అమ్మకానికి ఉంచిన పత్తి దిగుబడులు
- యార్డు దిగుబడుల కొరత
- స్వల్పంగా పెరిగిన పత్తి ధర
- స్థిరంగా కొనసాగుతున్న వేరుశెనగ..
ఆదోని: పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన నేపథ్యంలో యార్డుకు దిగుబడుల కొరత తీవ్రమవుతోంది. దిగుబడుల కొరత వ్యాపారస్తుల మధ్య పోటీ తీవ్ర తరం చేసింది. దీంతో పత్తి ధర కొద్దిగా పెరిగింది. మంగళవారం క్వింటాలు రూ.4069 నుంచి రూ.5385 పలికింది. ఆర్థిక సంక్షోభం కారణంగా ధర తగ్గుతుందేమోనన్న ఆందోళన నేపథ్యంలో పెరిగిన ధర రైతులకు కొంత ఊరట నిచ్చింది. వేరు శనగ ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. క్వింటాలు రూ.2209 -5133గా నమోదైంది. పట్టణంలో 130కి పైగా జిన్నింగ్, ప్రెస్సింగ్ ఫ్యాక్టరీలు, 20 వరకు డిగాడి గేటర్స్ ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దుతో యార్డుకు పక్షం రోజుల్లో వారం రోజుల పాటు యార్డు అధికారులు సెలవు ప్రకటించారు. సెలవుల అనంతరం తలుపులు తెరుచుకున్నప్పటికీ యార్డుకు పత్తి, వేరుశనగ దిగుబడులు భారీగా తగ్గాయి. దీంతో ఫ్యాక్టరీలకు ముడి సరుకు కొరత ఏర్పడి కొనుగోలుకు పోటీ పడ్డారు. శని, సోమ వారాల్లో మూడేసి వేలు క్వింటాళ్ల మాత్రం పత్తి, వేరు శనగ దిగుబడులు అమ్మకానికి వచ్చాయి. అయితే ధర పెరగడంతో మంగళవారం యార్డుకు దిగుబడులు కూడా పెరిగాయి. 5826 క్వింటాళ్లు పత్తి, 6826 క్వింటాళ్ల వేరుశెనగ అమ్మకానికి వచ్చినట్లు యార్డు రికార్డులను బట్టి తెలుస్తోంది.
పేమెంటే పెద్ద సమస్య..
పెద్ద నోట్ల రద్దుతో మార్కెట్‌లో చిల్లర నోట్ల కొరత తీవ్రంగా మారింది. దీంతో పేమెంట్ అనేది పెద్ద సమస్యగా మారింది. చెక్కుల ద్వారా మాత్రమే రైతులకు పేమెంట్ చేస్తామని కమీషన్ ఏజెంట్లు పేర్కొంటున్నారు. ఇందుకు అంగీకరించిన రైతులు మాత్రం తమ దిగుబడులను యార్డుకు తేవాలని సూచిస్తున్నారు. అయితే చెక్కుల రూపంలో చేస్తున్న పేమెంట్లు రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. తమ దిగుబడులు అమ్ముకున్నప్పటికీ చెక్కులను బ్యాంకుల్లో డిపాజిట్లు చేయాల్సి ఉంటోంది. డిపాజిట్లు అయిన చెక్కుకు సంబంధించిన డబ్బును రోజుకు రూ.2వేలకు మించి డ్రా చేసుకోడానికి వీలు లేదు. చెక్కు సదుపాయం ఉన్న రైతులు మాత్రం వారానికి రూ.24వేలు డ్రా చేసుకునే సదుపాయం ఉంది. అయితే ఏ రైతుకు కూడా చెక్కు సదుపాయం లేకపోవడం ఇబ్బందికరంగా మారింది.