నోటు.. లోటు!
నోటు.. లోటు!
Published Fri, Dec 2 2016 9:45 PM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM
జిల్లాలోని ఏటీఎంలు 485
శుక్రవారం(2వ తేదీన) పని చేసిన ఏటీఎంలు 11
మధ్యాహ్నం తర్వాత పని చేసిన ఏటీఎంలు 2
సాక్షి ప్రతినిధి, కర్నూలు: పెద్ద నోట్ల రద్దుతో జిల్లావ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఉద్యోగులు, పింఛనుదారులతో పాటు సామాజిక పింఛన్లు తీసుకునే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు కష్టాలు తప్పని పరిస్థితి. జిల్లాలో ట్రెజరీ ద్వారా(010 పద్దు కింద) వేతనాలు తీసుకుంటున్న ఉద్యోగులు 45 వేల మంది ఉన్నారు. వీరు కాకుండా ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తూ వేతనాలు తీసుకుంటున్న వారు 30వేల మంది పైనే. మొత్తం 75వేల మందికి వేతనాల రూపంలో రూ.250 కోట్ల వరకూ అవసరమవుతామని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇందులో ఇప్పటి వరకు ఈ నెల 1, 2 తేదీలను కలుపుకుని జిల్లాలోని వివిధ బ్యాంకుల ద్వారా ప్రజల చేతుల్లోకి వచ్చిన మొత్తం కేవలం రూ.85 కోట్లు మాత్రమే. అంటే ఉద్యోగులతో పాటు ఇతర ప్రజలకు కలిపి పంపిణీ చేసిన మొత్తం. ఇక ప్రైవేటు ఉద్యోగుల ఇబ్బందులు మరింత అధ్వానం. జిల్లా కేంద్రంలో ఉన్న ఎస్‌బీఐ ట్రెజరీశాఖలో అకౌంటు ఉన్న ఉద్యోగులకు ఒకేసారి రూ.24 వేల మొత్తాన్ని అందజేయడంతో ప్రభుత్వ ఉద్యోగులు కాస్తా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఇతర శాఖల్లో అకౌంట్లు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు ఉద్యోగులు మాత్రం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కేవలం రూ.2 వేలతో ఇంటి అద్దె ఎలా కట్టాలని? పిల్లల ఫీజులు, పాల బిల్లు తదితర అవసరాలు ఎలా తీర్చుకోవాలని వాపోతున్నారు. ఏటీఎంలలో డబ్బులు తీసుకుందామంటే జిల్లాలోని మెజార్టీ ఏటీఎంలు ఎక్కడా పనిచేయడం లేదు. పనిచేస్తున్న కొద్దిపాటి ఏటీఎంలలోనూ నగదు పెట్టిన రెండు, మూడు గంటలకే ఖాళీ అవుతోంది. ఇక మధ్యాహ్న భోజన నిర్వాహకులు తమ వద్దనున్న కమ్మలను కుదువపెట్టి మరీ మధ్యాహ్న భోజనాన్ని వడ్డించాల్సిన దుస్థితి నెలకొంది.
పింఛన్లకు పడరాని పాట్లు
ఇక సామాజిక పింఛను పొందే లబ్ధిదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకు ఖాతాలలో పింఛను సొమ్ము వేస్తామని ప్రభుత్వం అంటోంది. అయితే, జిల్లావ్యాప్తంగా ఖాతాలేని పింఛనుదారులే ఏకంగా 66వేల మంది ఉన్నారు. వీరందరికి ఇప్పుడు ఖాతాలు తెరవాల్సిన అవసరం ఉంది. ఖాతా ఉన్నప్పటికీ బ్యాంకులో వేసిన మొత్తాన్ని తీసుకునేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉదాహరణకు జిల్లాలోని కోవెలకుంట్ల మండలంలో మొత్తం 4వేల మంది పింఛనుదారులు ఉన్నారు. వీరికి పింఛను సొమ్ము ఇచ్చే బాధ్యతను 6గురు బిజినెస్ కరస్పాండెంట్లకు అప్పగించారు. రోజుకు కేవలం 50 మందికి మాత్రమే పింఛను ఇస్తామని అంటున్నారు. అంటే రోజుకు 50 మందికి చొప్పున ఈ బిజినెస్ కరస్పాండెంట్లు 300 మందికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది. అంటే మండలంలోని మొత్తం 4వేల మందికి పింఛను ఇచ్చేందుకు ఏకంగా 13 రోజులు పడుతుందన్నమాట. అదీ బ్యాంకులో ఖాతా ఉంటేనే. ఇక ఖాతాలేని వారికి ఈ నెల పింఛను అందేది అనుమానమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరికొన్ని మండలాల్లో ఈ నెల 6వ తేదీ తర్వాత పింఛన్లను పంపిణీ చేస్తామని చెబుతున్నారు. అంటే ఈ మండలాల్లో పింఛను వచ్చే సరికి నెలాఖరు అవుతుందన్నమాట. కేవలం పింఛను మీదనే ఆధారపడి జీవిస్తున్న వారి పరిస్థితి దారుణంగా ఉంది.
మూతపడిన ఏటీఎంలు
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు ఏటీఎంలు ఉన్నాయి. జిల్లా కేంద్రం మొదలుకుని మండల కేంద్రంతో పాటు కొన్ని ప్రధాన గ్రామాల్లో ఏటీఎంలు ఏర్పాటయ్యాయి. ఈ విధంగా మొత్తం 485 ఏటీఎంలు జిల్లాలో ఉన్నాయి. ఇందులో శుక్రవారం(ఈ నెల 2న) పనిచేస్తోంది కేవలం 11 ఏటీఎంలు మాత్రమే. ఇందులో 10 ఎస్‌బీఐకి చెందినవి కాగా ఒకటి మాత్రం యాక్సిస్ బ్యాంకుది. ఈ ఏటీఎంల్లో కూడా కేవలం రూ.2 వేల నోటు మాత్రమే వస్తోంది. పనిచేసిన ఏటీఎంల్లో కూడా మధ్యాహ్నానికే ఒకటి రెండు మినహా అన్ని ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఎప్పటికైనా నగదు పెట్టకపోతారా అనే ఆశతో ఉదయం 8–9 గంటలకే ఏటీఎంల ముందు వచ్చి కూర్చుంటున్నారు. అయితే, నగదు లేకపోవడంతో మధ్యాహ్నం 12–1 గంట ప్రాంతంలో నగదును నింపుతున్నారు. అప్పటి దాకా వేచిచూసినా అందరికీ నగదు అందుతుందనే నమ్మకం లేకుండా పోయింది.
Advertisement
Advertisement