ల రద్దు జరిగినప్పుడు ముందుగా పార్లమెంట్లో చర్చించారని, అయితే ప్రస్తుతం ప్రధాని తనంతట తనే నిర్ణయం తీసుకోవడమే కాకుండా పార్లమెంటులో గంటసేపు కూర్చుని మాట్లాడలేకపోతున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నోట్ల రద్దు కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్రంలో ఏజెంట్‌గా మారారని విమర్శించారు. చంద్రబాబు వైఫల్యంతో ప్రత్యేక హోదా రాలేదని, రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. నల్లధనం వెలికితీతకు వ్యతిరేకం కాదు: కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లధనం వెలికితీతకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం కాదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ సీఈసీ మెంబర్ కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. అన్ని పార్టీలతో పాటు వైఎస్ఆర్సీపీ కూడా భారత్ బంద్‌లో పాల్గొంటుందన్నారు. పార్టీ శ్రేణులు ఉదయం 5 గంటలకే ఆర్టీసీ బస్టాండు చేరుకుని బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. పెద్దనోట్లను రద్దు చేయాలని ముందే లేఖ రాసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడాన్ని బట్టి చూస్తే ఆయన ముందే సర్దుకుని ఉంటారనేది ప్రజలకంతా అర్థమైందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలు బంద్‌కు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర, జిల్లా, నగర నాయకులు కర్నాటి పుల్లారెడ్డి, రహ్మాన్, సత్యం యాదవ్, రాజశేఖర్, నాగరాజు యాదవ్, టి.వి.రమణ, శౌరి విజయకుమారి, సలోమి, అనిల్‌కుమార్, గోపినాథ్ యాదవ్, కటారి సురేశ్, బసవరాజు, రంగ, ఎస్.ఎ.అహ్మద్, దాదామియ్య, సఫియా ఖాతూన్, వాహిద, గౌసియా, రవీంద్రనాథ్‌రెడ్డి, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. రూ. 2000 నోట్లు ముద్రణలో మతలబు ఏమిటి: హఫీజ్ ఖాన్ సామాన్య ప్రజలకు ఉపయోగపడే చిల్లర నోట్లు రూ. 100, రూ. 50లను ముద్రించకుండా ప్రభుత్వం రూ. 2000 నోట్లు విడుదల చేయడంలో మతలబు ఏమిటని పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ ప్రశ్నించారు. పేదలు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు అన్ని వర్గాల సామాన్య ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులు తీరి నిలవాల్సిన పరిస్థితికి ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. -
పెద్ద నోట్ల రద్దు అర్థరహితం
– ముందు చిల్లర నగదు విడుదల చేయండి – కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి – ఆంధ్రా బ్యాంక్ ఎదుట డీసీసీ నిరసన కర్నూలు (ఓల్డ్‌సిటీ): పెద్ద నోట్ల రద్దు అర్థరహితమని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు. బుధవారం డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ నాయకులు కర్నూలు పెద్ద మార్కెట్ సమీపంలోని ఆంధ్రా బ్యాంకు ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ.. నల్లకుబేరులను ప్రధాని నరేంద్ర మోదీ కాపాడుతున్నారని ఆరోపించారు. రూ. 2000 విలువ చేసే పెద్దనోట్లతో పేదలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ప్రయోజనంలేని ఆలోచనలను నరేంద్ర మోదీమానుకుని ప్రజల కష్టాలు, వయోవృద్ధుల మరణాలు ఆపాలని కోరారు. నేటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఖాతాలో రూ. 