బంద్‌ను జయప్రదం చేద్దాం
బంద్‌ను జయప్రదం చేద్దాం
Published Sun, Nov 27 2016 9:50 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
– వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య
కర్నూలు (ఓల్డ్‌సిటీ): పెద్దనోట్ల రద్దుకు నిరసనగా వామపక్షాలు సోమవారం నిర్వహించ తలపెట్టిన హర్తాళ్ (బంద్)ను జయప్రదం చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోట్ల రద్దు అమలు విధానం సరిగ్గా లేకపోతే ఇబ్బందులొస్తాయని వైఎస్‌ఆర్‌సీపీ ముందే చెప్పిందన్నారు. సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నాలుగు రోజుల క్రితం తమ పార్టీ అధనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారన్నారు. ప్రజల పక్షాన ఉండే పార్టీలన్నీ బంద్‌లో పాల్గొంటున్నాయని, టీడీపీ ప్రజాపక్షం వహించడం లేదా అని ప్రశ్నించారు. సుమారు 20 రోజులుగా 95 శాతం మంది ప్రజల ఇబ్బందులు పడుతున్నారన్నారు. 1978లో రూ.500, రూ. 10 వేల నోట్ల రద్దు జరిగినప్పుడు ముందుగా పార్లమెంట్‌లో చర్చించారని, అయితే ప్రస్తుతం ప్రధాని తనంతట తనే నిర్ణయం తీసుకోవడమే కాకుండా పార్లమెంటులో గంటసేపు కూర్చుని మాట్లాడలేకపోతున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నోట్ల రద్దు కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్రంలో ఏజెంట్‌గా మారారని విమర్శించారు. చంద్రబాబు వైఫల్యంతో ప్రత్యేక హోదా రాలేదని, రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు.
నల్లధనం వెలికితీతకు వ్యతిరేకం కాదు: కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
నల్లధనం వెలికితీతకు వైఎస్‌ఆర్‌సీపీ వ్యతిరేకం కాదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ సీఈసీ మెంబర్ కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. అన్ని పార్టీలతో పాటు వైఎస్‌ఆర్‌సీపీ కూడా భారత్ బంద్‌లో పాల్గొంటుందన్నారు. పార్టీ శ్రేణులు ఉదయం 5 గంటలకే ఆర్టీసీ బస్టాండు చేరుకుని బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. పెద్దనోట్లను రద్దు చేయాలని ముందే లేఖ రాసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడాన్ని బట్టి చూస్తే ఆయన ముందే సర్దుకుని ఉంటారనేది ప్రజలకంతా అర్థమైందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలు బంద్‌కు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర, జిల్లా, నగర నాయకులు కర్నాటి పుల్లారెడ్డి, రహ్మాన్, సత్యం యాదవ్, రాజశేఖర్, నాగరాజు యాదవ్, టి.వి.రమణ, శౌరి విజయకుమారి, సలోమి, అనిల్‌కుమార్, గోపినాథ్ యాదవ్, కటారి సురేశ్, బసవరాజు, రంగ, ఎస్.ఎ.అహ్మద్, దాదామియ్య, సఫియా ఖాతూన్, వాహిద, గౌసియా, రవీంద్రనాథ్‌రెడ్డి, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.
రూ. 2000 నోట్లు ముద్రణలో మతలబు ఏమిటి: హఫీజ్ ఖాన్
సామాన్య ప్రజలకు ఉపయోగపడే చిల్లర నోట్లు రూ. 100, రూ. 50లను ముద్రించకుండా ప్రభుత్వం రూ. 2000 నోట్లు విడుదల చేయడంలో మతలబు ఏమిటని పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ ప్రశ్నించారు. పేదలు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు అన్ని వర్గాల సామాన్య ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులు తీరి నిలవాల్సిన పరిస్థితికి ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు.
Advertisement
Advertisement