2.5 లక్షల పరిమితిని సడలించి రూ. 5 నుంచి 10 లక్షల వరకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. అలాగే రూ. 100, రూ. 50 నోట్లను విరివిగా విడుదల చేయాలన్నారు. నిరసన కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు సర్దార్ బుచ్చిబాబు, డీసీసీ ఉపాధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.పి.తిప్పన్న, కార్యదర్శులు ఎస్.ఖలీల్‌బాషా, రమణారెడ్డి, చంద్రారెడ్డి, ఇమామ్పటేల్, శ్రీనివాసరెడ్డి, విజయభాస్కరరెడ్డి, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు నాగమధు, యూత్ కాంగ్రెస్ డి.ఖాసిం తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్ యార్డు పై నోట్ల రద్దు ప్రభావం
- యార్డు దిగుబడుల కొరత - స్వల్పంగా పెరిగిన పత్తి ధర - స్థిరంగా కొనసాగుతున్న వేరుశెనగ.. ఆదోని: పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన నేపథ్యంలో యార్డుకు దిగుబడుల కొరత తీవ్రమవుతోంది. దిగుబడుల కొరత వ్యాపారస్తుల మధ్య పోటీ తీవ్ర తరం చేసింది. దీంతో పత్తి ధర కొద్దిగా పెరిగింది. మంగళవారం క్వింటాలు రూ.4069 నుంచి రూ.5385 పలికింది. ఆర్థిక సంక్షోభం కారణంగా ధర తగ్గుతుందేమోనన్న ఆందోళన నేపథ్యంలో పెరిగిన ధర రైతులకు కొంత ఊరట నిచ్చింది. వేరు శనగ ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. క్వింటాలు రూ.2209 -5133గా నమోదైంది. పట్టణంలో 130కి పైగా జిన్నింగ్, ప్రెస్సింగ్ ఫ్యాక్టరీలు, 20 వరకు డిగాడి గేటర్స్ ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దుతో యార్డుకు పక్షం రోజుల్లో వారం రోజుల పాటు యార్డు అధికారులు సెలవు ప్రకటించారు. సెలవుల అనంతరం తలుపులు తెరుచుకున్నప్పటికీ యార్డుకు పత్తి, వేరుశనగ దిగుబడులు భారీగా తగ్గాయి. దీంతో ఫ్యాక్టరీలకు ముడి సరుకు కొరత ఏర్పడి కొనుగోలుకు పోటీ పడ్డారు. శని, సోమ వారాల్లో మూడేసి వేలు క్వింటాళ్ల మాత్రం పత్తి, వేరు శనగ దిగుబడులు అమ్మకానికి వచ్చాయి. అయితే ధర పెరగడంతో మంగళవారం యార్డుకు దిగుబడులు కూడా పెరిగాయి. 5826 క్వింటాళ్లు పత్తి, 6826 క్వింటాళ్ల వేరుశెనగ అమ్మకానికి వచ్చినట్లు యార్డు రికార్డులను బట్టి తెలుస్తోంది. పేమెంటే పెద్ద సమస్య.. పెద్ద నోట్ల రద్దుతో మార్కెట్లో చిల్లర నోట్ల కొరత తీవ్రంగా మారింది. దీంతో పేమెంట్ అనేది పెద్ద సమస్యగా మారింది. చెక్కుల ద్వారా మాత్రమే రైతులకు పేమెంట్ చేస్తామని కమీషన్ ఏజెంట్లు పేర్కొంటున్నారు. ఇందుకు అంగీకరించిన రైతులు మాత్రం తమ దిగుబడులను యార్డుకు తేవాలని సూచిస్తున్నారు. అయితే చెక్కుల రూపంలో చేస్తున్న పేమెంట్లు రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. తమ దిగుబడులు అమ్ముకున్నప్పటికీ చెక్కులను బ్యాంకుల్లో డిపాజిట్లు చేయాల్సి ఉంటోంది. డిపాజిట్లు అయిన చెక్కుకు సంబంధించిన డబ్బును రోజుకు రూ.2వేలకు మించి డ్రా చేసుకోడానికి వీలు లేదు. చెక్కు సదుపాయం ఉన్న రైతులు మాత్రం వారానికి రూ.24వేలు డ్రా చేసుకునే సదుపాయం ఉంది. అయితే ఏ రైతుకు కూడా చెక్కు సదుపాయం లేకపోవడం ఇబ్బందికరంగా మారింది.